సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైన‌ట్టు తెలుస్తోంది. నిన్న పెద్ద కొడుకు ధ‌ర్మ‌పురి సంజ‌య్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చేప‌ట్టిన ఉచిత సామూహిక వివాహాల‌కు హాజ‌ర‌య్యాడు. ఈ వేడుక‌కు డీఎస్ కాంగ్రెస్‌లోని త‌న శిష్య‌గ‌ణాన్ని ఆహ్వానించాడు.

డీసీసీ మాజీ ప్రెసిడెండ్లు గ‌డుగు గంగాధ‌ర్‌, తాహెర్ బిన్ హందాన్‌, మాజీ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ కాట్‌ప‌ల్లి న‌గేశ్‌రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. వీరికి ప్ర‌త్యేకంగా ఆహ్వానం ప‌లికారు తండ్రీ కొడుకులిద్ద‌రు. వీరంతా పెద్ద మ‌నిషి ఆహ్వానం మేర‌కు వివాహ వేడుక‌కు హాజ‌రై వెళ్లిపోయారు. ఇప్పుడిదే రాజ‌కీయంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. గ‌త కొద్ది రోజులుగా డీఎస్ పార్టీ మారుతాడ‌ని ప్రచారం జ‌రుగుతోంది. టీఆరెస్‌తో సంబంధాలు దూర‌మైన‌ప్ప‌టి నుంచి ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నాడు త‌ప్ప ఏపార్టీలోకి వెళ్ల‌లేదు.

ఇటీవ‌ల ఆయ‌న బీజేపీలో చేర‌తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ ఆయ‌న త‌న పెద్ద కొడుకు, నిజామాబాద్ మాజీ మేయ‌ర్ ధ‌ర్మ‌పురి సంజ‌య్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్పించి, అర్బ‌న్ ఎమ్మెల్యేగా చేయాల‌న్న‌ది సంక‌ల్పం. చిన్న కొడుకు అర్వింద్‌.. బీజేపీలో చేరి ఎంపీగా ఎన్నిక‌య్యాడు. అర్వింద్ గెలుపులో, కవిత ఓట‌మిలో డీఎస్ భాగ‌స్వామ్యం చాలా ఉంది. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. అర్వింద్ రాజ‌కీయంగా త‌న‌కంటూ ప‌ట్టు సాధిస్తూ వ‌స్తున్నాడు.

అధిష్టానం వ‌ద్ద, ఢిల్లీ పెద్ద‌ల‌తో మంచి సంబంధాలున్నాయి. ఇక చిన్న కొడుకు రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు ఢోకా లేద‌ని డీఎస్ భావించాడు. ఇప్పుడాయ‌న తండ్లాటంతా.. పెద్ద కొడుకు సంజ‌య్ కోస‌మే. త‌న‌తో పాటు టీఆరెస్‌లోకి తీసుకొచ్చినా.. పార్టీ పెద్ద‌గా ఇద్ద‌రినీ ప‌ట్టించుకోలేదు. డీఎస్‌ను అవ‌మానించారు. కొడుకును ప‌క్క‌కు పెట్టేయ‌డ‌మే కాదు… లైంగిక ఆరోప‌ణ‌ల కేసులు జైలుకు పంపారు. దీంతో డీఎస్ అహం దెబ్బ‌తిన్న‌ది. తీవ్ర అవ‌మాన‌కంగా భావించాడు. కేసీఆర్ మీద ఆ బ‌ద్లా క‌విత ఓట‌మి ద్వారా తీర్చుకున్నాడు.

ఇప్పుడు ఎటూ కాకుండా పోయిన త‌న పెద్ద‌కొడుకు రాజ‌కీయ జీవితాన్ని చ‌క్క‌దిద్దేందుకు త‌న జీవిత చ‌రమాంకాన్ని వినియోగించేందుకు సిద్ద‌ప‌డ్డాడు. అందుకే మ‌ళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు. అక్క‌డ ఢిల్లీ పెద్ద‌ల‌తో డీఎస్‌కు ఇంకా సంబంధాలున్నాయి. త‌ను పార్టీలో చేరితే పార్టీ ప‌టిష్ట‌త‌కు ఉప‌యోగం అని, పెద్ద కొడుకు కు అర్బ‌న్ టికెట్ ఇవ్వాల‌నే నిబంధ‌న‌ను పెట్టి మ‌రీ మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాల‌ని ఆయ‌న భావిస్తున్నాడు. ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వి కాలం మార్చి వ‌ర‌కు ఉంది. కానీ మూడు నెల‌ల ముందే రాజ్య‌స‌భ‌కు రిజైన్ చేద్దామ‌ని డీఎస్ అనుకుంటున్నాడు.

ఈ విష‌యాన్ని చిన్న కొడుకు అర్వింద్ ఓ ఇంట‌ర్వ్యూలో ధ్రువీక‌రించాడు. అప్పుడే రిజైన్ చేయ‌డ‌మెందుకు ..? చివ‌రి వ‌ర‌కూ ఉండాల‌ని కోరుకున్నాడు. బీజేపీలో కూడా చేర్పించాల‌ని చూశాడు కానీ.. డీఎస్ మ‌న‌ను కాంగ్రెస్ వైపే ఉంది. పెద్ద కొడుకు రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ఆ తండ్రి మ‌న‌సు తండ్లాడుతున్న‌ది.

ఈనెల 29 నుంచి జ‌రిగే పార్ల‌మెంటు స‌మావేశాల‌కు డీఎస్ హాజ‌ర‌వుతాడు. అక్క‌డే ఢిల్లీ పెద్ద‌ల‌తో క‌లిసి పార్టీలో చేరే విష‌యంలో క్లారిటీ ఇస్తాడు. డిసెంబ‌ర్ మొద‌టి వారంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకుంటాడ‌ని తెలుస్తోంది. దీంతో జిల్లా రాజ‌కీయాల్లో మ‌రింత క‌ద‌లిక రానుంది. ఇక్క‌డి రాజ‌కీయాలు మ‌రింత ప‌దునెక్క‌నున్నాయి. ఇప్ప‌టికే జిల్లా రాజ‌కీయాల్లో క‌విత క్రియాశీల‌కం కానుంది. త్వ‌ర‌లో మంత్రి పద‌వి వ‌రించ‌నుంది. మొన్న‌టి వ‌ర‌కు అజ్ఞాతంలో ఉన్న డీఎస్ కూడా ఇప్పుడు నాలుగ్గోడ‌లు వ‌ద‌లి ప్ర‌జాక్షేత్రంలోకి రానున్నాడు. ఇందూరు రాజ‌కీయాలు మ‌రోసారి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు తెర‌తీయ‌నున్నాయి.

You missed