ఎందుకు కొనసాగాలి…? ఎంతకాలం ఓపిక పట్టాలి…??

పార్టీలో ఇజ్జత్‌ లేదు.. పదవులు అసలే లేవు..

ఎమ్మెల్సీ ఇక జిల్లాకు లేనట్టే.. పార్టీ పదవులు ఇవ్వొద్దని కేసీఆర్‌ ఆదేశం.. అందుకే కేటీఆర్‌ వాటిపై ఊసెత్తడం లేదు..

ఎన్నికల సమయం రానే వచ్చింది. ఇంకా ఎందుకుండాలి..? వేరే పార్టీ చూసుకోవాలా… సైలెంట్‌ ఉండిపోవాలా..? రిటైర్‌ అయిపోవాలా..?

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌:

బీఆరెస్‌ పార్టీలో సీరియర్‌ లీడర్లు, ఉద్యమకారుల ఆలోచనా స్థితి ఇలాగే ఉంది. కనీసం మర్యాద ఉండటం లేదు. గౌరవమూ లేదు. మాకే ఆత్మగౌరవం దక్కడం లేదు. మరింకెందుకు ఉండాలి..? ఎంతకాలం ఓపిక పట్టాలి..? ముందు ఎన్నికల సమయం… టైమ్‌ దగ్గర పడుతుంది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అనుకుంటున్నారు బాధిత. పదవి రాని బీఆరెస్‌ లీడర్లంతా. మాజీ టీఆరెస్ జిల్లా అద్యక్షుడు ఈగ గంగారెడ్డి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నాడు. ఇప్పటికే ఒకసారి అవమానం భరించలేక దూరమయ్యాడు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుజ్జగించాడు. కానీ మళ్లీ అదే పరిస్థితి. పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు కూడా పిలుపు లేదు.

నా ఘర్‌కా నా ఘాట్‌కా అన్నట్టుగా తయారయ్యింది వీరి పరిస్తితి. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఖాళీ అవుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు చాలా మంది. కానీ అది జిల్లాకు ఇచ్చేలా లేడు. వచ్చేలా లేదు. దీంతో మధుశేఖర్, ఈగ గంగారెడ్డి లాంటి నాయకులు కూడా ఆశలు చాలించుకున్నారు. మధుశేఖర్‌ తన ప్లాట్‌ ఫాం తను చూసుకోనున్నాడు. ఈగ గంగారెడ్డి అండర్ గ్రౌండ్‌కు వెళ్లనున్నాడు. ఇక మిగిలిన ఉద్యమకారులు సమయం కోసం వేచి చూస్తున్నారు. కరెక్టుగా సమయం చూసి దెబ్బకొట్టాలనే ఆలోచనలో ఉన్నారు.

పార్టీ జంప్ అయ్యే వాళ్లే ఎక్కువున్నారు. అందులో కాంగ్రెస్‌ గూటికే వెళ్లేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. జిల్లా రాజకీయాల్లో కవిత యాక్టివ్‌గా లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పార్టినీ, నాయకులను ఎవరూ పట్టించుకోకపోవడం.. జిల్లా అధ్యక్షుడి పోస్టు ఉండీ లేనికిందకే అన్నట్టుగా ఉత్సవం విగ్రహంలా ఉండటం… నాయకుల్లో వైరాగ్యాన్ని పెంచింది. ఇక బీఆరెస్‌లో కొనసాగడం దండుగ అనే అభిప్రాయానికి వచ్చారు. జూన్‌ 2 నుంచి కేసీఆర్‌ ఇరవై ఒక్క రోజుల వేడుకలు చేసుకోవాలని పిలుపునిచ్చాడు కానీ…. ఆ వేడుకలు మొత్తం వీరి అసంతృప్తి, వైరాగ్యంతోనే నిండిపోనున్నాయి. విజయవంతం మాటటుంచి ఇవి పూర్తిగా అట్టర్‌ ఫ్లాప్‌ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా ఉంది జిల్లాలో పార్టీ పరిస్థితి.

You missed