మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం రాజుకుంటున్నది. ఎవరు గెలుపు, ఎవరికి రెండో స్థానం… ఎవరు మూడో స్థానంతో సరిపెట్టుకుంటారు.. అనేది ఉత్కంఠను రేపుతున్నది. ప్రధానంగా చర్చ టీఆరెస్, బీజేపీపైనే సాగుతున్నారు. ఈ రెండింట్లో ఏది గెలుస్తుంది..? ఏది రెండో స్థానంతో సరిపెట్టుకుంటుంది..? అనే చర్చ తీవ్రంగా ఉంది. అసలు కాంగ్రెస్‌ను పట్టించుకున్నవాడు లేడు. అది చర్చలోకే రావడం లేదు. కానీ వాస్తవ చిత్రం అక్కడ వేరే ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజానాడి భిన్నంగా ఉంది. అన్ని పార్టీల మీటింగులకూ జనాలు వెళ్తున్నారు. ఇచ్చింది తీసుకుంటున్నారు. కానీ చర్చ మాత్రం నిన్నటి వరకు టీఆరెస్, బీజేపీలపైనే సాగుతూ వచ్చింది. రేవంత్ ఎంట్రీతో ఇప్పుడు ఇదీ చర్చలోకి వస్తుంది.
కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే… చాపకింద నీరులా కాంగ్రెస్ కూడా విస్తరిస్తూ వస్తోంది. దీన్ని మీడియా పట్టించుకోవడం లేదు. ప్యాకేజీలు, ఖర్చులు, నిధులు…. ఇవన్నీ కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే మీడియా కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోంది. అసలు అక్కడ కాంగ్రెస్ పోటీలోనే లేదు అనే విధంగా వ్యవహరిస్తున్నారంతా. కానీ అక్కడ జరుగుతుంది వేరే. లోలోపల ప్రచారం జోరందుకుంటున్నది. పాల్వాయి స్రవంతిపై ఇప్పటికే సానుభూతి ఉంది. గత ఎన్నికల్లో ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించింది. దీనికి తోడు ఆమెకు పార్టీ, కుటుంబ నేపథ్యం కలిసి వస్తోంది. మొన్న నామినేషన్ సమయంలో భారీగా జనాలు తరలి వచ్చారు. ఆ సమయంలో ఆమె మాట్లాడిన భావోద్వేగపు స్పీచ్ అందరినీ కదలించింది. ఆకట్టుకున్నది. సెంటిమెంట్‌ను రాజేసింది. ఆనాడే ఆమెకు పదివేలకు పైగా ఓట్లు పడ్డట్టేననే చర్చ జరిగింది. కానీ ఎక్కడా సోషల్ మీడియాలో గానీ, మెయిన్ మీడియాలోగానీ కాంగ్రెస్‌కు స్థానం లభించడం లేదు. ఆ ప్రచారానికీ స్పేస్ దొరకడం లేదు.
ఇది కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య. అది అధిష్టానానికి కూడా తెలుసు. మొన్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ గెలవొద్దని కాంగ్రెస్ భావించింది. ఈటల గెలిస్తే ఎనాటికైనా కాంగ్రెస్ గూటికే వస్తాడనే నమ్మకంతో లోపాయికారిగా సహకరించింది. కానీ , ఈ మునుగోడు ఉప ఎన్నిక అలా కాదు. రానున్న ముందస్తు లేదా సాధారణ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి అన్ని పార్టీలు. దీంతో పాటు కాంగ్రెస్‌కు ఈ స్థానం కంచుకోట. మంచిపట్టుంది. ఇదో పరీక్షా సమయం. తమను తాము నిరూపించుకుని , ప్రజాక్షేత్రంలో తమ బలమేంటో రాష్ట్రానికంతటికీ తెలియజెప్పే ఓ వేదిక. అందుకే కాంగ్రెస్‌కు ఇది ప్రతిష్టాత్మకం. ఒక్కో సందర్భంలో కాంగ్రెస్ గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదనే మాటలు కూడా ఆ నియోజకవర్గంలో వినిపించడం అతిశయోక్తేం కాదు. అంతా ఈజీగా కొట్టిపారేయాల్సిన విషయమూ కాదు….