లక్షలు.. కోట్లు…. పార్టీ జంపింగ్‌లు… ఒకరికి మించి మరొకరు. ఏక్ సే బడ్కర్ ఏక్.. అనే విధంగా టీఆరెస్, బీజేపీ మునుగోడు బైపోల్ రణరంగంలో హోరాహోరీ పోరాడుతున్నాయి. తాజాగా స్వామిగౌడ్, శ్రావణ్ దాసోజులు బీజేపీ నుంచి టీఆరెస్‌లో చేరడంతో బీజేపీ మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక్క బూర నర్సయ్య గౌడ్ వస్తే.. మరోవైపు భిక్షమయ్యగౌడ్, స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్.. లైన్ కట్టారు. దీంతో కేసీఆర్ ఘా..ట్టిగా తలుచుకుంటే ఏమవుతుందో ఈ మునుగోడు ఉప ఎన్నిక ద్వారా బీజేపీకి నెత్తిన సుత్తెతో కొట్టి మరీ చెప్పినట్టయ్యింది.
ఈ రెండు పార్టీల పరిణామాలు, పరిస్థితులే మీడియాలో కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కానీ… మునుగోడు ప్రజలకు మాత్రమే తెలిసిన , వారి మనసులో నాటుకుంటున్న మరో సంఘటన సైలెంట్‌గా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నది. అదే.. కాంగ్రెస్ ఇంటింటి కాళ్ల మొక్కుడు ప్రోగ్రాం. అవును.. నిజమే. కాళ్లు మొక్కడమంటే మామూలు విషయం కాదు. అస్త్రాలన్నీ అయిపోయి… శరణు వేడుకున్నట్టు… కాంగ్రెస్.. తన పరిస్తితిని ప్రజలకు ఈ విధంగా చెప్పకనే చెప్పినట్టు చేస్తున్నది. తమ వద్దు డబ్బులు లేవు. పార్టీ నాయకులు సరిగ్గా లేరు. అంతా కోవర్టులు. అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టే వెధవలు.. కానీ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం అనివార్యం. అది ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం. కనీసం ఈ ఎన్నికల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నా.. రానున్న ముందస్తు లేదా సాధారణ ఎన్నికల్లో ప్రజల వద్దకు మరింత బలంగా వెళ్లొచ్చనే భావనలో కాంగ్రెస్ దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నది.
అదే విషయాన్ని పరోక్షంగా , డైరెక్ట్‌గా ఓటర్లకు చెబతూ కాళ్లు మొక్కుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా ఈ కాళ్లు మొక్కుడు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ నాయకులు. ఈ కాళ్ల మొక్కుడు సెంటిమెంట్ బాగానే వర్కవుట్ అవుతుందనే అభిప్రాయాన్ని అక్కడి ప్రజలూ నమ్ముతున్నారు. ఇంతకంటే సెంటిమెంట్ ఏముంటుంది…? పైసలు ఎంతో కొంత ఇస్తారు.. వాళ్లంత ఇవ్వకపోయినా… ఏదో సర్దుబాటు చేస్తారు… పై నుంచి కాళ్లు మొక్కుతున్నారు. ఓటు బ్యాంకు ఉంది.. సానుభూతి కూడా తోడయ్యింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఓటర్లు గుర్రుగా ఉన్నారు.. ఇవన్నీ కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశాలే అంటున్నారు అక్కడి జనాలు…