(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఎర‌క్క‌పోయి వ‌చ్చాడు.. ఇరుక్కుపోయాడు అన్న‌ట్టుగా త‌యార‌య్యింది సీఎం రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి. అవును.. వాస్త‌వం మొద‌ట‌నే చెప్పింది. ఇది పులి మీద స్వారీ అని. ఇప్పుడు ఆ పులి మీద నుంచి దిగ‌లేడు. స్వారీ చేయ‌లేడు. ప్ర‌జ‌ల‌కు సారీ కూడా చెప్ప‌లేడు. మ‌రెలా..? ఇప్పుడు మ‌ధ్యే మార్గంగా నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తాన‌ని ఆశ చూపే వ‌ర‌కు వ‌చ్చింది ప‌రిస్థితి. మొన్నటి హైడ్రా కూల్చివేతల విధ్వంసం అంద‌రినీ త‌ట్టింది. క‌దిలించింది. స‌ర్కార్ పై అంతా క‌లిసి దుమ్మెత్తిపోసే దాకా పోయింది. దీంతో అల‌ర్ట్ అయ్యింది స‌ర్కార్‌. దీంతో పాటు త్వ‌ర‌లో మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలోని అక్ర‌మ క‌ట్ట‌డాల‌న్నీ కూల్చాల‌ని డిసైడ్ అయ్యింది. కార్యాచ‌ర‌ణ కూడా రెడీ చేస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే మ‌రింత భ‌యానికి గుర‌వుతున్న‌ది స‌ర్కార్‌. అవును ఈ ఏరియాల్లో ఉండేదంతా మాస్ పీపుల్‌. ఇక ఊరుకుంటారా..? అమ్మ‌నాబూతులు తిడ‌తారు స‌ర్కార్‌ను. అందుకే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా మీకు డ‌బుల్ బెడ్‌రూంలు ఇస్తాంగా.. ప్లీజ్‌.. ప్లీజ్‌.. అర్థం చేసుకోరూ…! అని బ‌తిమాలుకునే స్టేజ్‌కు వ‌చ్చింద‌న్న‌ట్టు. అవును డ‌బుల్‌బెడ్ రూం ఇండ్లంటే గుర్తొచ్చింది. ఈ ప‌దేండ్ల‌లో కేసీఆర్ ఈ ఆశ చూపి ఎంత మంది పేద‌ల‌కు గూడు క‌ట్టించి ఇచ్చాడంటావ్‌. ఇదో అట్ట‌ర్ ఫ్లాప్ స్కీమ్‌. రాష్ట్రంలోని పేద‌లంద‌రీ చెవిలో పువ్వులు పెట్టాడు కేసీఆర్‌. అంద‌రినీ మోస‌గించాడు ఈ ప‌థ‌కం ద్వారా. దీన్ని అమ‌లు చేయ‌లేక చేతులెత్తేశాడు.

25Vastavam.in

ఇక ఈ స‌ర్కార్ వ‌చ్చిన త‌రువాత ఎంత మంది ఇళ్ల‌కు భ‌రోసా క‌ల్పించింది. అస‌లు ఆ ఊసు తీస్తే క‌దా. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం కింద ఐదు ల‌క్ష‌లు సాయం చేస్తాన‌న్న‌ది. అది ఇంత వ‌రకు లేదు. ఇప్ప‌ట్లో ఉండ‌దు కూడా. మ‌రి పేద‌ల గూడు తో చెల‌గాట‌మాడిన కేసీఆర్ బాట‌లోనే మ‌న రేవంతూ వెళ్తున్నాడు. ఇలా మ‌సిపూసి మారెడు కాయ చేయ‌డంలో ప్ర‌జ‌ల‌ను మోస‌గించ‌డంలో నేత‌లంద‌రిదీ ఒకేదారి ఉన్న‌ట్టుంది సుమా..!

హైడ్రా పై దిద్దుబాటు చర్యలకు దిగుతోంది ప్రభుత్వం. ప్రజల నుంచి క్షేత్రస్థాయిలో క్రమంగా వస్తున్న వ్యతిరేకతతో ఒక్క‌సారి అలర్ట్ అయినా సర్కార్ ఒక ఆయింట్మెంట్ పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరు డబుల్ బెడ్ రూమ్ స్కీం. అవును గత సర్కార్ ఈ డబుల్ బెడ్ రూమ్ స్కీం ఆశ చూపి పదేళ్లు కాలయాపన చేసింది. పేదలను మోసం చేసింది. పేదవాడికి గూడు లేకుండా చేసింది. ఇప్పుడు అదే స్కీమును ఇక్కడ ఆశ చూపి కొంత వ్యతిరేకత తగ్గించుకుందామని ప్రయత్నం చేస్తోంది రేవంత్ స‌ర్కార్‌. ఎందుకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరు మళ్ళీ హైదరాబాద్ నేపథ్యంలో ముందుకు వచ్చింది..? ఇటీవల హైడ్రా కూల్చిన కొన్ని కట్టడాల విషయంలో జనం గగ్గోలు పెట్టారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి శాపనార్ధాలు పెట్టిన వైనం అందరిని కలిసివేసింది. కదిలించింది. ప్రభుత్వం పై వ్యతిరేకతను పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా సర్కార్ ఓ ప్రకటన చేసింది. అదేంటంటే.. మూసీ పరివాహక ప్రాంతంలో ఆ నది పొడుగునా ఉన్న అక్రమ కట్టడాల నిర్మాణాలను కూల్చివేసేందుకు కసరత్తు చేస్తున్నది. దాదాపు 13వేల అక్రమ కట్టడాలు దీని పరిధిలో ఉన్నాయని గుర్తించింది. వీటికి స్పాట్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.

కానీ మొన్నటి మాదిరిగానే ఇందులో వేలు పెడితే తీవ్ర వ్యతిరేకత మాత్రం తథ్యం. అందుకే సర్కార్ తెలివిగా వీళ్ళందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్తోంది. అసలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ ఉన్నాయి..? ఆ సర్కార్ కట్టింది ఎంత మందికి ఇచ్చింది..? ఈ సర్కార్ వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమ్ ను టచ్ చేసిందా..? ఇవన్నీ ప్రజలకు తెలియదా..? అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు రేవంత్ ఇద్దరూ హౌసింగ్ స్కీం విషయంలో జనాలను మోసం చేస్తూనే వస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అనగానే జనాలు నుంచి కొంత ఆగ్రహం తగ్గి చల్లబడతారని, వ్యతిరేకత తగ్గుతుందని రేవంత్ సర్కార్ భావిస్తుంది.

ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీం కింద ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. అది రేపు మాపు అంటూ దరఖాస్తుల పర్వంతోనే సాగ‌దీస్తున్నారు. ఇప్పటివరకు లబ్ధిదారులని ఎంపిక చేసింది లేదు. ఎవరికి ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. కానీ డబుల్ బెడ్ రూమ్ మంత్రాన్ని మాత్రం హైడ్రా విషయంలో వాడుతున్నారు. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను పసిగట్టాడు. వెంటనే ప్రభుత్వానికి సూచన చేశాడు. చెరువుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలకు సంబంధించిన వాటికి అనుమతులు ఇవ్వద్దు.. రిజిస్ట్రేషన్లు చేయొద్దు.. పర్మిషన్లు ఇవ్వద్దు అని. ఇదేదో అప్పటినుంచి చేస్తే బాగుండేదేమో. చేయలేదు. నోటీసులు ఇవ్వలేదు. వారు లెక్కలు చూసుకొని ఒక్కసారిగా దాడి చేసి కూల్చేచేయడంతో బిఆర్ఎస్ కి అంది వచ్చిన అస్త్రంగా మారింది. పేద జనం నష్టపోతున్నారని మెసేజ్ జనాల్లోకి వెళ్లిపోయింది. దీని ద్వారా ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీన్ని ఇప్పుడు అప్పుడే రూపుమాపేలా లేదు. సర్కార్ కు అది సాధ్యమయ్యేలా కూడా కనిపించడం లేదు. అందుకే మ‌ధ్యే మార్గంగా డబుల్ బెడ్ రూమ్స్ స్కీమ్‌ను తెర‌ పైకి తెచ్చింది. ఒక కేసీఆర్ కు, రేవంత్ కు పేదలను మోసం చేసేందుకు డబుల్‌ ఇండ్ల స్కీం ఇలా పనిచేస్తుంది అన్నట్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed