(దండుగుల శ్రీనివాస్ )
కేసీఆర్ ఆది నుంచి రెవెన్యూ ఉద్యోగులను చిన్నచూపు చూశాడు. వారిని పలుచన చేస్తూ పలుమార్లు మాట్లాడాడు. వారిపై నిందారోపణలు కూడా చేశాడు. తహసీల్దార్లంటేనే జనాలను పీల్చుకుతినే జలగలు అనే విధంగా మాజీ సీఎం కేసీఆర్ తీరు ఉండేది. వారిని అదే విధంగా సంబోధించేవాడు బహిరంగంగానే. కానీ ఈ సర్కార్ ఇందుకు భిన్నంగా వెళుతోంది. సర్కార్ ఏర్పడిన తొమ్మిది పది నెలలకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు తహసీల్దార్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆదివారం ఆయన దాదాపు నాలుగ్గంటల పాటు వారితో సుధీర్ఘంగా చర్చించారు. కలసి లంచ్ చేశారు.
ఓపిగ్గా వారు చెప్పిన సమస్యలన్నీ విన్నారు. రాసుకున్నారు. ప్రతీ సమస్యను పరిస్కరిస్తానని అభయమిచ్చాడు. అంతకు మించి ఆయన మాట్లాడిన మాటలు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తాను మంత్రిగానే కాదు.. మీ శీనన్నగా అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మాటిచ్చిన ఆయన.. మీరు మంచిగా పనిచేస్తేనే మాకు మంచి పేరొస్తుంది.. అని మాట్లాడిన తీరు రెవెన్యూ ఉద్యోగులను కదిలించింది. గత ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తే ఈ సర్కార్ తమ బాధ్యత ఎంతటి గొప్పదో గుర్తించిందని ఆత్మగౌరవంగా ఫీలయ్యారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామనే ధీమాను కనబరిచారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు పూర్వవైభవం తెచ్చేలా చేస్తానని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం వారిలో వెయ్యేనుగల బలాన్ని నింపింది.
తహసీల్దార్లపై కొన్ని చోట్ల కేసులు నమోదయిన విషయం తెలపగానే ఆయన వెంటనే స్పందించారు. వెంటనే డీజీపీకి ఫోన్ చేసి చెప్పారు. కలెక్టర్ పర్మిషన్ లేనిదే ఏ తహసీల్దార్‌పైనా కేసు పెట్టొద్దని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది రెవెన్యూ ఉ ద్యోగులతోనేనని ఈ ప్రజా పాలనలో మీదే కీలకపాత్ర అని ఆయన పలుమార్లు ఉద్యోగుల బాధ్యతలను గుర్తు చేస్తూ మాట్లాడుతూ వారికి కర్తవ్యబోధ చేశారు మంత్రి.
ఎన్నికల వేళ బదిలీ చేసిన తహసీల్దార్లను వెంటనే పాత చోటకి బదిలీ చేయాలని, వీఆర్ఐలను సొంత జిల్లాలకు పంపాలని, కొత్త మండలాల్లో కొత్త ఎమ్మార్వో ఆఫీసు బిల్డింగులు కట్టాలని, ఆఫీసు మెయింటెన్స్ బడ్జెట్ రిలీజ్ చేయాలి, వెహికిల్ హైర్ చార్జెస్ ఇవ్వాలని, కంప్యూటర్ ఆపరేటర్లను రెగ్యులర్ చేయాలని….ఇలా అన్నింటినీ సావధానంగా విని, రాసుకున్న పొంగులేటి అవన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ, మండల స్థాయిలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేసి సర్కార్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌతం కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్‌రెడ్డి, ప్రశాంత్, శ్రీనివాసరావు, వేణు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.