వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్:
హైడ్రా బుల్డోజర్లకు మేము అడ్డుగా ఉంటాం.. మీకు మేము అండగా ఉంటాం.. చలో తెలంగాణ భవన్ అంటూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పందన కాదు కదా.. ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. ఇవాళ తెలంగాణ భవన్‌కు జాతరలా తరలివస్తారని బీఆరెస్ నేతలు భావించారు. కానీ అంత సీన్ లేదని తేలిపోయింది. కేటీఆర్ మాటను జనాలు ఖాతరు చేయలేదు. బీఆరెస్‌ను జనాలు ఇంకా నమ్మే పరిస్తితుల్లో లేరు. మీకు లీగల్ టీం అండగా ఉంటుంది.
మా తెలంగాణ భవన్‌కు రండి.. మేము అండగా ఉంటాం.. మా మీద నుంచే ఆ బుల్డోజర్లు మొదట వెళ్లాలి.. అంటూ తొడలు చరిచి మరీ శపథం చేసిన కేటీఆర్ మాటలను అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి క్షేత్రస్థాయిలో హైడ్రా పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ సమయంలో కేటీఆర్ అంతలా అభయం ఇచ్చినా ఎవరూ రాలె.. పట్టించుకోలేదంటే కేటీఆర్ మాటలకు జనాలు ఎలా రెస్పాండ్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
బీఆరెస్‌పై నాటుకుపోయిన అపనమ్మకం ఇంకా పోలేనట్టుంది. ఎవరెన్ని చెప్పినా ఇప్పుడు జనాలు వినేలా లేరు. అటు ప్రభుత్వం తాను అనుకున్నది తాను చేసుకుంటూ పోతోంది. ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆరెస్‌కు జనాధరణ లేకుండా పోతోంది. బాధిత గోడు వెళ్లబోసుకునేందుకు జనాలకు వేదిక కరువైన చందంగా రాష్ట్ర రాజకీయాలున్నాయి.