మునుగోడు ఎమ్మెల్యేకు బీఎస్పీ నేత పెండెం ధనుంజయ్ నేత బహిరంగ లేఖ
గౌరవ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి…
మీరు మునుగోడు నియోజకవర్గం నుండి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన నాటి నుండి నేటివరకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడేలా చేయడంతో నియోజకవర్గ ప్రజలు అన్ని రకాలుగా అన్యాయానికి గురయ్యారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడప్పుడు చుట్టపు చూపుగా…. వచ్చిపోవడమే తప్ప చేసిందేమీ లేదని మీకు కూడా తెలుసు. ప్రజా ప్రతినిధిగా ప్రజల యోగక్షేమాలు చూడాల్సిన మీరు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమై,సొంత పార్టీపైన, అధికార పార్టీపైన హాట్ కామెంట్స్ చేస్తూ మీడియాలో కనిపిస్తున్నారే కానీ,
మీ విధులను సక్రమంగా నిర్వర్తించిన పాపాన పోలేదని నియోజకవర్గంలో ఎవరినీ అడిగినా చెబుతారు.గత కొంత కాలం నుండి పార్టీ మారుతున్నట్లు లీకులు ఇవ్వడం తర్వాత సైలెంట్ కావడమే పని పెట్టుకొని కాలం గడుపుతున్నారు.
మీ పార్టీ మార్పుపైన మీడియాలో చర్చలు జరగడం తర్వాత యధా మామూలుగా ఉండడం పరిపాటిగా మారింది.మీరు పార్టీ మారుతారో లేదో తెలియదు అది మీ ఇష్టం. ఒకవేళ పార్టీ మారే ఆ ఆకాశమే ఉంటే అదేదో త్వరగా నిర్ణయం తీసుకొని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చేలా చూడండి .గతంలో మీరు చెప్పిన విషయాన్నే మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను.
ఉప ఎన్నికలు వస్తే నియోజకవర్గంపై ప్రభుత్వం దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తుందని అన్నారు.మీ మాటలను నిజం చేస్తూ వీలైనంత త్వరగా రాజీనామా చేసి తద్వారా వచ్చే ఉప ఎన్నికల పుణ్యమా అని మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందేలా చూసి,మునుగోడు ప్రజలు మీకు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించి నందుకు వారి రుణం తీర్చుకోవాలని ఆశిస్తున్నాను…అట్లా కాకుండా కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ మారితే ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మీరు ఏ పార్టీలోకి వెళ్లినా నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీ లేదు.కానీ,దాని వలన ఉప ఎన్నిక వస్తే మునుగోడు ముఖ చిత్రం మారిపోతుంది .
కాబట్టి మునుగోడు ప్రజల బాగుకోరే వారైతే పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు వీలైనంత త్వరగా తెరదించి,పార్టీ మార్పు ఖాయమైతే
వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను తప్పక
నెరవేర్చాలని కోరుకుంటూ…
పెండెం ధనుంజయ్ నేత
బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ నాయకులు