కేటీఆర్‌ను సీఎం చేయడం పక్కా. ఇది కేసీఆర్ మదిలో ఉన్న ఆలోచన. కానీ ముహూర్తమే కలసి రావడం లేదు. ఒకటి కాకపోతే మరొకటి ఏదో ఒకటి ఆటంకం వస్తూనే ఉంది. ఆఖరికి మార్చిలో యాదాద్రి ఘట్టం పూర్తవగానే ఈ తంతు కానిచ్చేస్తాడు కేసీఆర్. కేటీఆర్ సీఎం కావడానికి ఎలాంటి అడ్డు లేకుండా చేసుకుంటూ పోతున్నాడు. ఈటలను పక్కకు తప్పించాడు. ఎలాగైనా చిత్తుగా ఓడగొట్టాలనుకున్నాడు. కానీ కుదరలేదు. హరీశ్‌ను రంగంలోకి దింపాడు.
కానీ చాలా మందికి కేసీఆర్ వ్యవహారం మీద మొదటి నుంచి అనుమానం ఉంది. హరీశ్‌ను కావాలనే ఓడిపోయే సీటు కోసం ప్రచారానికి పంపి.. ఆ తర్వాత ఓటమిని హరీశ్ ఖాతాలో వేస్తాడని. అలా రాజకీయంగా దూరం పెంచుతూ .. ప్రయార్టీ తగ్గిస్తాడని ప్రచారం ఉంది. గతంలో ఇలా చేశాడు కూడా కేసీఆర్. మొన్న దుబ్బాక, నిన్న హుజురాబాద్ తర్వాత హరీశ్ పై ప్రజల్లో కూడా నమ్మకం పోయింది. కానీ కేసీఆర్ మాత్రం హరీశ్‌ను దూరం చేసుకుంటే రాజకీయంగా ఇబ్బందే అని విషయం ఏనాడో గ్రహించాడు.
తాను ఉన్నన్ని రోజులు హరీశ్ కిక్కురుమనడు. రేపు కేటీఆర్ సీఎం అయితే.. వేరు కుంపటి పెడితే.. అసమ్మతి రాజేస్తే.. ప్రభుత్వాన్ని వచ్చిన్నంచేస్తే.. పార్టీ రెండుగా చీలిపోతే.. ఇగో ఇవే అనుమానాలు, ప్రశ్నలు కేసీఆర్‌ను అతలాకుతలం చేస్తాయి. అందుకే హుజురాబాద్ ఓడిపోయినా.. వెంటనే అతని ప్రయార్టీని పెంచినట్టుగా ఉంటుందనే.. నిన్న ఆరోగ్యశాఖను అప్పగించేశాడు. వచ్చే నెలలలో మంత్రి వర్గ విస్తరణ కచ్చితంగా ఉంటుంది. మరి అప్పటి వరకు ఆగలేడా…? ఇన్ని రోజులూ అది అనాధగానే ఉంది. ఇంత త్వరగా ఆ శాఖను అప్పగించాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకు, ప్రతిపక్షాలను దీని ద్వారా హరీశ్‌ను ఏమాత్రం తగ్గించడం లేదనే సంకేతం ఇవ్వాలి. ఇచ్చాడు.
నమ్మినబంటులా హరీశ్ పడుండాలి. తను ఏ నిర్ణయం తీసుకున్నా.. హరీశ్ ఆమోదించాలి. కేటీఆర్‌కు సహకరించాలి. రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి. ప్రతిపక్షాలు బలం పెంచుకుంటున్నాయి. ఇప్పుడు కాకపోతే మళ్లీ కేటీఆర్‌ను సీఎం చేయలేడు. రాహుల్ గాంధీకి పట్టిన పరిస్థితి కేటీఆర్‌కు పట్టకూడదు.. ఇవే కేసీఆర్ మదిలో ఆలోచనలు. ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు ఇంకా ఎక్కువ సమయం లేదు.