రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు శత్రువులు గా కనిపించిన వారు నేడు మిత్రులు గా తెరకెక్కుతున్నారు. మొన్నటి దాకా రహస్య మిత్రులు బహిరంగ శత్రువులను కున్నవారు ఇక రాజీ లేదు…. రణమే… అంటూ సమరానికి సైరన్ మోగించాయి .
అధికార పార్టీ టిఆర్ఎస్ ఒకవైపు బీజేపీపై యుద్ధం ప్రకటించి మరోవైపు కాంగ్రెస్ ను సంకటంలో పెట్టే ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. మొన్నటి వరకు బఫూన్ గా పేర్కొన్న జాతీయ కాంగ్రెస్ అధినేతను ఈరోజు త్యాగనిరతి గల నాయకుడనీ ప్రశంసిస్తున్నది.
కరోనా సమయంలో ప్రధానిపై చిన్న విమర్శ చేసినా భరించలేక ఒంటి కాలిపై లేచి సమర్ధించిన టిఆర్ఎస్ అధినేత ఈరోజు మోడీ అంటే మంట మంట అంటూ రెండు రెండు కాళ్ళతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇందులో ఎంత నిజం ఎంత అబద్ధం..
అన్న ఈ విషయంపై ప్రజలను ఇంకా అయోమయం ఉండగానే బీజేపీ తమ ప్రథమ శత్రువని టిఆర్ఎస్ అధినేత ప్రకటించేశారు.
అంతేకాదు నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా భావించిన కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల వైఖరి అవలంభిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మొదలుకొని రాష్ట్రంలోని నాయకుల పట్ల అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక్క రేవంత్ రెడ్డి మినహా మిగతా కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ కు భిన్నంగా ఏమీ వ్యవహరించడం లేదు. పైగా జగ్గారెడ్డి లాంటి నాయకులు సీఎం ధైర్యంగా మాట్లాడుతున్నారని మెచ్చుకుంటున్నారు.
అడకత్తెరలో… రేవంత్… అధికార మీడియా లో మెరుపులు..
… మొన్నటి వరకు రేవంత్ రెడ్డి పేరు వింటేనే మంట మంట అన్న అధికార పార్టీ మీడియా నేడు ఆయనకు తగిన చోటు కల్పిస్తున్నది. ఆయన మాటకు ఎంతో కొంత విలువనిస్తున్నది.
సీఎం మానస పుత్రిక నమస్తే తెలంగాణ పత్రిక తో పాటు టిఆర్ఎస్ నోటికాడి మైక్ (మౌత్ పీస్) టీ న్యూస్ లో కూడా రేవంత్ రెడ్డి మెరుస్తు న్నారు. రేవంత్ రెడ్డికి ఇష్టమున్నా లేకున్నా రెండు మీడియాలు ఆయన బిజెపికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యతనిస్తూ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్దలు సీఎం సానుకూల వైఖరికి పరోక్షంగా స్నేహహస్తం అందిస్తుంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం టిఆర్ఎస్ తమ ప్రథమ శత్రువని, బిజెపి అంతే స్థాయిలోబద్ధశత్రువు అని స్పష్టం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ లో చాలామంది పెద్దలు ఆయనతో గొంతు కలుపుతూ ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. కొంతమంది అధికార పార్టీతో సన్నిహితంగా మెలుగుతూ రేవంత్ రెడ్డి ని ఇరకాటంలో పెట్టడానికి బలమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే బహిరంగంగానే కెసిఆర్ కు అంత పాడిన తీరు పార్టీలో కలకలం రేపుతుంది.
అధికార పార్టీ మీడియా రేవంత్ రెడ్డిని కూడా టిఆర్ఎస్ ట్రాప్ లో పడవేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు.
ఊసరవెల్లి……
ఈ క్రమంలో పీసీసీ చీఫ్ సీఎం కేసీఆర్ పై పిట్టగూడు (ట్విట్టర్) లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఊసరవెల్లి రాజకీయాలను నమ్మేది లేదని తెగేసి చెప్పారు. దానికి జాతీయ నాయకుడు మాణిక్ ఠాకూర్ కూడా నిజంగా ఊసరవెల్లి అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కానీ తమ పార్టీ టిఆర్ఎస్, బిజెపి రెండు పార్టీలకు సమ దూరమని, రెండు పార్టీలను దీటుగా ఎదుర్కొంటామని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీలో ఎంత మంది నాయకులు అండగా నిలుస్తారు…..? అన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది.
M M ROYAL