పిల్లలు ఆన్ లైన్ క్లాసుల్లో నిమగ్నమై ఉన్నారు. ఓ చూపు ఇటువైపు వేశారు. మళ్లీ క్లాసుల్లో ఎవరికి వారే లీనమైపోయారు.
రాజారెడ్డి తన గదిలో ఉన్న సెల్ఫ్ పై కాలి ముందు వేళ్లపై నిలబడి కుడి చేతి పెట్టి వెతుకుతున్నాడు. అటూ ఇటూ తడుముతున్నాడు. దేని కోసమో వెతుకుతున్నాడు.
ఊహూ … అది కనిపించడం లేదు. స్టూలను దగ్గరకు లాక్కున్నాడు. దాని పైకెక్కి మళ్లీ అంతా కలియజూశాడు.
ఓ మూలకు ఉన్న బస్తా కింద చేతి పెట్టి చూశాడు. తగిలింది. అతి చేతికి తగలగానే ప్రాణం లేచొచ్చినట్లయ్యింది రాజారెడ్డికి. ముఖం విప్పారింది.
దాన్ని బయటకు లాగాడు. చిలుము పట్టి ఉన్న .. “క………త్తి……. అది.” పిడిని వెండితో చేయించారు. పిడి మాత్రమే తెల్లగా ఉంది. మిగిలిన ఇనుము భాగమంతా తుప్పు పట్టి ఉంది.
ఇంట్లో కోళ్లు కోయడానికి, పొలాల వద్ద పండుగ చేసినప్పడు మేకలను కోసేందుకు ఉపయోగించే కత్తి అది. దాన్ని వాడక చాలా రోజులైనట్లు చూస్తేనే తెలుస్తున్నది.
కిందికి దిగాడు. ఓ పేపర్ తో కత్తికి పట్టిన చిలుము తుడిచేశాడు. పైపైన పోయింది కానీ ఇంకా అలాగే చిలుము పూత ఉంది. నీళ్లతో దాన్ని కడగాలి.
కానీ కడిగే టైమ్ లేదు అతనికి. అంత ఓపికా లేదు. ఇంకో పేపర్ తీసుకొని కత్తిని అందులో పెట్టి చుట్టాడు. దాన్ని బొడ్డు భాగంలో ప్యాంటు కింద జొనిపాడు.
సగం ప్యాంటు వెనుకబాగాన, మిగిలిన పై సగభాగం పిడి బొడ్డుపై వరకు వచ్చింది. పై నుంచి యధావిధిగా షర్ట్ ను కప్పేశాడు.
అంతే వడివడిగా బయటకు నడిచాడు.
ఎటూ చూడటం లేదు. అడుగులు పెద్ద పెద్దగా వేసుకుంటూ క్షణాల్లోనే ఆ సందు చివరకు వెళ్లి క్షణాల్లో మాయమైపోయాడు.
అన్నం ప్లేట్లో పెట్టుకొని గదిలోకి రాగానే వడివడిగా భర్త బయటకు వెళ్లడం చూసింది వనజ. “ఎక్కడికి?” అనేలోపే అతను కనుచూపు మేర కనిపించకుండా పోయాడు. బయటకు వచ్చి చూసినా… అప్పటికే కనుమరుగైపోయాడు. ఆమెలో టెన్షన్ మరింత పెరిగింది. రాజారెడ్డి ముఖం చూస్తే ఏదో భయం కలుగుతుందామెకు. ఏదైనా ఉపద్రవం సంభవిస్తుందనే కీడును శంకిస్తున్నది మనసు. మళ్లీ లక్ష్మికి ఫోన్ కలిపింది. స్విచాఫ్ చేసి ఉంది ఇంకా.
*****
వడివడిగా అలా నడుస్తూ వెళ్లిన రాజారెడ్డి ఓ చౌరస్తా వద్ద ఆగాడు. దమ్ము వస్తున్నది. గుండె వేగంగా కొట్టుకుంటున్నది.
కొద్ది సేపు సేదతీరాడు. ఇంకా ఆలస్యం చేయదలచలేదు. జేబులోంచి ఫోన్ తీశాడు. “ఆటో డ్రైవర్ రవి’కి ఫోన్ కలిపాడు. రెండు రింగులకే అతను లేపాడు. “నమస్తే రెడ్డీ సాబ్ .. ! చెప్పు. ఎక్కడ?” “నేను చౌరస్తాలో ఉన్నాను. అర్జెంటుగా రా. ఆటో తీసుకొని.” ఫోన్ పెట్టేశాడు. ‘తనకు ఎప్పడూ ఫోన్ చేయని రాజారెడ్డి అర్జెంటుగా రమ్మంటాడేమిటి?’అని డౌటొచ్చింది. వనజకు ఫోన్ కలిపాడు రవి.
ఆమె లిఫ్ట్ చేసింది. విషయం చెప్పాడు. ఆమెకు అర్థం కాలేదు. ఏదో పని ఉండి ఉంటుంది. రవి తోడుంటే బెటరే కదా అనుకున్నది.
“వెళ్లు” అన్నది అన్యమనస్కంగానే. ఐదు నిమిషాల్లో రాజారెడ్డి ముందు ఆటో ఆగింది. చటుక్కున లోన కూర్చుని “పోనీ” అన్నాడు. “దూరంగా పోనీ ఎక్కడికైనా… ప్రశాంతంగా “అన్నాడు. అర్థమయ్యింది రవికి. గేర్ మార్చాడు. వేగం పెంచాడు. “మధ్యలో వైన్స్ దగ్గర ఆపు.” రవి జేబులో ఐదొందల రూపాయల నోటు పెట్టాడు. చూసుకున్నాడు రవి. ఏమీ అనలేదు. వైన్స్ ముందు ఆపాడు. ఏం కావాలన్నట్లుగా చూశాడు రవి. “నీకేం కావాలి?” అన్నాడు రాజారెడ్డి.
” అదే తీసుకో” అన్నాడు. అతని సమాధానం చెప్పేవరకు కూడా ఆగలేదు. రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు. ఆటో మళ్లీ స్టార్ట్ అయ్యింది. వేగం పెంచాడు. చీకట్లు కమ్ముకుంటున్నాయి మెల్లగా. చల్లని గాలులు వీస్తున్నాయి.
వెనుక కూర్చున్న రాజారెడ్డి చుట్టూ పరిసరాలు గమనిస్తున్నాడు కానీ. అవేవి అతని గమనంలోకి రావడం లేదు. అతని మెదడు క్షుద్ర ఆలోచలనతో సతమతమవుతున్నది. గుండె వేగం ఆటో వేగాన్ని మించిపోతున్నది. చల్లటి వాతావరణంలో కూడా చెమటలు రావడం ఆగలేదు అతనికి.
ప్యాంటు కింద పెట్టుకున్న కత్తి తొడకు గుచ్చుకుంటున్నది. నిలబడినప్పుడు ఏమి అనిపించలేదు. ఆటోలో కూర్చున్నప్పడు కత్తి మొన పేపర్ల అంచులను చీల్చి తొడను తాకుతున్నది. అది తాకినప్పుడల్లా “చులుక్.. చులుక్” మంటున్నది. గుంతలు వచ్చినప్పడు ఆటో ఎత్తికుదేసినప్పడు అది తొడను మరింతగా తాకుతున్నది.
“తొడను చీల్చేస్తుందేమో..?” అనిపిస్తుందతనికి. చేత్తో దాన్ని అదిమి పడుతున్నాడు. కానీ అది కిందకు జారుతూనే ఉంది.
మంచి రక్త దాహం తో ఉందేమో తొడ కండరాలను పీలికలు చేసేలా ఉందాకత్తి “ఎటైనా ఆపరాదు.?” అన్నాడు రాజారెడ్డి. డాంబర్ రోడ్డు నుంచి ఎడమ వైపునకు తిప్పాడు. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక దగ్గర ఆపాడు. కిందికి దిగలేదు రాజారెడ్డి ఆటోలోనే కూర్చున్నాడు. “దిగండీ రెడ్డీ సాబ్.. ఆటోలోనే ఎందుకు? వాతావరణం చల్లగా ఉంది.” అన్నాడు.
కిందికి దిగాడు. అక్కడే కూలబడ్డాడు. తొందరపడుతున్నాడు రాజారెడ్డి. ఆందోళన పెరగడంతో చేతులు కూడా వణుకుతున్నాయి. జరిగేది తలుచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. గుండె లయతప్పుతున్నది. అయినా ధైర్యం తెచ్చకుంటున్నాడు.
“ఊ … కానీ..” అన్నాడు రాజారెడ్డి, రాజారెడ్డికి ఎదురుగా చెప్పులు విప్పి వాటి పై కూర్చున్నాడు రవి. కవర్ లో తెచ్చిన ఐటెమ్స్ అన్నీ ముందుంచాడు. అంతలో ఫోన్ మోగింది. “రెడ్డీ సాబ్…! ఇంటి నుంచి ఫోను…” “ఆలస్యమవుతుందని చెప్తా..!” అని లేచి పక్కకు పోయి మాట్లాడసాగాడు.
రాజారెడ్డి లోపల ఉన్న కత్తిని తీసి పక్కనే పెట్టుకున్నాడు. చీకట్లో అది కనిపించడం లేదు. మసక మసకగా పేపర్ మాత్రమే కనిపిస్తున్నది.
“ఆలస్యమేందిరా..? ఇక నువ్వు శాశ్వతంగా ఇంటికి పోవు….. నీ చావు నా చేతిలో రాసి పెట్టి ఉంది.” అని మనసులో అనుకున్నాడు.
పళ్లు పటపటా కొరికాడు. కానీ.. రాజారెడ్డికి తెలియదు
తనను
మృ.. తు….. వు……. వెంటాడుతున్నదని.
*****
(ఇంకా ఉంది)
