ఆయనో మాస్‌ లీడర్‌. ముక్కుసూటితనం ఆయన నైజం. గుండెనిబ్బరమూ ఎక్కువే. ఆయనే ఆర్టీసీ చైర్మన్‌, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌. కానీ అంతటి మాస్‌ లీడరే ఒకరిని అమాంతం పొగిడేశాడు. ధైర్యసాహసాల విషయంలో. మనోనిబ్బరానికి అబ్బురపడుతూ. ఆమే ఎమ్మెల్సీ కవిత. ఔను… మాస్‌ లీడర్‌ గోవన్ననే ఓ దశలో భయపడ్డ సంఘటనను గుర్తు చేసుకుంటూ అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆమె చెక్కుచెదరని మనోనిబ్బరం తనని ఆశ్చర్యచకితుడిని చేసిందని చెప్పుకొచ్చారు.

శుక్రవారం నడిపల్లిలో సంక్షేమ సంబురాల కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. గోవర్దన్ మాట్లాడుతూ.. లిక్కర్‌ స్కాంలో ఈడీ విచారణ పేరుతో ఎంతటి మానసిక ఇబ్బందికి గురిచేసిందో గుర్తు చేసుకుంటూనే అలాంటి సమయంలో కవిత చూపిన మనోనిబ్బరం తనను ఆశ్చర్యపరిచిందని, ఎంతో స్పూర్తిదాయకంగా నిలిచిందని కొనియాడారు. విచారణ పేరుతో లోనికి వెళ్లే సమయంలో ఎలా చిరునవ్వులు చిందిస్తూ వెళ్లారో… గంటల తరబడి విచారణ పేరుతో కాలయాపన చేసి నరకయాతన చూపిన తర్వాత బయటకు వచ్చిన ఆమె మోములో ఎలాంటి భయం, భీతి కాని కనిపించలేదన్నారు.

అదే చిరునవ్వుతో ఆమె తిరిగి రావడం మమ్మల్నందరినీ సంతోషపెట్టిందని, ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందని కూడా చెప్పుకొచ్చారాయన. తనే కాదు మంత్రి కేటీఆర్‌ కూడా కవిత మనో నిబ్బరానికి అబ్బురపడి తమతో ఆ విషయాన్ని పంచుకున్న విషయాన్ని ఈ వేదికగా గోవర్దన్‌ రూరల్‌ ప్రజలకు, నాయకులకు చెప్పుకున్నారు.

You missed