(దండుగుల శ్రీనివాస్)
ఎమ్మెల్సీ కవిత అందుబాటులోకి వచ్చారు. ఆదివారం నుంచి ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో అందరితో కలిసేందుకు టైం ఇచ్చారు. ఇక వరుసగా ఆమెను కలిసేందుకు జిల్లాల నుంచి వచ్చిన వారందరితో ఆమె కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అందరికీ సమాచారం అందింది. ఆమె నివాసం మళ్లీ జాతరను తలపించనుంది. అయితే అప్పటికీ ఇప్పటికే చాలా మార్పులే చోటు చేసుకోనున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె జైలు పాలయిన తరువాత ఐదు నెలల పాటు నరకయాతనను అనుభవించింది. పాత తప్పుల నుంచి కొత్త గుణపాఠాల రాజకీయ జీవితంలోకి ఆమె అడుగుపెట్టనుంది.
ఓ రకంగా చెప్పాలంటే ఇది ఆమె పొలిటికల్ లైఫ్‌కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిందన్నమాట. పార్టీ ఓడి.. ప్రభుత్వం పోయిన తరువాత ఆమె సొంత జిల్లాలో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు.. అంతా కలిసి జిల్లాలో పార్టీని భ్రష్టుపట్టించారు. ఎమ్మెల్యేలదే అక్కడ అంతా అధికారం. కవిత చెప్పింది అక్కడ అమలు కాలేదు. ఆమె కూడా ఎమ్మెల్యేలకు భయపడింది. ఏమీ చెప్పలేకపోయింది. హార్డ్ కోర్ కార్యకర్తలు, నాయకులను కాపాడుకోవడంలో ఆమె పూర్తి వైఫల్యం చెందింది. ఈ పరిణామాలు పార్టీని ప్రతిష్టను మరింత దిగజార్చాయి.
జిల్లాలో పార్టీ కంచుకోటలా ఉండేది. ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఓడిన ఎమ్మెల్యేలే ఇంకా నియోజకవర్గ ఇంచార్జిలు. ఆమె లేక అనాధగా మారిన జిల్లా.. ఇంచార్జిలు ఆ వైపుకూడా రాక మరింతగా దారుణంగా అక్కడ పార్టీ పరిస్థితి తయారయ్యింది. ఇప్పుడామె ఈ తప్పులన్నింటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నదా..? ఇంతకు పూర్వంలా జనాలు ఆమెను కలవాలంటే కోటరీ గోడలు బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందా..? వారిని దాటి వెళ్లేందుకు మార్గం సులువయ్యిందా..? ఇంకా అట్లనే అక్కడి వాతావరణం ఆమెను నాలుగు గోడలకు బందీ చేసేలా ఉందా..? జైలు గోడల నుంచి నాలుగు గోడలకే ఎమ్మెల్సీ కవిత పరిమితం కానుందా..? స్వేచ్చగా జనంతో మేమకం కానుందా..? రానున్న రోజులే ఈ ప్రశ్నలకు సమాధానాలు.