(Dandugula SRINIVAS)
ఇదేందీ… తెలంగాణ భవన్‌కు ఛలో అని ఈ పిలుపేంది..? హైడ్రా పేరుతో గవర్నమెంటు కదా కూల్చివేతలకు దిగుతున్నది. మరి తెలంగాణ భవన్ ఎందుకు పోవాలె..? ఇవే కదా మీకొచ్చిన డౌట్లు. జరాగండి. ఈ పిలుపునిచ్చింది ఏకంగా కేటీయారే. ఎందుకు..? హైడ్రా పేరుతో సర్కార్ పేదల జాగాలను ఖాళీ చేయించేందుకు కష్టపడి అప్పు సప్పులు చేసి కట్టుకున్న ఇండ్లనన్నింటినీ ఎడాపెడా కూల్చేస్తుంది కదా. ఇకపై అలా జరగదంటున్నాడు రామన్న.
ఆ బుల్డోజర్లకు మేమే వెళ్లి అడ్డుగా నిలుస్తాం. మీరంతా మా దగ్గరకు రండి. మా లీగల్ టీం మీకోసం రెడీగా ఉంది. మీరంతా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తరలిరండి. ఇక ఊరుకునేది లేదు. అసలు మనజోలికొచ్చేముందు.. జాగా అమ్మినోడి మీద, బిల్డర్ మీద, అధికారుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు…? ముందు మీ లీడర్ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌజ్ ఎందుకు కూల్చలేదు…? మీ అన్న తిరుపతిరెడ్డికి నోటీసుతో ఎందుకు సరిపెట్టిండ్రు.. ఇలా ఎన్నో ప్రశ్నలు వేసి సర్కార్‌ను నిలదీసిండు.
హైడ్రా తీరుపై క్రమంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న క్రమంలో ఇగో ఇలా స్పందించిన కేటీఆర్.. ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రెడీ అయ్యాడు. తెలంగాణ భవన్‌కు ఫిర్యాదుల సెంటర్‌గా, బాధితుల పునరావాస కేంద్రంగా, ఫిర్యాదులు అందుకునే ప్రజావాణిగా మార్చేశాడన్నమాట. ఇగ రేపట్నుంచి ఇక్కడ జాతరనే ఉంటది మళ్ల.