వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మొన్నటి వరకు జైలుకు వెళ్లి వచ్చిన కవితను వదలడం లేదు ఇందూరు కాంగ్రెస్ లీడర్లు. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ బీఆరెస్ పార్టీని, కవితను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎక్కడి వరకు వెళ్లారంటే కవిత కనిపించడం లేదంటూ ఆచూకీ తెలపాలంటూ వన్‌టౌన్‌లో ఫిర్యాదులిచ్చేంత వరకు. పార్టీ పేరో, ఒకరిద్దరి పేర్లో పెడితే అంత హైప్ ఉండదని, ఉద్యమకారుల పేరుతో కాంగ్రెస్ లీడర్లు కొందరు ఈ ఫిర్యాదును వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చారు. కవిత ఎక్కడ అంటూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన వెలుగు పత్రిక ఓ పెద్ద వార్త ప్రచురించిన విషయం తెలిసిందే.
అయితే ఆమె ఈనెల 15 నుంచే ప్రజలకు అందుబాటులో ఉండాలని భావించింది. కానీ కవిత అమ్మ శోభమ్మకు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఆమెకు తోడుగా ఉండాల్సి వచ్చింది. దీనిపై వాస్తవం లో అమ్మకోసం అనే శీర్షికన ఓ వార్త కథనం కూడా ప్రచురించింది. దసరా నేపథ్యంలో ఆమె బతుకమ్మ పండుగకు జాగృతి తరుపున ఇందూరుకు రానున్నారనే ప్రచారమూ జరుగుతున్న క్రమంలో మానసికంగా మరింత వేధించేందుకు కాంగ్రెస్ ఈ విధమైన చర్యలకు దిగుతుందనేది బీఆరెస్ వాదన. జనంతో మమేకమవడానికి ఆమె సంసిద్దమై ఉన్నది. దీనిపై క్లారిటీతో ఉన్నది. కానీ ఆలోపే కవిత కనించలేదనే ప్రచారంతో పైశాచికానందం పొందడమే తప్ప మరోటి కాదనే విధంగా బీఆరెస్ సెక్షన్ ఖండిస్తోంది.