ప్రతోడు ఓ యూట్యూబ్ చానెల్ తెరవాలే. విలేకరి గిరీ చేయాలె. ఓ ఐడెంటిటీ కార్డు చేపిచ్చుకోవాలె. జర్నలిస్టుగా చెలామణి కావాలె. నా గంట నొక్కండి. నన్ను సబ్స్‌క్రైబ్ చేసుకోండ్రని బిచ్చమెత్తుకోవాలె. కానీ గల్లా ఎగిరేసుకుని తిరగాలె. అక్రిడియేషన్ కార్డు మాత్రం రాదు. కాబట్టి వీళ్లంతా విలేకరులు కాదు. నకిలీ గాళ్లు. బ్లాక్ మెయిలర్లు. చోర్ కమీనే గాండ్లు. నీచ్ కుత్తే గాళ్లు.. ఇంకా.. ఇంకా.. దేశద్రోహులు.. రాజ్యద్రోహులు.. అన్నీ.. అన్నీ. సరే, వీళ్లంతా పొట్టతిప్పల కోసం ఏదో చేస్తున్నారు గానీ.,
ఒక్కటే అర్థం కాని ముచ్చట.
అక్రిడేషన్ ఉన్న విలేకరులకు తెలంగాణలో ఇప్పటిదాకా ఒరిగిందేమన్నా ఉందా..? మన అల్లమన్నను ఎప్పట్నుంచి అడగాలనే కోరిక ఇట్టా.. ఈ సందర్బంలో బయటకు వచ్చింది. ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ అయినకాడ్నుంచి గప్‌చిప్ గా తనపని తాను చేసుకుంటున్నాడు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సర్కార్ నింపిన పైసల మిత్తీ లెక్కలు అవీ చూసుకుంటూ ఉన్నాడు. అక్రిడేషన్ ఉన్నోడే నిఖార్సయిన జర్నలిస్టు అని అల్లమన్న అనుకుంటే.. వాళ్ల కోసం కేసీఆర్, అల్లమన్నా.. రామన్నా.. ఇంకా ఏవరైనా.. ఏమైనా చేశారా..? వాళ్లకేమైనా ప్రయోజనం చేకూరిందా… ? ప్రయోజనం మాటటుంచు. వాళ్లకు తెలంగాణ రాష్ట్రంంలో కనీస గౌరవమైనా దక్కుతుందా..? మర్యాదిచ్చెడోడెవడు..? దబాయింపులు తప్ప.గుర్తించెటోడెవడు.. ముఖం మీదే తిట్టి అవమానించుడు తప్ప. డబుల్ బెడ్ రూంలు.. ఇండ్ల స్థలాల మాట తీస్తే.. అదో పెద్ద జోక్. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుని నవ్వుకుని బ్ర హ్మానందంలా కిందపడి బొర్లాడి పడీ పడీ నవ్వీ నవ్వీ చచ్చిపోవాలి. అవి ఈ జన్మలో తమకు రావని విలేకరి గిరీ ఎలగబెట్టెటోళ్లందరికీ తెలిసిపోయింది. అయినా ఆశ చావలే. ఇంకా ప్రెస్‌క్లబ్ ల దగ్గర, కలెక్టరేట్ల దగ్గర కుక్కల్లా పడిగాపులు కాస్తున్నారు.
కడుపు చించుకుంటే కాళ్ల మీదే పడతుందే అల్లమన్నా.. ఏనాడైనా సీఎం కేసీఆర్ నీకు అపాయింట్‌మెంట్ ఇచ్చిండా…? నువ్వు పోయి విలేకరుల కోసం ఏమైనా అడిగినవా..? అసలు ప్రెస్ అకాడమీ ఉన్నదే చైర్మన్ సీటు కోసం. అంతే. అడిగేది లేదు. కడిగేదీ లేదు. సాధించేది లేదు. చచ్చేదీ లేదు. ఇలా మరీ తప్పదనుకుంటే రామన్న ఏమనుకుంటాడో అని బయటకు వచ్చి.. ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు అన్నట్టు ఖండిస్తున్నామంటే.. ఖండిస్తున్నాం.. అని అనేసి మళ్లీ లోపలికి తుర్రుమంటే సరి. అంతకు మించి ఎక్కువ మాట్లాడితే.. ఈ మీడియా ఉందే.. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి చంపుతుంది మరి.
