బాల్కొండ:
ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ మోసగాడని ధ్వజమెత్తారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. బాండు పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు తెస్తానని రైతులను నిండా ముంచిన చీటర్ అని ఘాటుగా విమర్శించారు. అబద్దపు హామీలతో ఎంపీగా గెలిచిన అర్వింద్ బాల్కొండ, నిజామాబాద్ ప్రజలకు ఏమేమీ అభివృద్ధి చేశాడో, కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చాడో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. తాను ప్రతీ గ్రామానికి ఎన్ని నిధులు తెచ్చానో, ఎలాంటి అభివృద్ధి చేశానో గణాంకాలతో సహా వివరించేందుకు రెడీగా ఉన్నానని కూడా ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ది పనుల శంకుస్ధాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కెసిఆర్ కంటే గొప్పగా చేస్తామని ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు…ఇప్పుడు చేస్తామంటే ఎట్లా నమ్ముతామని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన 200 పెన్షన్ 2వేలు చేసింది కేసిఆర్ అని,కాంగ్రెస్ ఇప్పుడు 4వేలు ఇస్తామంటే ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 4వేల పెన్షన్ ఇచ్చి ఇక్కడ ప్రజలను ఓట్లు అడగాలన్నరు. వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలు అని రైతును మళ్ళీ గోసపెట్టే కార్యక్రమానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ది ఓర్వని బీజేపీ వాళ్ల పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. స్థానిక ఎంపి బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేశాడని,తాను ఇవాళ పర్యటించిన గ్రామాల్లో ఆయన చేసిన అభివృద్ది ఏమిటని ప్రశ్నించారు. ఆయా గ్రామాల్లో చేసిన అభివృద్ది,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ద్వారా జరిగిన లబ్దిని గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు. కాంగ్రెస్,బీజేపీ ల మోసపు మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని కోరారు. కేసిఆర్ వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్లలో జరిగిన అభివృద్ది,సంక్షేమ పథకాలతో వచ్చిన మార్పుపై గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలని కోరారు. కేసిఆర్ తోనే తెలంగాణ పదిలంగా ఉంటుందని,కేసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మంత్రి వేముల మరోసారి పునరుద్ఘాటించారు.