”నాలుగున్నర సంవత్సరాల క్రితం నిజమని నమ్మిన బాండ్ పేపర్ పచ్చి అబద్ధమై అధికారమేలింది. అబద్ధం చెప్పామా.. నిజం చెప్పామా అన్నది కాదు.. అన్నదాత గుండెల్లో బాండ్ పేపర్ గుండు దించామా లేదా అన్నదే పాయింటు” అన్న చందంగా పసుపు బోర్డు పేరిట ఎంపీ అరవింద్ తమను మోసం చేసి ఐదేళ్లు గద్దెనెక్కి మళ్లీ ఐదేళ్ల అధికార గద్దె కోసం చెవిలో పువ్వును పట్టుకొని కొత్త గేమ్ మొదలుపెట్టాడనే ముచ్చట పసుపు రైతుల్లో ప్రస్తుతం వైరల్ గా నడుస్తున్నది.

ఐదు రోజుల్లో పసుపు బోర్డు, మద్దతు ధర తెస్తానని, లేదంటే రాజీనామా చేస్తానని గత లోక్సభ ఎన్నికల కమలం పువ్వు గుర్తు పార్టీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ ప్రపంచంలోనే ఎన్నికలవేళ ఎక్కడ ఎవరు చేయని విధంగా ఏకంగా బాండ్ పేపర్ పైనే రాసి ఇచ్చాడు. ఇది రైతులు నమ్మారు.. అప్పటివరకు దశాబ్దం నర కాలంగా పసుపు బోర్డు కోసం అలుపెరుగని పోరాటం చేసిన కల్వకుంట్ల కవిత కృషిని సైతం బాండ్ పేపర్ ను నమ్మి పక్కన పెట్టారు. అరవింద్ ను గెలిపించారు. ఒకరోజు చూశారు.. రెండో రోజు ఎదురు చూశారు.. మూడో రోజు నిలదీశారు.. నాలుగో రోజు కనబడిన చోటల్లా కడిగేశారు. ఇలా ఒకరోజు ఒక ఏడాదిలా నాలుగు న్నర రోజులు నాలుగున్నర సంవత్సరాలుగా అరవింద్ అధికారం, అరవింద్ పై రైతన్న ఆగ్రహం కొనసాగాయి. మరి ఐదవ రోజు ఉంది కదా.. అంటే ఐదవ సంవత్సరం క్లియర్ గా చెప్పాలంటే ఎన్నికలకు వెళ్లే సంవత్సరం ఉంది కదా అప్పుడు మనం దించుదాం గుండు అని రైతులు సిద్ధమవుతున్న వాతావరణం క్లియర్గా నెలకొని ఉన్న తరుణంలో ఈసారి ఏకంగా ప్రధాని మోదీ పేరునే అస్త్రంగా పసుపు బోర్డు రాజకీయం కమలం పార్టీ నుంచి మళ్లీ ప్రారంభమైంది.

కేంద్రం పసుపు బోర్డు ఇవ్వడానికి నిర్ణయించినట్లు.. ప్రధానమంత్రి చొరవ తీసుకున్నట్లు, పసుపు రైతుల కల బిజెపి నెరవేర్చినట్లు సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో సమాచార ప్రచారం జోరు అందుకుంటున్నది. రైతులను తీవ్ర గందరగోళంలో పడవేసే విధంగా ఈ పరిణామం కొనసాగుతున్నది. బాండ్ పేపర్ రాసిచ్చాక ఆ ఉసేత్తకుండా పోయి… ఆనాక వరంగల్ లోని స్పైస్ బోర్డు ఆఫీసు కార్యాలయాన్ని నిజామాబాద్కు మార్చి అదే పసుపు బోర్డు అంటూ.. అంబాసిడర్ కారు కంటే బెంజ్ కారు ఎలాగైతే బెటర్ మీరు అడిగిన పసుపు బోర్డు కంటే నేను తెచ్చిన ఆఫీస్ కార్యాలయం బెటర్ అంటూ రైతన్నలను నమ్మించబోయి విఫలమైన అరవింద్ ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం పేరిట ప్రధాని పేరిట కొత్త నయవంచన నాటకానికి తెరతీశాడని విమర్శలు సైతం జోరందుకున్నాయి.

బాండ్ పేపర్ రాసిచ్చి గెలిచి ఐదేళ్లు కావస్తోంది. ఐదేళ్లలో అరవింద పసుపు బోర్డు తేలేకపోయాడు అనేది తాజా కమల వ్యూహ ప్రచారం చెప్పకనే ఒప్పుకుంటునది. అసెంబ్లీ ఎన్నికలు రాగానే పసుపు బోర్డు కేంద్రం ఇవ్వనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అవునని గాని కాదని గాని నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎం దుకు చెప్పలేకపోతున్నది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పసుపు బోర్డు పేరిట పదవికి ఎక్కిన తీరు.. ఇచ్చిన హామీని నెరవేర్చకపోయినందున రైతులు తిరగబడిన వైనాలు ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, జగిత్యాల జిల్లాలో బిజెపి మైలేజీని పాతాళానికి తొక్కేశాయని కుతకుతలాడిపోతున్న ఈ జిల్లాల బిజెపి నాయకులు మరోసారి పసుపు బోర్డు తాజా ప్రచారంపై పెదవి విరుస్తున్నారు. ఈ పరిణామం బిజెపి పార్టీకి మరోసారి ఆశనిపాతమే అని భయం వారిలో ప్రారంభమైనట్లు ప్రచారం జరుగుతున్నది.

తాజా పసుపు బోర్డు పరిణామాన్ని విపక్షాలు సహనంతో పరిశీలిస్తున్నట్లు కనిపిస్తున్నది. రైతులు ఈ పరిణామంపై కదిలిన తర్వాతే తమ పోరాటాన్ని మొదలుపెట్టడమే మంచిదని అభిప్రాయం లో ఉన్నట్లు తెలుస్తున్నది. బాండ్ పేపర్ రాసిచ్చింది మొదలు తాజాగా జరుగుతున్న పరిణామాల వరకు అన్ని విషయాలను అర్థం చేసుకున్న రైతులు ఎలా అడుగు వేస్తున్నారో లేచి చూసి వారికి అండగా నిలవాలని వ్యూహంలో ప్రతిపక్షాలు ఉన్నట్లు సమాచారం. వేచి చూసే ధోరణి అవలంబిస్తే మరోసారి పసుపు రైతు చెవిలో బిజెపి పువ్వు చేరడం ఖాయమని.. ఇది రైతన్నకు ఎంత మాత్రం మేలు చేయదని, తక్షణమే అరవింద్, బిజెపి ఎత్తుగడలను తిప్పికొట్టే కార్యాచరణను మొదలుపెట్టాలని ఒకటి, రెండు బిజెపియేతర పక్షాలు తమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు రైతు వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

You missed