(దండుగుల శ్రీనివాస్)
తెలంగాణలో పెద్ద పండుగ దసరా. ఇక్కడి ప్రజలంతా ఆనందంగా చేసుకునే పండుగ ఇది. నిత్యావసరాల ధరలు భగ్గుమన్నా, కష్టనష్టాలెన్ని వచ్చినా ఈ పండుగకు కొత్త బట్టలు తొడుక్కుని అందరినీ కలిసి అలయ్‌బలాయ్ చేసుకుంటూ ఆనందంగా గడిపే పండుగ. జమ్మీ ఆకులే బంగారంగా ఆప్యాయంగా అందరినీ కలుసుకుని పండుగ శుభాకాకంక్షలు తెలుపుకునే పెద్ద పండుగ దసరా. దీని కోసం ఏడాది పొడుగునా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. ఆ ఏడాది మంచిగా కాలం కాకపోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా.. జీవన ప్రమాణాలు మెరుగుపడకపోయినా.. అప్పుసప్పు చేసి మరీ ఈ పండుగ చేసుకుంటారు. ఇప్పుడూ అలాగే సిద్దమయ్యారు.
కానీ రాష్ట్రమంతా ఒకలా ఉంటే.. హైదరాబాద్‌లో మరోలా ఉంది. ఇక్కడ దసరా పండుగ ఊసేలేదు. అందరూ కాదు. హైడ్రా కూల్చేసిన ప్రాంతాలు… మూసీ పరివాహక నివాసాల జీవితాలు. దసరా పండుగ కోసం ఎదురుచూడటం కాదు.. ఎప్పుడు అధికారులు వచ్చి మార్కు వేస్తారో.. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వచ్చిన తొలి దసరా పండుగ ఆనందాన్ని ఇలా హైడ్రా చిదిమేసింది. ఆ సరదా వెలుగులను చీకటిమయం చేసింది. జీవితాలనే కన్నీటి పర్యంతంగా మార్చేసింది. వేల కుటుంబాలు ఇక్కడ ఇప్పుడు ఇలాగే ఉన్నాయి.
ఆ జీవితాలకు పండుగ లేదు. అంతా దైన్యమే. ఆ కుటుంబాల్లో సరదాల్లేవు అందరిలో గుండెదడనే. ఆ ప్రాణాలకు నిమ్మళం లేదు అందరిలో ఆందోళనే. ఎవరిచ్చారో సలహా తెలియదు. తెలసీ తెలియక అడుగేశాడో అర్థం కాదు.. కానీ రేవంత్‌రెడ్డి రాంగ్ స్టెప్ వేశాడు. అనుభవరాహిత్యం ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కేసీఆర్ మొండిఘటమే. కానీ ప్రజల ఆకాంక్షలకు భయపడేవాడు. రేవంత్‌రెడ్డీ కూడా అదే కోవలో మొండిఘటమే. కానీ అంతకు మించి మూర్ఖుడు అని కూడా నిరూపించుకున్నాడు. అందరూ ఈ దఫా పండుగ చేసుకుని సంబరాల్లో ఉంటే హైడ్రా విధ్వంసంలో కూలిన సమిధిలు.. సమాధుల్లా మారిన ఆ ఇండ్లను చూస్తూ కండ్ల నిండా కన్నీళ్లు కక్కుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపే దుర్బర సమయం ఇక్కడ తాండవిస్తోంది.