ఆమె ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత. ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ చేయించుకున్నాది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. టెస్టులన్నీ అక్కడే చేయించుకున్నఆమెకు ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో డెలివరీలు పెరగాలని ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టింది. ఆడబిడ్డ పుడితే 13వేలు, మగ బిడ్డ పుడితే 12వేలు ఇస్తోంది. మూడు, నాలుగు విడతలుగా వీటిని తల్లి ఖాతాలో వేస్తున్నారు. డెలివరీ అయి ఇంటికి వెళ్లేటప్పుడు కేసీఆర్ కిట్ పేరుతో పాపకు, తల్లికి కావాల్సిన వస్తువులను కూడా పెట్టి ఇచ్చి పంపుతున్నారు.
తమిళనాడులో జయలలిత ప్రవేశపెట్టింది ఈ పథకం మొదలు. దాన్ని స్టడీ చేసి తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఇక్కడ కేసీఆర్ కిట్ పేరుతో అమలు చేశారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవడమంటే.. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత గవర్నమెంటు దవాఖానలకు డెలివరీల కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డబ్బులు వస్తాయనేదిఒకటి కాగా.. ప్రైవేటులో ఒక్క కాన్పుకు 20వేల నుంచి 30వేల వరకు ఖర్చవుతున్నది. ఈ ఖర్చు భారం నుంచి తప్పించుకోవడం కోసం .. చాలా మంది సర్కారు దవాఖానల్లోనే కాన్పులు అవుతున్నారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రుల్లో మౌళిక వసతులు పెరగలేదు. డాక్టర్ల సంఖ్య, సిబ్బంది సంఖ్య పెరగలేదు. అవసరమైన స్టాఫ్ రిక్రూట్ కాలేదు. అన్నింటికీ మించి దవాఖానల్లో అదే నిర్లక్షం.. అదే అంతులేని అవినీతి. ఎట్లాగూ గవర్నమెంటు పైసలిస్తుంది కదా.. మాకేమిస్తారు.? అని డైరెక్టుగా పేషెంట్ బంధువులను ముందే డిమాండ్చేసి వసూలు చేస్తున్నారు. ఇది నడుస్తూనే ఉంది. బయటకు చెప్పేవారుండరు.. అడిగే దిక్కూ ఉండదు. అంటే.. కేసీఆర్ కిట్ల పేరుతో కోట్లు ఖర్చు చేసినా.. ప్రజలకు మాత్రం సర్కారు దవాఖానల పట్ల నమ్మకం మాత్రం ప్రోదికాలేదు. అది అయ్యేలా కూడా లేదు. ఎన్నో సంఘటనలు ఉదాహరణలున్నాయి.
కానీ అడిషనల్ కలెక్టరే స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలవరీ కావడం అంటే .. ప్రజల్లో నమ్మకం పెరగుతుంది. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలంటే సిబ్బందిలో మార్పు రావాలె. సిబ్బందిలో మార్పురావాలంటే అధికారులు కూడా దవాఖానలను పట్టించుకోవాలె. కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలె. కానీ కొత్తగా జిల్లాలకు కలెక్టర్లు వచ్చినప్పుడు మీరు గమనించండి… హడావుడిగా, ఆకస్మిక తనిఖీలకు ఈ దవాఖానకు వెళ్తారు. హల్ చల్ చేస్తారు. మీడియాలో కథనాలు గుప్పుమంటాయి. ప్రచారం బోలెడు లభిస్తుంది. మన కలెక్టర్ బాగా స్ట్రిక్టురోయ్.. అని మిగిలిన శాఖలు అనుకోవాలి. ఆ తర్వాత ఏమీ ఉండదు. ఆ ఛాయలకు కూడా వీరు వెళ్లరు. వ్యవస్థలో మార్పు లేనప్పుడు, తీసుకురానప్పుడు.. కేసీఆర్ కిట్ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం శూన్యం..