బీసీల్లోని అన్ని కులాలు సంఘటితం కావాలని, జర్నలిస్టులు బీసీ సమాజాన్ని మేల్కొల్పేలా పని చేసి రాజ్యాధికారం సాధించుకునేలా కృషి చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం బీసీ సమాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన బీసీ జర్నలిస్టుల సమ్మేళనం జరిగింది. బీసీల సాధికారతలో బీసీ జర్నలిస్టుల పాత్ర అనే అంశంపై ఈ సమ్మేళనం నిర్వహించారు. చీఫ్‌ గెస్ట్‌గా ఫారెన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సౌత్‌ ఏసియా(ఎఫ్‌సీసీ) ప్రెసిడెంట్‌ ఎస్‌ వెంకట నారాయణ హాజరయ్యారు.

జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు ముందుండి అన్ని హక్కులు సాధించుకోవాలన్నారు. ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కులాలు, మతాలుగా జనం విడిపోతున్నారని, అంతరాలు మరింత పెరుగుతున్నాయన్నారు. బీసీలు రాజ్యాధికారం సాధించే దిశగా చైతన్యం రావాలని, దీని కోసం జర్నలిస్టులు కృషి చేయాలన్నారు. ఈరవత్రి అనిల్‌ మాట్లాడుతూ.. ఐదెకరాల పైన ఉన్న వారికి రైతు బంధు ఇవ్వడమెందుకని ప్రశ్నించారు. బీసీలు కట్టే పన్నులతో సంపన్నవర్గాలకు, అగ్రవర్ణాలకు రైతుబంధు ఇస్తున్నారని అన్నారు. ఈ సమ్మేళనం అనంతరం బీసీ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటయ్యింది. దీనికి కన్వీనర్‌గా సతీష్‌ కమాల్‌, కో- కన్వీనర్‌గా మ్యాడం మధుసూదన్‌లను ఎన్నుకున్నారు.

తెలంగాణ ఏర్పాటు కోసం ఆనాడు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పడి ఎలా పోరాడిందో… బీసీల రాజ్యాధికారం కోసం ఈ బీసీ జర్నలిస్టుల ఫోరం పాటుపడాలని బీసీ జర్నలిస్టులు ఆకాంక్షించారు. సమ్మేళనానికి సీనియర్‌ జర్నలిస్టులు సూర్యారావు, నాగ పరిమళ, సతీష్‌ సాగర్‌, యాటకర్ల మల్లేశ్‌, తెలంగాణ విఠల్‌, రఘు నిజామాబాద్‌ నుంచి జమాల్‌ పూర్‌ గణేశ్‌, ప్రమోద్, రమణ, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

 

You missed