పీఎం మోడీ హైదరాబాద్ పర్యటన వివాదస్పదమైంది. ఇది కొత్త చర్చకు, కొత్త రాజకీయ పరిణామాలకు తెర తీసింది. జ్వరం పేరుతో కేసీఆర్ ఆయన పర్యటనకు డుమ్మా కొట్టడమే దీనికి కారణం. దీన్ని సాకుగా తీసుకుని బీజేపీ సోషల్ మీడియా రెక్కలు విప్పుకున్నది. సహజకంగా ఇలాంటి అవకాశాల కోసం చూసే ఎంపీ అర్వింద్ తనదైన దోరణిలో పంచతంత్ర కథలను వదలాడు. తన ఫేస్‌బుక్ వాల్‌పై కేసీఆర్‌ను నక్కగా, మోడీని సింహంగా అభివర్ణించాడు. మోడీ వెనుక నక్కలా కారు కూతలు కూసిన కేసీఆర్… ఆయన రాగానే దాక్కున్నాడని ఎద్దేవా చేస్తూ కామెంటాడు. దీనిపై టీఆరెస్ ఎదురుదాడికి దిగింది. ఒకరేమో…. మొన్న పంజాబ్‌లో రైతులు తిరగబడితే వెనక్కి పారిపోయింది ఈ సింహమేనా..? అర్విందూ అని వెటకారం చేయగా.. ఇంకొకరు…
సింహంలా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చి మరీ ఢిల్లీకి వెళ్తే… నాలుగు రోజుకు కనబడకుండా దాక్కున్నది మీ మోడీ పిల్లియే కదా అని బ్రో అంటూ అర్వింద్‌తో ఆడుకున్నారు.
మోడీ హైదరాబాద్ పర్యటన మొత్తానికి ఈ రెండు పార్టీల మధ్య ఎంత అగాథం ఏర్పడి ఉందో తెలియజెప్పింది. ఇక భవిష్యత్తులో ఈ రెండు ఉప్పు నిప్పులా చెలరేగిపోతాయన్నమాట. ఒకప్పుడు కేసీఆర్‌ను బీజేపీకి బీ టీమ్ అని అంతా అనుకున్నారు. ఆయన తమలపాకులతో కొట్టినట్టు చేస్తే బీజేపీ ఏడ్చినట్టు చేసేదనే అభిప్రాయమూ ఉండేది. రాను రాను దాన్ని పూర్తిగా చెరిపేసుకున్నాడు కేసీఆర్. వరుసగా జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ స్టాండ్ తీసుకున్నాడు. కొత్త పంథా ఎంచుకున్నాడు. బీజేపీతో వైరం పెట్టుకోవాలనే చూస్తున్నాడు. కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ఇక ఈ ఫైటింగ్ తీవ్ర స్థాయికి చేరి సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల నేతలు, అభిమానులు, వారియర్లు హోరాహోరీ యుద్దానికి దిగనున్నారు.