ధ‌ర్నా చౌక్ ఇప్పుడు వార్త‌ల్లో అంశం. ఇందిరాపార్క్ వ‌ద్ద ఉన్న ధ‌ర్నా చౌక్ అంటే తెలియ‌నివారుండ‌రు. అంత‌లా ఫేమ‌స్ ఇది. అక్క‌డ ఏ ధ‌ర్నాకు పిలుపిచ్చినా తెలంగాణ‌లోని అన్ని జిల్లాల నుంచి వెళ్లి పాల్గొంటారు. హైద‌రాబాద్ చూడ‌ని ఎంతో మంది ధ‌ర్నా చౌక్‌కు వ‌చ్చి వెళ్లారు. ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. కానీ తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత కేసీఆర్‌కు ఈ ధ‌ర్నా చౌక్ కోపం తెప్పించింది. అదేందీ.. ధ‌ర్నాలు చేయ‌డానికి ప్ర‌త్యేకంగా ఓ చోటు కావాల్నా..? అంతా అక్క‌డికి వెళ్లే ధ‌ర్నాలు చేయాల్నా..? ఎవ‌రికి ఎక్క‌డ ఇష్టమున్న చోట వాళ్లు చేసుకోవ‌చ్చు క‌దా.. అని తేలిగ్గా తీసిపారేశాడు. అక్క‌డ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద‌న్నాడు. ప‌ట్టుబ‌ట్టి లేపేపించాడు. కానీ హైకోర్టు జోక్యంతో అది కొన‌సాగుతున్న‌ది.

రేప‌టి రైతు దీక్ష‌కు టీఆరెస్‌కు ఇదే దిక్కైంది. ఇక్క‌డ్నే ధ‌ర్నా చేసేందుకు రెడీ చేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ను టార్గెట్ చేశారు ఉద్య‌మ‌కారులు.. తెలంగాణ‌వాదులు. అప్పుడొద్ద‌న్నావు..? మ‌రి మీకు ఇప్పుడు ఎందుకు అవ‌స‌రం ప‌డ్డ‌ది..? అని ప్ర‌శ్న‌ల‌తో నిల‌దీశారు. దీంతో ఈ రోజు ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ఇలా స‌మాధాన‌మిచ్చి.. స‌మ‌ర్థించుకున్నాడు. అలా మేము అన‌లేదు… ప్ర‌జ‌లే కోరుకున్నారు.. అని స‌ర్ధిచెప్పుకునే ప్ర‌య‌త్నంలో ఓ అబ‌ద్దం ఆడేశాడు. సంద‌ర్భం వ‌చ్చినప్పుడు ఎవ‌రూ త‌ప్పించుకోవ‌డానికి ఉండ‌దు. ఇలా స‌మాధాన‌మివ్వాలి. స‌మాధానం దొర‌కక‌పోతే ఓ అబ‌ద్దం ఆడాలి. అదీ న‌మ్మ‌క‌పోతే త‌ల‌దించుకోవాలి. త‌ప్పొప్పుకుని చెంప‌లేసుకోవాలి. కానీ చేసిన త‌ప్పుకు ఏనాడో ఒక‌నాడు మూల్యం మాత్రం చెల్లించుకోవాలి. దాన్ని త‌ప్పించుకోవ‌డానికి వీల్లేదు. వీలు కాదు.