బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం వెన్నంటి ఉంటున్నది ఎవరో కుల్లం కుల్ల తేలిపోయింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల కుండ పోత వర్షం కురిసింది మొదలు నేటి వరకు బాల్కొండ నియోజకవర్గాన్ని భారీ వర్షాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చెరువులు తెగిపోయాయి. లోతట్టు జనావాసాలు జలమయమయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. పంట పొలాలు ఇసుక మేటలు వేశాయి.

ఇలా రోజు అడుగడుగునా వరద కష్టాలతో నియోజక వర్గ ప్రజలు బాధలు పడుతున్నారు. ఇంతటి కష్టకాలంలో బాల్కొండ నియోజక వర్గం ప్రజల వెంట ఎవరు ఉంటున్నారు..ఎవరు ముఖం చాటేశారు అనేది కుల్లం కుల్ల తేలిపోయింది. వరద కష్టాలు కొనసాగుతున్న ఈ వారం రోజుల్లో హస్తం పార్టీ ముత్యాల సునీల్ రెడ్డి, కమలం పార్టీ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి కనీసం ప్రజల వద్దకు రాలేదు. వారు చేసేదేమి లేకున్నా ప్రజల్లోకి వచ్చి ఆత్మీయ సానుభూతి నైనా అందించింది లేదు.

నిన్నగాక మొన్నటివరకు బిజెపి లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే వరకు సందడి సందడి చేసిన సునీల్ రెడ్డి , ..సునీల్ రెడ్డిని బిజెపిలో చేరకుండా నిత్యం నిలువరించి కమలం పార్టీలో తనకు పోటీ లేకుండా చేసుకున్న ఏలేటి మల్లికార్జున్రెడ్డి వారి వారి పార్టీల్లో తమ స్థానాలకు డోకా లేదని ధీమాలో కుదుటపడి ప్రజలను వెను వెంటనే మరిచినట్టున్నారు. ప్రతిపక్ష నాయకులు అంటే పక్తు ఎదుటివారిపై దుమ్మెత్తి పోసే పని తప్ప ప్రజలకు ఆపత్కాలంలో అండగా నిలబడాలని రూలేమి లేదు అన్న చందంగా వీరు తీరు ఉంది అనే విమర్శలకు వీరే తావిచ్చుకున్నారు. ఇదంతా వారం రోజులుగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రజల కష్టాలు పట్టవని విమర్శలు చేస్తూ ఉండే సునీల్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి అసలైన కష్టకాలంలో వారే కనిపించకుండా పోవడాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. అదే ప్రశాంత్ రెడ్డి వానలో, వరదలో వారం రోజులుగా పర్యటిస్తూ.. ప్రజల మధ్యనే ఉంటున్న వైనాన్ని ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. బాల్కొండ నియోజకవర్గమే తన ప్రజా నిలయమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తమ కష్టాల్లో పాలు పంచుకుంటూ మరోసారి నిరూపించుకున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. ఊరికే పదే పదే పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చామని చెప్పుకోవడం కాదు.. పెద్ద మనసుతో ప్రశాంత్ రెడ్డిలా అండగా నిలవడం ముఖ్యమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

You missed