ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్… అచ్చంగా ఖమ్మం సభకు ఇది సరిపోతుంది. బీఆరెస్ ఏర్పాటు తర్వాత పెట్టిన తొలి భారీ బహిరంగ సభ. జాతీయ నాయకులను రప్పించడంలో పర్వాలేదనిపించారు. కానీ సభే మోస్తారుగా.. సోసోగా సాగింది. కేసీఆర్ స్పీచ్ పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగినా.. చప్పగా పాత చింతకాయపచ్చడే అయ్యింది ఆయన ప్రసంగం. వచ్చిన వాళ్లూ తమ పాలసీ కనుగుణంగా మోడీని కడిగేశారు. అంతే. బీఆరెస్.. కేసీఆర్.. ప్రధాని.. అధికారం ఈ మాటలు రాలేవు. రావు. వాళ్లెందుకంటారు.. వారికి చాతకాదని చెప్పుకోవడమే అవుతుంది కదా. ఆఖరికి కేసీఆర్ కూడా బీఆరెస్‌కు అధికారం ఇవ్వండని ఈ వేదికగా గట్టిగా జాతినుద్దేశించి చెప్పలేక పోయాడు.
స్పీచ్‌లో మింగలేక కక్కలేక అన్నట్టు తెలంగాణ రోల్ మోడల్ అనే పదాన్ని పదే పదే ఉచ్చరించడం.. దళితబంధు, రైతుబంధును గుర్తు చేయడం తప్ప పెద్దగా ఆయన మార్కు స్పీచులా ఇదేమీ లేదు. ఓ ప్రెస్‌మీట్ పెడితేనే సుధీర్ఘంగా ఇంగ్లీష్, హిందీల్లో దంచికొట్టే మన కేసీఆర్‌కు ఈ జాతీయ పార్టీ వేదిక మీద ఎందుకో ఆ భాషలు గుర్తుకు రాలేదు. వాగ్దాటి తన్నుకురాలే. బహుశా జనం ఊహించినంత రాలేదనా..? అనుకున్నంతగా సభ సక్సెస్ కాలేదనా… మరేదో వెలితి ఆయన మాటల్లో కనిపించింది. మొత్తం తెలుగులోనే కొనసాగింది స్పీచ్. జాతీయ మీడియాను కూడా ఆకర్షించాలని కేసీఆర్ అనుకోకవడం విడ్డూరంగా కనిపించింది. తెలంగాణ గడ్డ మీద.. ఇక్కడ హాజరైన జనానికి వాస్తవానికి ఆ స్పీచులతో పనిలేదు. ఆ మీటింగుతోనే పనిలేదు.
ఎందుకంటే కేసీఆర్ మాకేమీ చేశాడు..? ఇంకేమీ చేయాలి..? ఇంకేమేమీ చేస్తాడని ఆశగా చూసే జనమే తప్ప.. దేశానికి ఏదో ఉద్దరిస్తాడనగానే ఉవ్వెత్తున లేచి గంతేసి చప్పట్లు చరిచి వెన్నతట్టి ప్రోత్సహించేంత సీనయితే లేదు. మరలాంటప్పుడు ఢిల్లీలో మీటింగు పెట్టాల్సింది. సరే తొలి మీటింగు కదా ఓ ప్రయత్నం చేశాడనుకుందాం. బాగానే ఉంది. కానీ జాతీయ మీడియా ఊసేది. దేశ ప్రజలకు, దేశ రాజకీయ పార్టీలకు కేసీఆర్ స్పీచ్ ఏం అర్థమయ్యింది..? పార్టీ విధివిధానాలపై ఇంకా అధ్యయనమే సాగుతుందట. మరెప్పుడు బయటపెడతాడో. బహుశా ఈసారి ఢిల్లీ వేదికగా ప్రకటిస్తాడేమో..? అప్పుడు వీళ్లంతా హాజరువుతారనేది కూడా డౌటే.