బాల్కొండ కాంగ్రెస్‌ బరి నుంచి సునీల్‌రెడ్డి…

ఢిల్లీలో మల్లిఖార్జున్‌ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక.. ఎట్టకేలకు తొలిగిన అడ్డంకి…

అనిల్‌ రాజకీయ భవితవ్యం పై నీలినీడలు…

ముత్యాల సునీల్‌ రెడ్డికి కాంగ్రెస్‌లో అడ్డంకులు తొలిగాయి. మొన్నటి వరకు బీజేపీలో చేరుదామని ఢిల్లీ లెవల్‌లో అర్వింద్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రయత్నాలు చేసిన సునీల్‌… ఆ తర్వాత యూ టర్న్‌ తీసుకున్నాడు. బీజేపీ బలహీనపడి, కాంగ్రెస్‌ పుంజుకోవడం, బాల్కొండ నుంచి ఏలేటి మల్లిఖార్జున్‌రెడ్డికే అవకాశం ఇస్తారని తేటతెల్లం కావడంతో కాంగ్రెస్‌లో విశ్వప్రయత్నాలు చేశాడు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి చివరి నిమిషం వరకు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

గురడికాపు కోటాలో రాష్ట్రంలోనే ఎక్కడా తమకు అవకాశం లేదని, బాల్కొండ నియోజకవర్గంలో చాలా రోజులుగా తను ప్రచారం చేసుకుంటున్నానని, తనకే టికెట్‌ ఇవ్వాలని కోరుతూ వచ్చాడు. దీంతో అధిష్టానం డైలమాలో పడింది. ఎట్టకేలకు గురువారం ఢిల్లీలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మల్లిఖార్జున్‌ ఖర్గే సమక్షంలో సునీల్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. దీంతో బాల్కొండ నుంచి కాంగ్రెస్‌ బరి నుంచి సునీల్‌రెడ్డి ఫైనల్‌ అయినట్టేనని భావించవచ్చు. మరోవైపు ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న బీసీ (పద్మశాలి)కి చెందిన ఈరవత్రి సునీల్‌ను ఆర్మూర్‌ నుంచి పోటీలో ఉంచాలని భావించారు. పద్మశాలి సామాజికవర్గం నుంచి రాష్ట్రంలో ఎవరికీ ఎమ్మెల్యే అభ్యర్థి అవకాశం లేదు.

దీంతో అనిల్‌కు కచ్చితంగా అవకాశం ఇవ్వాలని భావించారు. పక్కనే ఉన్న ఆర్మూర్‌ నుంచి పోటీలో దింపుదామని చూశారు. కానీ మళ్లీ నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి నుంచి డీఎస్‌ తనయుడు ధర్మపురి సంజయ్‌ను పోటీలో దింపాలని ఒకసారి, రేవంత్‌రెడ్డే పోటీ చేస్తే చుట్టూ ఉన్న నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని మరోసారి ఇలా ఆలోచనలు చేస్తున్నారు. ఈరవత్రి అనిల్‌ విషయంలో మాత్రం అధిష్టానం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అతని రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

You missed