చిన్నప్పుడెప్పుడో ఒక కథ చదవినట్టు గుర్తు.
ఒక ఊర్లో ఓ బిచ్చగాడుంటాడు. గల్లీ గల్లీ తిరిగి బిచ్చమడుక్కుని బతికేవాడు. అది చలికాలం. పైగా చిరిగిన బట్టలు. చలికి తట్టుకోలేక రాత్రి మొత్తం గజగజా వణికిపోతూనే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. అందరి దగ్గరికీ వెళ్లి ఇంట్లో ఏదైనా పాత దుప్పటి గానీ, బొంత గానీ ఇస్తే చలి బాధ నుంచి కాపాడుకుంటానని ప్రాధేయపడతాడు. ఎవరూ ఇవ్వరు. లేవు లేవు పో.. అని గదమాయిస్తారు. అడిగీ అడిగీ వేసారి పోయి అలాగే ఆ రాత్రి గజగజా వణుకుతూ ఓ మూల పడుకుని ఉండగా.. ఒకతను చూస్తాడు. విషయం తెలుసుకుని ఆ బిచ్చగాడ్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఆ ఊరోళ్లకు గుణపాఠం కూడా చెప్పాలనుకుంటాడు.
తెల్లారుతుంది. ఆ బిచ్చగాడ్ని చనిపోయినట్టు నటించమంటాడు ఆ వ్యక్తి. రోడ్డు పక్కనే చనిపోయినట్టు పడిపోయి ఉంటాడు ఆ బిచ్చగాడు. క్షణాల్లో ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. ఒక్కొక్కరూ ఒక్కో ఇంటి నుంచి ఓ కొత్త దుప్పటి, కొత్త వస్త్రం కప్పి ఓ దండం పెట్టి పక్కకు జరిగి నిలబడి సానుభూతి చూపుతూ ఉంటారు. బిచ్చగాడ్ని చనిపోయినట్టు నటించమని చెప్పిన వ్యక్తి ఆ పక్కనే నిలబడి అన్నీ గమనిస్తూ ఉంటాడు.
ఈ కొత్త వస్త్రాలు ఎందుకు కప్పారు..? ఆయన చనిపోయాడు కదా..? అని అడుగుతాడు వాళ్లనుద్ధేశించి ఆ వ్యక్తి. చనిపోయిన వ్యక్తి శరీరంపై కొత్త వస్త్రం కప్పితే పుణ్యమొస్తుందని అంటారు వాళ్లంతా. బతికున్నప్పుడు చలికి చచ్చిపోతున్నా..అంటే ఎవ్వరూ ఒక్క పేలిక కూడా ఇవ్వలేదు.. పాత మసిగుడ్డా ఇవ్వలేదు.. ఇప్పుడు చచ్చినంక పుణ్యం కోసం మాత్రం కొత్త బట్టలు కప్పుతారా? అని నిలదీస్తాడు. ఆ బిచ్చగాడు లేస్తాడు. తనపై కప్పిన కొత్త బట్టలు చూసుకుని మురిసిపోతాడు. అవి తీసుకుని అక్కడ్నుంచి సంతోషంగా ఒకటే పరుగు పెడతాడు.