(దండుగుల శ్రీనివాస్)
మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ మూసీ కంపును మించిపోయాయి. ఆమెకు అలవాటైన దోరణో.. మెచ్చుకుంటారనుకున్నదో… ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకోవాలనుకున్నదో… రేవంత్ మెచ్చుకుని మెడలేసుకుంటాడనుకుందో.. కానీ ఆమె చేసిన మాటలు ఆమె మెడకే చుట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మూసీ మురికిని అంటించాయి. ఆమె ఏమన్నది..? అసలేం జరిగింది..?? బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, కొండా సురేఖకు ఓ దండ వేశాడు. మర్యాద పూర్వకంగా ఓ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ. దీనిపై బీఆరెస్ సోషల్ మీడియా వెకిలిగా కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టింది. ఇక్కడ మొదలైంది రచ్చ. దీనిపై ఆమె ప్రెస్‌మీట్ పెట్టి ఖండించింది.
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కూడా తీవ్రంగా తిట్టిపోశాడు కేటీఆర్‌ను, హరీశ్‌ను. ఇంతటితో ఆగితే సరిపోయేది. కానీ ఆమె తాజాగా కేటీఆర్‌ను ఇరకాటంలో పడేసేందుకు సినీ తారలు సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లను వాడుకున్నది. వారిపై తీవ్ర ఆరోపణలు చేసింది. సమంత ఫోన్ ట్యాపింగ్ చేసిన కేటీఆర్…ఆమెను లోబర్చుకునే ప్రయత్నం చేశాడనే విధంగా కామెంట్స్ చేసింది. అందుకే ఆమె నాగ చైతన్యతో విడిపోయిందన్నది. రకుల్‌కు డ్రగ్స్ అలవాటు చేశాడన్నది. అందుకే ఆమె కూడా వెంటనే వివాహం చేసుకుని పారిపోయిందని ఆరోపించింది. ఈ మాటలపై వెంటనే నాగార్జున స్పందించాడు. మీ రాజకీయాలను తెలుగు సినీ ఇండస్ట్రీకి పులమొద్దని హితవు పలికాడు. ప్రకాశ్ రాజ్ కూడా తీవ్రంగానే తప్పుబట్టాడు.
కేటీఆర్ సైతం దీనిపై తీవ్రంగా స్పందించి ఆమె గతంలో మాట్లాడిన తీరును కూడా ఎండగట్టాడు. లీగల్‌గా ఆమెపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇదో రకమైన కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది మంత్రి కొండా.