నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. విపత్తు వేళ హుందాగా ఉండి, రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి పాటు పాడాల్సిన నేతలు ఈ సందర్భంలో కూడా రాజకీయ క్రీడలకు తెరలేపిన వైనాన్ని గమనించిన ప్రజలు దీన్ని తిప్పికొడుతున్నారు. అయితే కాళ్లలో కట్టెలు పెట్టడం.. లేదంటే కయ్యానికి కాలు దువ్వే తత్వం అర్వింద్‌ది. తన నైజం దుందుడుకు… అదే పంథాను అన్ని వేళలా ఉపయోగిస్తే చెల్లదనే విధంగా ఈ రోజు జరిగిన సంఘటనలు ప్రత్యక్ష ఉదాహరణలు. విపత్తు వేళలో కూడా రాజకీయాలు చేయాలని చూడటం జనాలకు నచ్చలేదు. ముందే పసుపుబోర్డు పై అబద్దం ఆడాడనే కోపం ఉండనే ఉంది. పైగా ఇలాంటి సమయాల్లో కూడా సహాయం, చేయూత అటుంచి రాజకీయ ప్రసంగాలు, పంచ్‌లకు ఎవరూ చప్పట్లు కొట్టే పరిస్థితి లేదు. రావొద్దు రావొద్దు అంటూ ఫ్లకార్డులు పట్టుకుని అడ్డగించే పరిస్థితులు తలెత్తాయి. జగిత్యాల జిల్లా పర్యటనలో ఇదే విధంగా అర్వింద్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది.
ఇబ్రహీంపట్రం ఎర్దండిలో పర్యటిస్తున్న ఎంపీ కారుపై గ్రామస్తులు దాడి చేశారు. అక్కడి నుంచి కమ్మరపల్లి మండల కేంద్రంలో స్వచ్చంధంగా, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి బీజేపీ నేతలు అర్వింద్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. విపత్తు వేళ రాజకీయం చేయొద్దని హితవు పలికారు. దీంతో అర్వింద్ తిరుగుముఖం పట్టాడు. అంతకు ముందు ఉదయం వేల్పూర్‌కు వచ్చి అక్కడ వర్షాలకు ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శించాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఆ నివాసాల్లో ఉండే జనాలు సిలిండర్లు అడ్డుపెట్టి అర్వింద్ రావొద్దంటూ నినాదాలు చేశారు. ఎలాంటి సహాయం చేయని అర్వింద్ తమకు ఈసమయంలో వచ్చి చేసేదేమీ లేదని, సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తమకు తెలుసునని హితవు పలికారు. దీంతో ఆ ప్రోగ్రాం కాన్సిల్ అయ్యింది.