జిల్లా పార్టీ సారథులు… నిమిత్త మాత్రులు…

పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిన జిల్లా అధ్యక్ష పదవులు…

అధిష్టానమూ అంతగా పట్టించుకోదు… ఎమ్మెల్యేలూ అంతే…

తమ నియోజకవర్గాలకే పరిమితం…. బీజేపీ అధ్యక్షుడు బస్వా పరిస్థితి మరీ దారుణం…

జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అంటే ఓ మంత్రికి ఉండే బిల్డప్‌ ఆ రోజుల్లో. అన్ని నియోజకవర్గాలను, ఎమ్మెల్యేలను సమన్వయపరుచుకుని, పార్టీ గెలుపులో అతను ఎంతో కీలకం. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల పంపిణీ లాంటి కీలకమైన బాధ్యతలూ అధిష్టానం అతన్ని కాదనకుండా ముందుకు పోయేది కాదు. పార్టీ అధ్యక్షుడు కచ్చితంగా ఎమ్మెల్యే అయ్యే చాన్సులు లేకపోలేదు. కానీ ఇప్పుడు ఆ ఆఫర్లు లేవు. గుర్తింపు లేదు. కనీసం మర్యాదా లేదు. కేవలం వారు ఉత్సవ విగ్రహాలు. నిమిత్తమాత్రులు. కుర్చీకి పరిమితమైన రథ సారథులు. ఎప్పుడైనా చుక్కతెగిపడ్డట్టు జిల్లా కార్యాయలంలో ప్రెస్‌మీట్లుపెడితే ప్రత్యక్షమయ్యే శాల్తీలు. ఇదీ నేటి పరిస్థితి.

ఇందూరు జిల్లాలో జిల్లా అధ్యక్ష పదవులు అలంకరిస్తున్న లీడర్ల పరిస్థితి ఇలాగే ఉంది. మొదట అధికారపార్టీ విషయాకొద్దాం. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి జిల్లా అధ్యక్షపదవిని ఇచ్చేశారు. ఆర్మూర్‌లోనే తీరిక లేకుండా తిరిగే జీవన్‌రెడ్డికి ఈ మధ్య సీఎం కేసీఆర్ మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. అక్కడ నుంచి నేతలను పట్టుకొచ్చి పార్టీలో చేర్పించే పనిలో మొన్నటి వరకు బిజీబిజీగా ఉండే జీవన్‌. ఇప్పుడు ఎన్నికల సమయం కదా.

ఇక నియోజకవర్గంలో తిష్ట వేశాడు. బీఆరెస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఇప్పటి వరకు ఆయన పెట్టింది ఒకట్రెండు ప్రెస్‌మీట్లు మాత్రమే. ఆ తర్వాత అదెప్పుడూ బోసిపోయే ఉంది. పార్టీ అనుబంధ సంఘాలను కూడా నియమించకపోవడంతో జిల్లాలోనే కాదు అంతటా పార్టీ పదవులు లేక నాయకత్వ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ కార్యాలయం అంటే ఎట్లా ఉండాలె… ఏదో ఒక ప్రెస్‌మీటో.. ప్రోగ్రాంతో సందడి సందడిగా ఉండాలె. కానీ ఇది బోసి పోయి కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కాబట్టి. టికెట్‌ మళ్లీ వస్తుందా..? వస్తే గెలుస్తానా..? ఇతర పార్టీల నుంచి నేతలను ఎలా రాబట్టాలే.. పార్టీలో చేరికలు ఎలా చేపించాలె…?? ఇప్పుడు జీవన్‌రెడ్డి ఇదే బిజీలో ఉన్నాడు. ఇక ఏ నియోజకవర్గం ఎటు పోతే తనకెందుకు..? ఏ ఎమ్మెల్యే ఏం చేస్తే తనకెందుకు..?? టికెట్లు ఇచ్చేది అధిష్టానం. తననేమైనా సంప్రదించేదుందా..? అంఆ పెద్దాయన చలవ. ఆయన నిర్ణయమే శిరోధార్యం.

జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డినే నియోజకవర్గాల ప్రోగ్రాంలకు పిలవని సంప్రదాయం ఇక్కడ ఉంది. ఇక జిల్లా అధ్యక్షుడిని ఎవరు పిలుస్తారు. అందుకే ఎవరి పరిధికి వారు పరిమితమై పనిచేస్తూ పోతున్నారు. బీజేపీ విషయానికొస్తే…. బస్వా లక్ష్మి నర్సయ్య.. బీఆరెస్‌ అర్బన్‌ టికెట్ ఆశించి భంగపడి కోపంతో బీజేపీలో చేరాడు.జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆయన టార్గెట్‌ బీజేపీ నుంచి అర్బన్‌ కు పోటీ చేయాలని. కానీ ఇక్కడ అంతా అర్వింద్‌ చెప్పిందే వేదం. అర్వింద్‌తో గ్యాప్‌ పెంచుకున్నాడు. అర్వింద్‌ ధన్‌పాల్‌ను ఎంకరేజ్‌ చేస్తున్నారు. ధన్‌పాల్‌ ఇంటింటికి తిరుగుతున్నాడు. బస్వా ఏమీ చేయలేక సొంత పార్టీలోనే అసమ్మతి పోరు సాగిస్తున్నారు. కానీ ఎక్కువ రోజులు అక్కడ మనుగడ లేదని అతనికీ అర్థమయిపోయింది. వేరేపార్టీ పిలవదు. పిలిచినా పదవులిచ్చే హామీలేమి ఇవ్వదు. అందుకే అతని రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

ప్రెస్‌మీట్లలో కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చుడు తప్పితే ఏ ప్రోగ్రాంకు పోడు. అర్వింద్‌ పిలవడు. మాజీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాత్రం పోతాడు. అతన్న అర్వింద్‌ వెంట తిప్పుకుంటున్నాడు. ఇక కాంగ్రెస్‌లో మానాల మోహన్‌రెడ్డి తన బాల్కొండ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. పెద్దాయన, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నెత్తిమీద పార్టీ బాధ్యతలు, అభ్యర్థుల ఎంపిక విషయాలను రుద్దుతున్నది అధిష్టానం. దీంతో తనకెందుకు తలనొప్పి..తనకు బాల్కొండ టికెట్ కనుక ఇస్తే అదే మహాద్భాగ్యం అనే రీతిలో మొన్నటి దాకా తన నియోజకవర్గం చుట్టే తిరిగుతూ అప్పుడప్పుడు కాంగ్రెస్‌ భవన్‌లో దర్శనమిస్తూ తనూ అధ్యక్షుడినే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

You missed