(దండుగుల శ్రీనివాస్)
కేటీఆర్ మరీ దిగజారాడు. కేసీఆర్ కంటే. పెద్దాయన అధికారం పోయిన తరువాత ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యాడు. ఉలుకు లేదు పలుకు లేదు. జనం వరదల్లో కొట్టుకుపోయినా పట్టింపులేదు. అంతకు మించి తయారయ్యాడు కేటీఆర్. ముందే కేటీఆర్ ఓ అహంకారిగా ముద్రపడి ఉన్నాడు. అధికారం పోయిన తరువాత కూడా అతను మారలేదు. కేసీఆర్ మారడు. కేటీయారూ మారడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పడమంటే… అమెరికా నుంచి శనివారం హుటాహుటిన తిరిగి వచ్చిన కేటీఆర్ పాడి కౌషిక్‌రెడ్డి ఇంటికి వెళ్లాడు. పరామర్శించాడు. ఆ తరువాత ప్రెస్‌మీట్ పెట్టాడు. ఆ ప్రెస్‌మీట్లో మరీ దిగజారిపోయి మాట్లాడాడు.
ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రాంతీయత గురించి మరీ నొక్కి వాక్కాణించాడు. ఈ ఇష్యూను మొదట తీసి తీట కయ్యం పెట్టుకున్నది పాడి కౌషిక్ రెడ్డే. నువ్వో ఆంధ్రోడివి… బతకడానికి వచ్చినవ్.. అని అరికపుడి గాంధీనుద్దేశించి వ్యాఖ్యానించాడు. ఇప్పుడు దీన్నే హైలెట్ చేశాడు కేటీఆర్. అంటే అప్పటి వరకు మిడి మిడి జ్ఞానంతో, అవగామన రాహిత్యంతో కౌషిక్‌రెడ్డి మాట్లాడాడని అంతా అనుకున్నారు. కానీ కేటీఆర్ ఇదే ఇష్యూను బలంగా వాదించే సరికి ఇది పక్కా ప్లానింగ్‌గా అర్థమయిపోయింది. కేటీఆర్, కేసీఆర్ ఆదేశాల మేరకే పాడి ఈ మాటలు అన్నాడనేది క్లారిటీ.
మరీ ఇంత దిగజారుడా అనిపించింది ఇది తెలిసిన తరువాత. ఎందుకంటే మీరే ఆ అంశాన్ని లేవనెత్తి, దాన్ని బట్టకాల్చి మీదేసినట్టు రేవంత్ రెడ్డిపై తోసేయడం మరీ చీప్ పాలిటిక్స్ కాదా. అంతే కాదు. కేటీఆర్‌లో మరీ ఫ్రస్టేషన్ ఎక్కువయ్యిందనడానికి మరో ఉదాహరణ ఏంటంటే…. సీఎం రేవంత్‌పై బాడీ షేమింగ్ కామెంట్స్‌కు దిగడం. నువ్వో పొట్టినాయుడు, చిట్టి నాయుడు అంటూ వల్గర్ కామెంట్లు చేశాడు. ఏం పీక్కుంటావో పీక్కో అని గల్లీ లీడర్‌లా దిగజారాడు. హైదరాబాద్‌పై ఎక్కడ పెత్తనం పోతుందోననే భయమా..? ఎమ్మెల్యేలంతా వరుస కడతారనే అభద్రతా భావమా..? అధికారం దూరమయ్యిందనే ఆక్రోషమా..?? మొత్తానికి కేటీఆర్‌లో పరిపక్వత రాలేదు సరికదా మరింత కుంచించుకుపోయి ఇలా నోటికి అద్దూపద్దూ లేకుండా మాట్లాడి మరింత నవ్వులపాలయ్యాడు. పార్టీని ప్రజలకు మరింత దూరం చేసేందుకు గొయ్యి తవ్వుకుంటున్నాడు. సర్కార్‌ను ప్రశ్నించేందుకు చాలా విషయాలున్నాయి. రుణమాఫీ ఇంకా కాలేదు. రైతు భరోసా రాలేదు. పింఛన్లు లేవు… హామీలేవీ అమలు కాలేదు… ఇవన్నీ వదిలిపెట్టి పాడి కౌషిక్ రెడ్డి అనే ప్రజలు ఏమాత్రం పట్టించుకోని నాయకుడిని పట్టుకుని కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు ఏదో రాజకీయం చేయబోయి బొక్కబోర్లా పడ్డాడు కేటీఆర్.