.కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వస్తానని, తాడోపేడో తేల్చుకుంటానని శపథం చేసి .. కొండంత రాగం తీసి.. మళ్లీ పాత పాటే అందుకున్నాడు. యాసంగిలో వచ్చే పారాబాయిల్డ్ రైస్‌ను కేంద్రం తీసుకోనని చెప్పేసిందని, రైతులంతా ఆరుతడి పంటలకు వెళ్లాలని సర్కార్ చెబుతోంది. ఈ మాట రైతులకు చెప్పడానికి కేసీఆర్ గానీ, వ్యవసాయ శాఖ మంత్రి గానీ మీడియా ముందుకు రావడం లేదు. రాజకీయాలు ముగిశాయి.
కేసీఆర్‌ను ఇరుకున పెట్టాలని బండి సంజయ్.. బండి సంజయ్ చెప్పేవన్నీ అబద్దాలని కేసీఆర్… ఇలా ఒకరికొకరు రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఇంత వరకు డ్రామా చేస్తూ వచ్చారు. అంతే తప్ప రైతులకు మేలు చేయడానికి కాదు. కేసీఆర్‌కు అప్పుడే తెలుసు. కేంద్రం యాసంగి పంటను తీసుకోదని. కానీ రాష్ట్ర బీజేపీ రైతులను రెచ్చగొడుతున్నది. దీన్ని అడ్డుకునేందుకే మహాధర్నా చేసింది టీఆరెస్.
ఈ ధర్నా కలిసొచ్చి తెల్లారే మోడీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో.. ఇదేదో బాగుందే అనుకొని.,,అక్కడ చనిపోయిన రైతు కుటుంబాలకు మూడు లక్షల చొప్పున పరిహారం ఇచ్చేస్తే… ఇదీ ఓ రాజకీయమే. అంతే. దీనికి మించి బీజేపీ, టీఆరెస్‌లు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రోజు సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి మళ్లీ పాత కథే చెప్పాడు. రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా రేపటి నుంచి వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని, ప్రచారం చేయాలని ఆదేశించాడు.
రైస్ మిల్లర్లతో ఒప్పందం ఉంటేనే, బై బ్యాక్ ఒప్పందం చేసుకుంటేనే వరి వేసుకోవాలట. లేదంటే రైతుల ఖర్మ. ప్రభుత్వం కొనదు. ఇదీ ఇప్పుడు ప్రభుత్వం రైతులకు చెప్పాలనుకున్నది. వరి వస్తే ఇక ఉరే అన్నట్టు. వరి వేస్తే రైతే రిస్కు తీసుకోవాలి. ప్రభుత్వం పట్టించుకోదు.
