అత్యంత సంచలనం సృష్టించి, రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అధికార టిఆర్ఎస్ పార్టీకి సెల్ఫ్ గోల్ గా మారనున్నదా ..? మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యా యత్నం కేసు మాదిరిగా భూమారంగ్ కానున్నదా…?

లేక రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న బిజెపి రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు గా మారనున్నదా…? ఈ కేసు పోలీసులకు సంకటంగా పరిణమించనున్నదా…?
ఇలా మొయినాబాద్ అజీజ్ నగర్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల బెర సారాల కేసు ఎన్నో అనుమానాలను కలిగిస్తున్నది. అపోహలను తావిస్తున్నది.

ఈ కేసులో పోలీసులు దర్యాప్తు నుంచి మొదలుకొని టిఆర్ఎస్ ఆరోపణలు, బిజెపి ప్రత్యారోపణలలో అసలు వాస్తవం ఎంత…? ఎవరిది నిజం…. ఎవరిది అబద్ధం… పోలీసులు, ఎ మ్మెల్యేల నుంచి మొదలుకొని టిఆర్ఎస్, బిజెపి నాయకుల వరకు ఒకదానితో ఒకటి పొంతనల్లేని కథనాలు ప్రజలను అయోమయా నికి గురిచేస్తుంది. ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలకు తావిస్తున్నది.
….
మునుగోడు కోసమే హై డ్రామాలా…
…..
… వాస్తవానికి పోలీసులు ఫామ్ హౌస్ చేరకముందే రూట్ మ్యాప్ లతో పాటు… మీడియాకు ముందుగా లీక్ కావడం ఆలోచింప చేస్తుంది.
.. మొదట మీడియాతో మాట్లాడిన సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేల చూపులు చూస్తూ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకే తాము అజీజ్ నగర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నామని చెప్పారు. సాధారణంగా పోలీసులు తాము విశ్వసనీయ సమాచారం తో సంఘటన స్థలానికి చేరుకున్నామని చెబుతారు. ఇక్కడ స్టీఫెన్ మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమాచారం ఇస్తేనే వచ్చామన్నారు. అంటే ఫామ్ హౌస్ కి వెళ్లేముందే తమను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఎమ్మెల్యేలు ఇచ్చారా… లేక ప్రలోభ పెట్టే సమయంలో ఫోన్ చేశారా అనేది స్పష్టత లేదు. పోలీసుల కంటే ముందే మీడియా చేరుకోవడం అనుమానాలకు తావిస్తున్న ది .
మొదట 100 కోట్ల డీల్ జరుగుతున్నది తొందరగా రావాలని స్థానిక రాజేంద్రనగర్ పోలీసులు రిపోర్టర్లకు సమాచారం ఇచ్చారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా విడుదల చేశారు. తాము వెళ్తున్నాం… మీడియా కూడా తొందరగా చేరుకోవాలని ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు. కానీ పోలీసుల కన్నా ముందే ఒక అధికారిక ఛానల్ తో పాటు మరో రెండు ఛానల్ బృందాలు ఫామ్ హౌస్ చేరుకొని ఆరా తీయడం మొదలు పెట్టాయి. మరి వాళ్లకు ముందుగా సమాచారం ఇచ్చింది ఎవరు…? ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల ఆపరేషన్ పై ఒక టీవీ ఛానల్ ఘటనకు రెండు గంటల ముందు అంటే సాయంత్రం ఐదు గంటల కె కెమెరాలతో సిద్ధమైనట్లు సమాచారం.
ఇక మొదట ఏదో రూ.100 కోట్ల డీల్ అని చెప్పిన పోలీసులు ఆ తర్వాత అంత సీన్ లేదు 15 కోట్ల అని ప్రకటించారు. ఆ నగదును కూడా వారు ప్రదర్శించలేకపోయారు.
ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారని నలుగురు ఎమ్మెల్యేలను ప్రశ్నించాల్సిన పోలీసులు వారిని చూసి చూడనట్లు వదిలేశారు. వాళ్లకు నేరుగా ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ఇది అందరూ చూస్తుండగానే జరిగిన బహిరంగ సత్యం.
ఇక పైలట్ రోహిత్ రెడ్డిని నామమాత్రంగా ప్రశ్నించి మొత్తం 400 కోట్ల డీల్ అని తాము మాత్రం బిజెపి ప్రలోభానికి లొంగలేదని స్వామీజీల పేర్లు చెప్పి తప్పించుకున్నారు.
ఫామ్ హౌస్ లో ఉన్న స్వామీజీలు ఏమి చెప్పారనేది ఇంతవరకు మిస్టరీగానే ఉంది.
ఇక ఈ డీల్ కు మొత్తం మధ్యవర్తిగా ఉన్న నందకిషోర్ అనే వ్యాపారి స్వామీజీలు పూజ కోసం వచ్చినట్టు సంకేతాలిచ్చారు. మొదట తమ స్నేహితుని కలవడానికి వచ్చానని చెప్పిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఆ తర్వాత మాట మార్చారు.
ఫామ్ హౌస్ లో ప్రలోభాలకు లొంగకుండా నికార్సైన వ్యక్తులుగా నిలిచిన ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడకుండా హడావుడిగా ప్రగతి భవన్ కు పోవడం మీడియాను కూడా ఆలోచనలో పడవేసింది.
పట్టుబడ్డట్టు గా చెబుతున్న 15 కోట్ల రూపాయలను కూడా పోలీసులు ఇంతవరకు బహిర్గతం చేయకపోవడం విశేషం.
ఘటన జరిగి 18 గంటలు గడిచినా అటు టిఆర్ఎస్ కానీ ఇటు పోలీసులు కానీ ఎందుకు ఆడియోలు లీక్ చేయలేదు.
ఫోన్ టాపింగ్ ఏమైనా చేస్తే అది బయటపడుతుందన్న భయంతో నా….? సరైన ఆధారాలు లేకనా ..?
సాధారణంగా గురువారం ఉదయం ఆడియోలు, వీడియోలతో టిఆర్ఎస్ హల్ చల్ చేస్తుందని… పోలీసులు, ఎమ్మెల్యేలు నిర్దిష్ట ఆధారాలతో మీడియా ముందుకు వస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.
బిజెపి బండారం ఏ విధంగా బయట పెడతారో అని మీడియా ఉత్కంఠతో వేచి చూసింది.
కానీ పోలీసులు రాలేదు… ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టలేదు… సీఎం కూడా సాయంత్రం వరకు స్పందించలేదు.
పైగా ఆరోపణలకు గురైన భారతీయ జనతా పార్టీ తరఫున అగ్ర నాయకులు ఎదురుదాడి మొదలుపెట్టారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. నిజానిజాలను బయటపెట్టాలని కోర్టును కూడా ఆశ్రయించారు.
ఈ పరిణామం మొదటి దాడి చేసిన టిఆర్ఎస్ కు ఇరకాటంగా మారింది. యాదగిరిగుట్ట నరసింహ స్వామి సాక్షిగా నిజం చెప్పాలని సవాల్ చేసింది.
బిజెపి ఎదురుదాడిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయంపై తర్జన భర్జన పడుతున్నది.
ఓటుకు నోటు కేసులో అప్పటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడ్డప్పుడు ఆడియో వీడియో తో సహా అన్ని ఆధారాలను అయితే పెట్టిన పోలీసులు టిఆర్ఎస్ నాయకులు ఈసారి మాత్రం ఆ పని చేయలేకపోయారు.
అందుకు సరైన ఆధారాలు లభించలేకపోవడమే కారణమా…? మరి ఇంకా ఏమైనా భయాలా…?

బిజెపి బెరసాల కోసం 400 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఒకటి మాత్రం నిజం మునుగోడు ఎన్నికల క్రమం లో టిఆర్ఎస్, బిజెపి నాయకులు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ స్థాయి దిగజారుడు పనులకు పాల్పడుతున్నారు.స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ వంటి నాయకులను టిఆర్ఎస్ లాగడం తో ప్ర తీకారంగా బిజెపి కూడా కొంతమంది టిఆర్ఎస్ నాయకులకు ఏరవేసిందనే ప్రచారం జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ వంటి వారు స్టేట్మెంట్ ఇవ్వడం దీనికి బలాన్ని చేకూర్చింది.
కానీ బిజెపి ఇంకా వల విసరకముందే టిఆర్ఎస్ తొందరపడిందా…? సరైన ఆధారాలను సేకరించకపోవడం వల్ల ఎపిసోడ్ రివర్స్ అయిందా… అన్న ప్రచారం జరుగుతుంది. కాగా నలుగురు ఎమ్మెల్యే కోసం రూ.400 కోట్లను వెచ్చించాల్సిన అవసరం బిజెపికి ఉందా…. అన్నది ఆలోచింపజేస్తుంది. ఈ వ్యవహారంలో అందరితో సత్సంబంధాలు ఉన్న ఒక చిరు వ్యాపారినినలుగురు ఎమ్మెల్యేలను లాగడం వల్ల బిజెపికి తక్షణంగా చేకూరే ప్రయోజనం ఏమిటి..? మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇంత పెద్ద సాహసం చేస్తుందా …? టిఆర్ఎస్, బిజెపి ల మధ్య రాష్ట్రంలో సీరియస్ ఫైట్ జరుగుతుంది. గతంలో పరోక్షంగా స్నేహపూర్వకంగా ఉన్న రెండు పార్టీలు అమీ తుమీ తేల్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాయి. ప్రలోభాల ఎత్తులో.. బ్లేమ్ గేమ్ లో చివరకు ఎవరు చిత్తవుతారో…..

మ్యాడమ్ మధుసూదన్, సీనియర్ పాత్రికేయులు

You missed