“రవన్న…” ఫోన్ బుక్కులోనూ సర్చ్ చేశాడు. ఎక్కడా ఆటో రవికి సంధించిన పేర్లు, మెసేజ్ లు,
చాట్లు కనిపించడం
అతను సంతృప్తి చెందడం లేదు. ఇంకేదో ఆశిస్తున్నాడు. అనుమానం పట్టి పీడిస్తున్నది. మరింకేదో ఊహిస్తున్నాడు. “బుద్దిగా నీ పని నువ్వు చేసుకోక.. ఈ గాడిద పనులేంటి రెడ్డీ..?” అంతరాత్మ ప్రబోధం మొదలు పెట్టింది. “అంటే పెళ్లాం ఎటుపోయినా పర్వాలేదా? పట్టించుకోవద్దా?” “నువ్వు సరిగ్గా ఉంటే అంతా సవ్యంగానే ఉంటుందిలేవోయ్ బడుద్దాయ్….” “ముఖం మంచిగా లేక అద్దం పగులగొట్టుకున్నాడట వెనుకటి నీలాంటోడొకడు.” “నేను మగాడిని.. ఏమైనా చేస్తా…..” “ఆడది ఎలా ఉండాలో అలా ఉండాలి కదా?” “నీకో రూలు, తనకో రూలా?”
“నువ్వు తాగి తందనాలాడుతావు? ఆమె కుటుంబాన్ని పోషించాలి?? ఇదే కదా నీకు కావాల్సింది. నీవు కోరుకునేది.”
“ఆ
జాబ్ నేను పెట్టించిందే.” “మరి నీ సంపాదనేది? నువ్వేమి పనిచేయవా? కూర్చుని తింటావా?” “పెండ్లాం సంపాదనమీదే పడి బతుకుతావా?” “అది కాదు.. అది.. ఆటోవాడితో…”
“చెప్పుడు మాటలు విని చెడిపోకు. ముందు నీలో లోపాన్ని గుర్తించు. అన్ని సమస్యలకు నీ ఆలోచనలే కారణం. ముందది మార్చుకో. సరిపోతుంది.”
“లేదు.. ఈ బాగోతం తేలాల్సిందే..” దానికి చిర్రెత్తుకొచ్చింది. “ఏంట్రా నువ్వు తేల్చేది? వెధవ” “నువ్వు మారవురా? ” “నువ్వింతే.. మీ జీవితమింతే..” “సంకనాకిపోతావుపో….” “నీ చావు నువ్వు చావు..” కళ్లు మూసుకొని అలాగే బెడ్ పై వాలాడు రాజారెడ్డి. ” ఏమాలోచిస్తున్నాను. నాకు లక్ష్యం అంటూ ఏదీ లేదా?” “ నిజంగానే నేను మరీ దిగజారి పోయానా??”, “రేపటి నుంచి పనిలో పడితే ఈ పనికిమాలిన ఆలోచనలు రావేమో” అని అనుకున్నాడు. ” ఓ కారు, పెద్ద భవనం… .పిల్లలకు మంచి భవిష్యత్తు… ఇవన్నీ చేయాలి.” “ చేసి చూపిస్తాను.” కళ్లు మూసుకుంటున్నాయి. మగతగా మెల్లగా నిద్రలోకి జారకుంటున్నాడు. ఫోన్ మాత్రం విడవలేదు. అలాగే చేతిలో ఉంది.
“కుయ్… కుయ్”
వాట్సాప్ మెసేజ్. వైబ్రేషన్ మోడ్ లో ఉన్నట్లుంది. ఒక్కసారిగా ఎవరో తట్టి లేపినట్లు మెలకువ వచ్చింది రాజారెడ్డికి.
అది వనజ ఫోన్ కు వచ్చిన వాట్సా ప్ మెసేజ్. ఆశ్చర్యంగా చూశాడు. “గుడ్ మార్నింగ్” మెసేజ్. ఎవరి నుంచా అని చూశాడు. “నాయక్…” “ఎవరీ నాయక్..?” డీపీ చూశాడు. ఆటో రవి ఫోటో. అందంగా నవ్వుతూ కనిపించింది. “రవి నాయక్..”
ఒక్కసారిగా రాజారెడ్డి ఒళ్లు జలధరించింది. గుండె వేగం పెరిగింది. నిద్ర పారిపోయింది. ఒక్క ఉదుటన లేచి ‘నాయక్’ తో చాటింగ్ ను పరిశీలించసాగాడు.
అన్నీ గుడ్ మార్నింగ్ మెసేజ్ లే. అక్కడక్కడా షేర్ చాట్ సందేశాలు. జీవిత సత్యాలకు సంబంధించిన కొటేషన్లు…..
అలా పైకి పోతూనే ఉన్నాడు. అతని కళ్లు ఎర్రగా మారుతున్నాయి. కోపంతో శరీరంలో రక్త ప్రవాహం పెరిగి అది గుండెకు తాకి గుండెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
గుండెపోటు వచ్చి అది ఆగిపోతుందేమోననే భయంజొచ్చింది అతనికి. అక్కడికక్కడే ప్రాణాలు పోతాయేమోనని కూడా అనిపించింది. చాట్ ను చదవడం ఆపేశాడు. గ్యాలరీలో ఫోటోల కోసం వెతుకుతున్నాడు. అతని మనసంతా కకావికలమైంది. శరీరం కుతకుతా ఉడుకుతోంది. ఆ కళ్లు ఇంకా దేని
కోసమే అన్నట్లు ఆత్రుతగా, కోపంగా వెతుకుతున్నాయి.
ఓ చోట…
అందరూ కలిసి దిగిన ఫోటో. పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడో జలపాతం వద్ద.
పిల్లలతో కలిసి “వాడు”. అతని ఫ్యామిలితో ఆస్ట్రాల్ ఓ ఆటో డ్రైవర్ నవ్వుతూ… తుల్లుతూ. భరించలేకపోతున్నాడతను. పిల్లలు కూడా ఎంతో సరదాగా, నవ్వుతూ, కేరింతలు కొడుతూ…. వాడిని ఓ ఫ్యామిలీ మెంబర్ లా ఫీలవుతూ… వాడిని ‘ఓన్’ చేసుకున్నట్లుగా, వాడితో మమేకమై పోయినట్లుగా… ఆ ఫోటోలు గుండెను కెలుకుతున్నాయి. గడ్డపారతో గుండెలో బలంగా దించిన ఫీలింగ్ అతనికి.
“అంటే నన్ను గాలికొదిలేసి. కనీసం నేనంటే గౌరవం, మర్యాద లేకుండా, ఓ అనామకుడు, ఓ పనికిమాలిన వెధవ, ఆటో నడుపుకుని భారంగా బతుకీడ్చే ఓ దగుల్బాజీ, సమాజంలో ఎలాంటి గౌరవం లేని ఓ అర్భకుడు…
నా కాలిగోటికి కూడా సరితూగని ఓ అల్పుడు..” “వాడితో నా భార్య…”
“చెట్టాపట్టాలేసుకొని…” “దానికి పిల్లల అంగీకారం?” “ఆనందంతో వాడితో సరదా జీవితం…” “వాడి సాంగత్యంలో మైమరపు.” “మరి నన్ను మరిచిపోయారా? చచ్చిపోయాడని డిసైడయ్యారా? వీడేంటి?.. వీడిలెక్కంత?? అని తీసిపారేశారా? ఉన్నా ఒకటే? లేకున్నా ఒకటే అని తేల్చేశారా??” “ఇంతకు తె.. గిం.. చా.. రా..?” ఆలోచనలు, అనుమానాలతో బుర్ర వేడెక్కింది. జుట్టు చేత్తో పట్టుకొని గట్టిగా పీక్కున్నాడు. పైకి చూస్తూ గట్టిగా అరవాలనుంది. ఇంటిల్లిపాది పై పీకల్లోతు కోపం వచ్చి ఊగిపోతున్నాడు. “చీ … నేను బతికి ఏం లాభం ?” “ఆత్మహత్య చేసుకున్నది మేలు.” “ఆ… త్మ… హ… త్యా…..?” “నేను ఆత్మహత్య చేసుకోవాలా?” “నేనేం తప్పు చేశాను? లేదు నేను చావను.” “మరి…” ” ‘వాడ్ని’ చంపుతాను.” “రవిగాడిని చంపేస్తాను.” ఇపుడు తన ముందున్న లక్ష్యం ఇదే అన్నట్లుగా అతను కృతనిశ్చయానికి వచ్చినవాడిలా కనిపించాడు. అతని కళ్లు భయంకరంగా నిప్పులు కురిపిస్తున్నాయి. ఆలోచనలు నియంత్రించే స్థాయి దాటిపోయాడు. అతను మెదడు ఇపుడు “మ… ర్డ…ర్ ……. ప్లా…..న్ …” రచిస్తోంది.
*****
కళ్లు మూసుకునే ఉన్నాడు. ఎంత సేపైందో తెలియదు. నిద్రపోయినట్లుగా కనిపిస్తున్నాడు.
కానీ ఆ కనురెప్పల కింద కనుగుడ్లు భగభగమండుతున్నాయి. అందులోంచి ఉబికి వస్తున్న అశ్రుధారలు ఆ అగ్నికీలలకు ఆవిరి అవుతున్నాయి. గుండె వేగంలో ఏమాత్రం మార్పులేదు. అది నిర్విరామంగా అదే వేగంతో కొట్టుకుంటుంది. మస్తిష్కంలో సుడులు రేగుతున్న ఆలోచనలు దాని వేగాన్ని పెంచుతున్నాయే తప్ప తగ్గించడం లేదు. పైనుంచి చల్ల గాలులు వీస్తున్నా… బడబాగ్నిలా అతని శరీరం అగ్నిగోళంగా ఉంది. ముట్టుకుంటే దహించి వేస్తుందా? అన్నట్లుగా మండుతున్నది. కాలుతున్నది. కాలుతూ నిప్పులు చిమ్ముతున్నది. ఆ నిప్పురవ్వలు ఆ
చుట్టుపక్కల ఉన్న ప్రాంతానంతా దహించివేయాలన్న కసితో రేగుతున్నాయి.
తెల్లారుతున్నట్లు అర్ధమవుతూనే ఉన్నది. పక్షుల కిలకిలరావాలు ఇపుడు వీనులకింపుగా తోచడం లేదు. అవి వచ్చి అతని కనుగుడ్లను పొడిచినట్లుగా అనిపిస్తున్నది. కిటికీ సందులోంచి వచ్చి పడుతున్న సూర్యకిరణాలు నేరుగా అతని ముఖం పై పడుతున్నాయి. మండుతున్న కళ్లపై అవి వాలుతున్నాయి. ఒకప్పుడు వెచ్చని హాయినిచ్చి మగత నిద్రను పారదోలి కొత్త హుషారును అందించే ఆ ఉషాకిరణాలు … ఇపుడు తన అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. చురచురమని చురకత్తుల్లా శరీరాన్ని పొడుస్తున్నాయి. గాయాన్ని కెలుకుతున్నాయి. మరింత బాధపెట్టాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి.
ఆ మస్తిష్కంలో విస్పోటనాలు సంభవిస్తున్నాయి. కణాలు తునాతునకలవుతున్నాయి. నరాలు పీలికలు పీలికలుగా మారి ఆ అగ్నికి ఆహుతులవుతున్నాయి. కణజాలాలు కణకణమండే నిప్పులో పడి బూడిదవుతున్నాయి. లాలాజలాలు ఆ దాహాగ్నికి అట్టుడికిపోయాయి. నాలుక పిడచగట్టుకుపోయింది. తడి కోసం తల్లడిల్లుతున్నది. చుక్కనీటి కోసం అల్లల్లాడుతున్నది గొంతు. ప్రాణం పోతుందేమోనని తల్లడమల్లడమవుతున్నది. ఇంట్లో అలికిడి వినిపిస్తున్నది. జనజీవనం మేల్కొన్న శబ్దాలు చెవికి చేరుతున్నాయి.
కానీ అవి మెదడు వరకు చేరడం లేదు. ఆ మెదడు ఇంకా వేరే పనిలో బిజీగా ఉంది. క్షుద్ర ఆలోచనలతో రేగిపోతున్నది. విచక్షణాజ్ఞానం కోల్పోయి వికారంగా ఉంది. ఓ భయంకరమైన జీవమేదో పురుడుపోసుకుంటున్నది. ఆది ఎప్పటి నుంచో బయటకు రావాలని ఉబలాటపడుతున్నది.
దానికి సమయం వచ్చింది. ఇక బయటకు రావవడమే తరువాయి… అంతా వినాశనమే. విధ్వంసమే. విషాదమే.
“కికీక్…… కికీక్……” అది ఆటో హారన్ చప్పుడు. ఇంటిముందు రవి ఆటో ఆగింది.
అగ్నికీలలు మరింత రేగుతున్నాయి. దెయ్యం పట్టినట్లు జుట్లు విరబూసుకొని శిగాలూగినట్లు ఆకాశాన్నంటేలా ఆ కీలలు పెరిగిపోతున్నాయి. ఆ మబ్బులను తాకుతాయా? వాటిని దహించివేస్తాయా ? ? అన్నట్లుగా ఊగిపోతున్నాయి. రేగిపోతున్నాయి. బుసలుకొడుతున్నాయి. కాటేసేందుకు కాలసర్పంలా అదునుకోసం పడగవిప్పి నాట్యమాడుతున్నాయి. కోరలు చాచి కాటువేస్తే ఇక ఆ గురి తప్పదన్నట్టుగా ఆ కీలల చూపులు తీక్షణంగా ఉన్నాయి. గురి తప్పబోదు… కాలకూట విషం చిమ్మడమే తరువాయి…. అది భగభగ దహించి బూడిద చేసేస్తుంది.
(ఇంకా ఉంది)