(దండుగుల శ్రీనివాస్)
కొండంత రాగం తీసి… అన్నట్టుగా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఏదో చెప్తారని, ఇంకేదో చేస్తారని అనుకుంటే ఏమీ లేదు. ఓన్లీ హైడ్రా జపమే చేసింది సర్కార్. హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ పలు నిర్ణయాలు తీసుకున్నది. ఇప్పుడు ఉన్నపళంగా హైడ్రాకు అధికారాలు అధికంగా కట్టబెట్టడం మూలంగా జనాలకు వచ్చిందేమీ లేదు. చాలా సమస్యలు, హామీల అమలుపై అంతా ఆసక్తిగా గమనించారు. ఆశగా ఎదురుచూశారు. కానీ సర్కార్ ఏమీ చేయలేక కేబినెట్ సమావేశాన్ని అలా సోసోగా ముగించేసి అయిందనిపించింది. ఆర్థిక భారంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సర్కార్ ఉంది. అది కనబడుతూనే ఉంది.
కానీ జనానికి అది కాదు కదా కావాల్సింది. ఇచ్చిన హామీలేందీ..? ఎప్పుడు అమలు చేస్తారు..? ఇంకా ఎంతకాలం టైంపాస్‌చేస్తారు..? అనే కదా వారి కోపం. ఆ కోపం చల్లార్చే పనిని చేయడానికి సరైన వనరులు సాయం రావడంలేదు సర్కార్‌కు. అందుకే ఇలా కాలయాపన చేస్తూ వస్తోంది. దసరా నుంచి రైతు భరోసా అని ఊదరగొట్టారు. కానీ దాని ఊసే లేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసింది. ఇప్పుడిస్తే ఖరీఫ్ సీజన్ రైతు భరోసానే ఇవ్వాలి. కానీ దీన్ని ఎగ్గొట్టే ఆలోచనలో సర్కార్ ఉంది. ఇంకొన్ని రోజులు ఆగితే రబీ సీజన్ ఇస్తున్నామని చెప్పవచ్చు. అప్పుడు ఓ ఐదారు నెలలు ఆగొచ్చు. అప్పటి వరకు చూద్దాంలే అనే దోరణితో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.
కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చే విషయంలో కూడా సర్కార్ యూ టర్న్ తీసుకున్నది. మీరూ మీరూ తేల్చుకోండనే విధంగా చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట లెక్క చేసిపెట్టింది. సీలింగ్ విషయంలో కూడా ఐదు, పది ఎకరాలు అనకుండా ఎంత పండిస్తే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని చెప్పింది. ఇలా చెప్పుకుంటూ పోతున్నదే కాని, వాటిని తేల్చడం లేదు. నాన్చుడు దోరణి మాత్రమే అలవంభిస్తూ పోతున్నది. పింఛన్ల పెంపు, రైతు రుణమాఫీ పూర్తి చేసే అంశమూ తీసుకురాలేదు. వాటి జోలికి పోలేదు. సన్నబియ్యం ఇస్తాం, వడ్లకు ఐదొందల బోనస్ అంటూ తక్కువ ఖర్చుతో అయ్యే పనిని మాత్రం ముందు పెట్టుకున్నది.
ఒక్కొక్కటిగా చేస్తున్నాం కదా అని చెప్పుకునే ప్రయత్నమే తప్ప ఇవీ అమలు కావాలంటే ఎంత కాలం తీసుకుంటుందో తెలియదు. కేబినెట్ సమావేశంలో కీలక విషయాలేవి చర్చకు రాకపోవడం సర్కార్ ఆర్ధిక దీన స్థితిని, ఏమీ చేయలేని నిస్సహాయతకు అద్దం పట్టింది.