మోర్తాడ్:
‘ మా దగ్గర రికమండేషన్లు నడవవు.. అర్హులైన వారికే పథకాలు అందుతాయి.. ఇప్పుడిచ్చే ఇంటి స్థలాల పట్టాలు కూడా అలాగే నిజమైన పేదలకు, అర్హులైన వారికే ఇచ్చాం.. మా లోకల్‌ లీడర్లు కూడా చాలా మంచోళ్లు.. రికమండేషన్లు చేయరు.. మా ప్రభుత్వంలో ఎంతటి పారదర్శకత ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు..’ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఆయన పట్టాలు అందజేశారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లో 85 మందికి,పాలెం గ్రామంలో 95మందికి, ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలో 31 మంది, తాళ్లరాంపూర్ 22 మందికి మొత్తం 233 మందికి ఇళ్ళ స్థలాలకు సంబందించిన పట్టాలు అందించారు.

ఈ సందర్బంగా జరిగిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ…

తెలంగాణ ప్రజలందరూ కేసిఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులే అని పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు బంధు,రైతు భీమా,ఆసరా పెన్షన్లు,కళ్యాణ లక్ష్మి,కేసిఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు కేసిఆర్ సర్కార్ ఆసరగా నిలుస్తోందని అన్నారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే కళ్యాణ లక్ష్మి – 10వేల మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున, ఆసరా పెన్షన్లు 62వేల మందికి 2వేలు,4వేల చొప్పున, సీఎం రిలీఫ్ ఫండ్ 10వేల మందికి కేవలం ఈ మూడింటిలోనే దాదాపు
82వేల మందికి లబ్ది జరిగిందన్నారు. ఇందులో నాకు ఓటు వేసిన వారు ఎంత మంది వెయ్యని వారు ఎంత మంది అని నేను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నడూ కూడా ఏ పార్టీ అని చూడలేదు,కేసిఆర్ అందర్నీ సమానంగా చూస్తున్నారు. అందరూ తెలంగాణ బిడ్డలే కదా..ఇతర పార్టీలో ఉన్న కూడా వారికి మంచి చేసి మనసు గెలుచుకుందామని కేసిఆర్ మాకు చెప్తారని అన్నారు. పూర్తి పారర్శకతతో కేసిఆర్ పాలన సాగుతోందని చెప్పారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా నాలుగు సార్లు క్షేత్ర స్థాయిలో అధికారులు తనిఖీ చేసి నిజమైన అర్హులను ఎంపిక చేశారని,ఇందులో ఏ ఒక్కరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. స్థానిక బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ కూడా వారు రికమెండేశన్లు చేయలేదు.అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని వారే సూచించారని ఈ సందర్బంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. పట్టాలు అందుకున్న అందరికీ గృహ లక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణం కోసం ఆర్ధిక సహాయం అందించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు శుభాకంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో వినోద్,మోర్తాడ్ ఎంపిపి శివలింగు శ్రీనివాస్,మోర్తాడ్ జడ్పీటిసి బద్దం రవి, ఏర్గట్ల ఎంపిపి ఉపేందర్ రెడ్డి, ఏర్గట్ల జడ్పీటిసి రాజేశ్వర్,మోర్తాడ్ తహిసిల్దార్ సత్యనారాయణ, ఏర్గట్ల తహిసిల్డార్ ఆయా గ్రామాల సర్పంచ్ లు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలీయా, పూర్ణానందం,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You missed