కానీ నేను చావను. చచ్చినా చావను. చావనంటే చావను. చావనే చావను. ఛీ దీనమ్మ అంతా చావుగోల.” అని అనుకున్నాడు. “చచ్చి ఏం సాధించావురా? ఒరేయ్ నరసింహం..!” “ఉన్న ఇద్దరు పిల్లలను అనాథ చేశావు.
పెండ్లాం చేత రోజు తిట్లు తినే బాధ మాత్రం తప్పిందిరా నీకు” అనుకున్నాడు.
“నేనలా కాదురోయ్… బతికి చూపుతాను. బ్రహ్మాండంగా జీవిస్తాను. అందరూ కుళ్లుకునేటట్లు, అందరి కళ్లు కుట్టేటట్టు బతికి సాధిస్తానురా … ఒరేయ్ నరసింహం! వింటున్నావా?”
గట్టిగా అరిచి చెప్పాలనుంది రాజారెడ్డికి. “అవును…! ఎంత గట్టిగా అరిచినా వాడికి వినిపిస్తుందా?” “అసలు వాడు స్వర్గంలో ఉన్నాడా? నరకానికి వెళ్లాడా??” “వీడు ఖచ్చితంగా నరకానికి వెళ్లుంటాడు. వెధవ, పనికి మాలిన వెధవ, భూమికి భారంగా మారిన బద్మాష్..” “ఇంకా తిట్లు రావడం లేదేంటీ?”
“కడుపు నిండా అన్నం తిన్న తర్వాత హాయిగా నిద్రపడుతుంటే ఈ వెధవాయ్ గురించి ఎందుకు? ఈ చావుగోల మనకెందుకు?”
“నాకు ఇక అన్నీ మంచి రోజులే వస్తాయి. నేను ఉన్నతంగా బతుకుతాను.” “ ఓ కారు. పెద్ద బంగళా. చుట్టూ చెట్లు. ముందు ఖాళీ స్థలం. కింద పచ్చని పచ్చిక. మధ్యలో ఓ
ఊయల. అద్దాల భవనంలో అన్ని హంగులతో గదులు. పిల్లలకు వేర్వేరు గదులు. మాకొక సెపరేట్ గది.
హంసతూలికా తల్పం లాంటి పడకగదిలో ఇద్దరమే ఏకాంతంగా. ఎన్ని రోజులవుతుంది. ముద్దూ ముచ్చటలాడుకుని??”
” ప్రపంచం మొత్తంలో మీమిద్దరమే ఇంకెవరూ లేరన్నట్లుగా. విశాలమైన ఆ గదిలో గాలి కూడ చొరబడని విధంగా ఒకరికొకరు హత్తుకొని మైమరచిపోయి అలా లోకాలన్నీ విహరించి రావాలని ఉంది. ”
“కారులో నాతో షికారు చేయాలని వనజకు ఎంత కోరిక.?
అప్పుడు నేను ఈ కోరిక తీరిస్తే దాని ముఖం ఎలా ఉంటుంది? కొంచెం సిగ్గు పడుతుంది. సిగ్గుపడుతూ నవ్వుతుంది. అలా నవ్వినప్పుడు ఎడమ చెంపపై సన్నని సొట్ట. అబ్బ ఎంత బాగుంటుందో.
అలా పెళైన కొత్తలో నవ్వేది. ఇపుడా నవ్వేది??” “ఆ నవ్వులు నేను మళ్లీ పూయిస్తా. నా పై ప్రేమను చిగురింపజేస్తా. నేనంటే పడి చచ్చిపోయేలా చేస్తా.
ఏం చెయ్యాలి? ఎలా సంపాదించాలి? సినిమాల్లో చూపించినట్లు ఉన్నపళంగా లక్షలు లక్షలు వచ్చి పడితే … . ‘ఛూ మంతర్ ‘ అనగానే అన్నీ సమకూరినట్లు, అంతస్తులు పెరిగినట్లు అయిపోతే…” “అబ్బ ఆ ఊహ ఎంతబాగుంది??” “అవునూ…! నేను సంపాదిస్తానా? నా భార్య ముఖంలో ఆనందం చూస్తానా??” ” నాకు అదేం అంత పెద్ద పని కాదు. నేను తలచుకుంటే చిటికెలో పని.”
” ఇప్పటి వరకు చిన్న చూపు చూసిన సమాజానికి గట్టి గుణపాఠమొకటి నేర్పిస్తాను..! వెకిలి నవ్వులు నవ్వుకున్న వెధవలకు చెంపపెట్టులాంటి సమాధానమిస్తాను..!! హేళన చేసిన వెర్రినాయాళ్లకు నా సత్తా చూపిస్తాను. పరపతి కుస్తీ పోటీల్లో వాళ్లందరినీ మట్టి కరిపిస్తాను..!!! నేల నాకిస్తాను. ఉప్పు పాతరేస్తాను. గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగిస్తాను…!”
” నా భార్యా పిల్లలతో కొత్త కారులో అలా అలా షికారు చేస్తాను. అంబారి మీద ఊరేగినట్లుగా అందరి కళ్లు మంటలు పుట్టేలా చేస్తాను.
ఆ అంధవికారాలన్నీ మెటికలు విరుస్తుండగా…అవే మాకు ఆశీర్వాదాలని భావిస్తాను.” మళ్లీ నరసింహం గుర్తొచ్చిండు.
“అంబారీని నరసింహం గాడి ఇంటి ముందు నుంచి పోనియ్యమంటాను. వాడి భార్యకు వినిపించేలా గట్టిగా ఓ హారన్…. అదే ఏనుగు ఘీంకారం.
ఆ సౌండ్ కు వాడి పెండ్లాం బయటకు రావాలి. మమ్మల్ని చూడాలి. వాడెవడో నీకు హీరో కదా…! వాడు సంపాదించినట్లు ఎవడూ సంపాదించడు కదా. అయితే చూడు. ఎలా ఉంది?? అని కసితీరా, కడుపు మంట తీరేలా చూపాలి.”
“నేను ఇసుక దందా చేయలేదని, ఎవడి కొంపలు కూల్చలేదని గట్టిగా ఒక్కటిచ్చుకున్నట్లుగా సమాధానమివ్వాలి.” “భార్యను సుఖపెట్టడమెలాగో తెలుసా? ఇదిగో ఇలాగే??”
“పాపం వాడికి తెలియక పోయాడు. నరకంలో వానికి కుంభీపాకం, శూల దండనం లాంటి శిక్షలు పడుతున్నట్లున్నాయి.”
” పడాలి వెధవకు. వాడికి శూలదండమనే కరెక్టు. ఒక్కసారి కాదు. రోజుకు మూడు పూటలు అమలు చేయాలి వాడికి.”
– “పెండ్లాన్ని కంట్రోల్ చేసుకోలేని వాడికి ప్రత్యేకంగా ఏదైనా శిక్షుంటుందా నరకంలో? చెవుల్లో సీసం పోయడం, కళ్లలో దబ్బనాలతో పొడవటం లాంటివి చేస్తే బాగుండు. అవి నేను చూస్తే బాగుండు.”
– ” కుటుంబాన్ని ఎలా పోషించాలో నేను చెప్తాను అందరికీ. భార్యను ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలో నన్ను చూసి నేర్చుకోమంటాను.”
“పురుషోత్తముడిలా కీర్తించబడతాను..! ఆదర్శమంటే నేనే అని నిరూపిస్తాను..!! నువ్వురా మగాడవంటే అని అనిపించుకుంటాను..!!” “రాజారెడ్డియా.? మజాకా??” “దిమ్మదిరిగేలా బొమ్మ చూపిస్తాను.” “ఆ రోజు కోసం ఎదురుచూస్తాను.” “అవునూ…! ఆ రోజెప్పుడొస్తుంది? వస్తుంది. వస్తుందా? తప్పకుండా వస్తుందా?? రావాలి. రావాలి. ప్లీజ్. ప్లీజ్. భగవంతుడా… రావాలి? అయినా నేను భగవంతుడిని మొక్కుకోవడమేంది? చీ చీ … అదే వస్తుంది. వచ్చి తీరుతుంది.” “చచ్చినట్లు రావాల్సిందే…”
“నువ్వూ నపుంసకుడివే నా దృష్టిలో…….” “నీ పెండ్లాం …….” ఆకస్మాత్తుగా లక్ష్మి ప్రత్యక్షమయ్యింది. “నువ్వో చేతకాని దదమ్మవి…..” “ కుంటుంబాన్ని పోషించలేని అసమర్థునివి. ” “బాధ్యత మరిచిన బలాదూర్ వి. పట్టింపులేని పురుషపుంగవునివి” “ఫాల్స్ ప్రెస్టీజ్ లో పడి కొట్టుకుపోతున్న పనికిరాని పురుగువి..” తిడుతూనే ఉంది లక్ష్మి. దిగ్గున లేచాడు రాజారెడ్డి. చల్లటి చెమటలు పడుతున్నాయి. గోడగడియారం వైపు చూశాడు.
అర్ధరాత్రి 2గంటలు దాటింది. గడియారం ముల్లు అప్పటివరకు సైలెంట్ గా ఉండి… అతను చూసిన తర్వాతే ‘టక్ టక్ టక్’ అని గట్టిగా కొట్టుకోవడం మొదలు పెట్టినట్లు అనిపించింది రాజారెడ్డికి. ఆ చప్పుడుతో తన గుండె చప్పుడు తోడయ్యింది.
స్థిమితంగా ఉండనీయలేదు. “నా భార్య అలా చేస్తుందా??”
ఆ ఆలోచన రాగానే గుండె దడ మరింత పెరిగింది. గుండె దడ ముందు గోడ గడియారం ముల్లు చప్పుడు చిన్నబోయింది.
“లక్ష్మి చెప్పింది నిజమేనా??” మెల్లగా లేచాడు. లోపలి గదిలోకి వెళ్లి చూశాడు. భార్యా,
పిల్లలు ఆదమరిచి నిద్రపోతున్నారు. మధ్యలో భార్య పడుకొని ఉంది. వారంతా ఆమెను చుట్టేసినట్లుగా అల్లుకొని పడుకొని ఉన్నారు. ఆమె ఓ భరోసాలా వారిని అతుక్కొని పడుకుని ఉంది. మీకు నేనున్నాను అనే ధీమాను కల్పిస్తున్నానట్లుగా ఆమె ముఖం కనిపిస్తున్నది.
వనజ ఫోన్ కోసం అతని కళ్లు వెతుకుతున్నాయి. “ఎక్కడా?” కిటికీలో ఉంది. చార్జింగ్ పెట్టి ఉంది. దాన్ని తీసుకొని తన గదిలోకి వచ్చాడు. ఆ ఫోన్ స్క్రీన్ పై రాజారెడ్డి ఫ్యామిలీ ఫోటో కనిపిస్తున్నది. ఆనందంగా అందరూ నవ్వుతూ దిగిన ఫోటో అది. ఫోన్ చేతులోకి తీసుకున్నాడు గానీ అవి భయంతో వణుకుతున్నాయి.
ఇంత వరకు భార్య ఫోన్ ను ముట్టుకోలేదు. ఏవైనా ఫోన్లు వచ్చినా వాటిని చూడడు అతను. తనకు ఫోన్ వచ్చినా సరే ఎవరూ ముట్టరు. వనజ ఫోన్ను రహస్యంగా చెక్ చేస్తున్నాననే భావన కలగగానే ఏదోలా అనిపించింది.
కానీ తమాయించుకున్నాడు. తాడో పేడో తేల్చుకుందామనుకున్నాడు. అనుమానం నివృత్తి చేసుకోవాలనుకున్నాడు.
వాట్సాప్ మెసేజ్ లు సర్చ్ చేస్తున్నాడు. “డ్రైవర్” అని టైప్ చేసి చూశాడు. ‘ఊహూ ‘ ఆ పేరుతో ఎవ్వరి నెంబరూ ఫీడ్ చేసి లేదు. “ఆటో..” “ఆటో రవి..” “డ్రైవర్ రవి..” “రవి..”

(ఇంకా ఉంది)

 

You missed