మునుగోడులో పడి మనోళ్లు మస్తు బిజీ అయ్యిండ్రు గానీ
టైం దగ్గర పడుతుందని ఆగమాగమైతుండ్రు గానీ
ఓటుకు ముప్పై వేలు, కుటుంబానికి తులం బంగారం, బ్రీజా కార్లు, బైకులు….. ఇచ్చేందుకు రంగం రెండీ చేసుంకుంటున్నరు గానీ…..
ఈ వార్త వైపు ఓ నజర్ పెడితే బాగుండు…. మునుగోడు ఓటర్ల కు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టేది.
ఇప్పటికే ఆ మునుగోడు కాస్ట్లీ ఉప ఎన్నిక జాబితాలో నెంబర్ వన్ పొజిషన్లో నిలబడనుంది. అవును… ఆ వార్తేందీ అంటరా..?
ఓ మామాలు సర్పంచ్ కోసం.. ఓ అభ్యర్థి మైండ్ బ్లాక్ అయ్యే హామీలు గుప్పించాడు. ఈ హామీలు మన నేతలూ చూశారా..? ఏమో మేమూ వీటిని అమలు చేస్తామని ప్రకటించినా ప్రకటిస్తారు… ఆశ్చర్యం లేదు. మరి గెలుపు అంత ముఖ్యం అందరికీ.
ఇప్పటికే రాష్ట్రంలోని ఓటర్లంతా మునుగోడు వైపు అక్కసుతో చూస్తున్నారు. వాళ్ల కడుపులు రగిలిపోతున్నాయి. కండ్లు మండిపోతున్నాయి. ఆ లిక్కర్ ప్రవాహం చూసి నోళ్లు ఎండిపోతున్నాయి. ఆ డబ్బు పంపకాల ప్రచారాలు చూసి గుండె గత్తరబిత్తరవుతున్నది.
మునుగోడు మినహా మిగిలిన ఓటర్లంతా ఏమనుకుంటున్నారో తెలుసా..? వాళ్ల మనసులో ఏముందో తెలుసా..??
మాకెందుకు రాదీ అదృష్టం… మొన్న హుజురాబాదు… ఇప్పుడు మునుగోడు… హమారా నెంబర్ కబ్ ఆయేగా..?
దేనికైనా రాసుకుని రావాలి. అదృష్టం ఉండాలి.. అంటారా..?
మునుగోడుతో రేటు పెంచిన నేతల్లారా..? రేపు మా దగ్గర జరిగే ఎన్నికల్లో కూడా ఈ రేటునే అమలు చేయాలని మేమంతా బాధతప్త హృదయాలతో, ముక్తకంఠంతో, ఏకగ్రీవంగా….. కంఠశోషతో, కన్నీళ్లతో మీకు వేడుకుంటున్నాము…..