అద్దె బస్సులను నడిపే యాజమాన్యం.. ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే డ్రైవర్లను పంపుతున్నది. అంతకు ముందు కచ్చితంగా శిక్షణ తీసుకున్న తర్వాతే .. అతన్ని విధుల్లోకి తీసుకునేవారు. కరోనా మొదటి వేవ్ ప్రారంభమైన తర్వాత దీనికి స్వస్తి పలికారు ఆర్టీసీ అధికారులు. హెవీ మోటర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు అతనికి శిక్షణ ఇవ్వకుండానే డ్యూటీలోకి తీసుకున్నారు. ఈ నిర్లక్ష్యమే ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. నిన్న వికారాబాద్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో అద్దె బస్సు నడిపింది శిక్షణ లేని డ్రైవరే. దీనిపై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సీరియస్ అయ్యాడు.
ఆర్టీసీలో ఇకపై ఎవరూ శిక్షణ లేని డ్రైవర్లు ఉండరాదని ఆర్డర్ పాస్ చేశాడు. కచ్చితంగా హైర్ బస్సు డ్రైవర్లు శిక్షణ తీసుకోవాలని ఆదేశించాడు. హకీంపేట్, వరంగల్ లో ఆర్టీసీ శిక్షణా కేంద్రాలున్నాయి. కానీ వీటిని ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకోవడం మానేసింది. కరోసా సాకుతో దీన్ని అలాగే ఉంచేశారు. అద్దె బస్సుల యాజమాన్యాలు కూడా డ్రైవింగ్ లైసెన్సు ఉంటే చాలు అని చూస్తున్నారు తప్ప.. బస్సు నడపడంలో సరైన నైపుణ్యం ఉందా..? అనుభవం ఉందా..? అని చూడటం లేదు. తక్కువ జీతానికి ఎవరొస్తే వారిని పెట్టేసుకుంటున్నారు. దీంతో చాలా మంది హైర్ బస్సులు నడిపేది లారీ డ్రైవర్లే. లారీ డ్రైవర్లు … లారీని నడిపినట్టే బస్సును కూడా రఫ్‌గా నడపడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
దీన్ని గ్రహించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి స్ట్రిక్ట్‌గా ఆర్డర్ పాస్ చేశాడు. యుద్దప్రాతిపదిక అద్దె బస్సు డ్రైవర్లు శిక్షణకు హాజరుకావాలని, హాజరుకాకపోతే జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించాడు.