మునుగోడు ఉప ఎన్నికల్లో ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాలో. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఎన్నిక అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యలా మారింది. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంపింగ్‌లు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు ఈ పార్టీలో ఉన్నవాళ్లు రేపు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదు. ఎవరికి ఎక్కడ ఎన్ని తాయిళాలు దొరుకుతాయో తెలియదు. మొన్న టీఆరెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన సర్పంచులు మళ్లీ సొంత గూటికే చేరారు. తాజాగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆరెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు.
దీనికి ఆత్మాభిమానం, బానిసతనం, బడుగు, బలహీవవర్గాల సమస్యలు.. అంటూ ఏవేవో సమీకరణలు చెప్పి, సాకులు చూపి పార్టీకి రాజీనామా చేశాడు. ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన చండూర్ ఎంపీపీ పల్లె కళ్యాణి, పల్లె రవి కుమార్ కేటీఆర్ సమక్షంలో టీఆరెస్‌లో చేరారు. పల్లె రవి కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు టికెట్ ఆశించాడు. మధుయాష్కీ వెంట తిరిగాడు. పై లెవల్లో ప్రయత్నాలు చేశాడు. కానీ మధుయాష్కీ పలుకుబడి నడవలేదు. పల్లె రవిని పట్టించుకోలేదు.
దీంతో రవి అసంతృప్తితో ఉన్నాడు. అక్కడ బూర అసంతృప్తితో ఉండి పార్టీ వీడాడు. ఇప్పుడు అసంతృప్త రవి కూడా పార్టీ వీడాడు. టీఆరెస్‌లో చేరాడు. ఒక గౌడ్ పోయాడు. మరో గౌడ్ చేరాడు. పల్లె రవిది చండూరు మండలం బోరంగపర్తి. ఇక్కడ ఓటర్ల వారీగా చూస్తే ముదిరాజ్‌ల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత గౌడ్‌ల ఓట్లు. మూడో స్థానంలో పద్మశాలీల ఓట్లుంటాయి.