“అప్పటికీ ఇప్పటికీ నీ విషయం లో తేడా ఏం ఉంది? అప్పుడు పెనం మీద ఉంటే.. ఇపుడు పొయ్యిలోకి పడ్డది నీ పరిస్థితి. ఎప్పుడు స్థిమితంగా ఉన్నావు ఇంటి దగ్గర. ఎప్పుడూ ఏదో పని. ఊరు మీద పనులన్నీ నీవే. కుటుంబం, పిల్లా జిల్లా అవసరం లేదు నీకు. పెద్ద చెప్పొచ్చావు మొగోడివి..” దెప్పిపొడిచింది అది.
“అంటే కుటుంబాన్నంతటినీ పోషిస్తున్నది నా పెండ్లామేనంటావ్? నేనేం చేస్తలేనంటావ్?” “ఏం చేస్తున్నావోయ్ నువ్వు. అది అక్కడా ఇక్కడ అప్పులు చేసి మరీ కుటుంబాన్ని నడుపుతున్నది. పిల్లలు పెద్దగయ్యారు.
వాళ్ల ఫీజులు, ఖర్చులు, అవసరాలు ఏమైనా నీకు తెలుసా?” నిలదీసింది అంతరాత్మ.
ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నిలదీస్తుంటే అక్కడ నిలవడం అతని వల్ల కాలేదు. వెంటనే అక్కడ్నుంచి లేచి బయటకు వెళ్లాలనుకున్నాడు. గడియ తీశాడు. బయట బోరున వర్షం కురుస్తున్నది. గాలి కూడా తోడవ్వడంతో జివ్వున వాన మొఖం మీద వచ్చి పడింది. ఒళ్లు జల్లుమన్నది. అంతరాత్మ చప్పుడు చేయడం లేదు. బయట నుంచి చల్లనిగాలులు వీస్తున్నా.. లోపల రాజారెడ్డి శరీరం మాత్రం కుతకుతలాడుతోంది.
ఒక్క ఉదుటన బయటకు నడిచాడు. అలాగే వానలో నానుతూ వాకిట్లో నిలబడ్డాడు. వర్షం బోరున కురుస్తున్నది. ఆ వర్షానికి మొత్తం తడిచి ముద్దయ్యాడు రాజారెడ్డి.
తలపై, ముఖంపై వాన చినుకులు ముల్లుల్లా గుచ్చుతున్నట్లు అనిపిస్తున్నది. తడిచిన బనీను, లుంగీ శరీరానికి అతుక్కుపోయింది. మధ్య మధ్యలో బలంగా వీస్తున్న గాలులకు శరీరం తూలుతున్నది. వణుకుతున్నది. అయినా పంటి బిగువున బాధను భరిస్తూ అలాగే నిలబడ్డాడు రాజారెడ్డి.
వర్షంలో నానుతూ తాను పడుతున్న బాధనంతా భార్యమీద కసిగా ఊహించుకుంటున్నాడతను. తాను వర్షంలో తడుస్తూ భార్య వనజ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాననుకుంటున్నాడు. “చివరకు నన్ను ఈ స్థితికి దిగజార్చిందెవరు? ” “హాయిగా సాగుతున్న నా బతుకును అల్లకల్లోలం చేస్తున్నదెవరు?” “ప్రశాంతత లేకుండా నాకు నరకం చూపుతున్నదెవరు?” “కరోనా?”
“కాదు …”
“పరమేశా?” “కాదు.. కాదు…” “మరెవరు??” “వనజా ?”
“అవును. వనజే. నా భార్యే. బయట ఎన్నో టెన్షన్లతో వస్తే ఇంట్లో కూడా ప్రశాంతత లేకుండా చేసింది నా భార్యే.”
ఇప్పుడు అతని కోపం అంతా భార్య మీదే నిలిచింది.
నిన్నటి వరకు కరోనా ను తిట్టుకున్నాడు. బాస్ పరమేష్ టార్గెట్ల పేరుతో హింసిస్తున్నాడని శాపనార్థాలు పెట్టాడు.
కానీ ఇప్పుడు రాజారెడ్డి ఆలోచన మారింది. అతనికి భార్యే విలన్ గా కనిపిస్తున్నది
“పిల్లలకు కూడా అన్నం పెట్టకుండా నాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నది. అంటే బయట అందరూ నన్ను తిట్టుకోవాలని దాని ఆలోచన.”
“భార్య అలా ఎందుకు చేసింది? తన వల్ల కుటుంబం మొత్తం బాధపడుతున్నది” అని మాత్రం ఆలోచించడం లేదు అతను.
“దీనికి నేనే కారణం కదా” అని ఒప్పుకోలేకపోతున్నాడు.
తప్పు తెలుసుకోలేకపోతున్నాడు. లోపాన్ని గుర్తించలేకపోతున్నాడు. అహంభావం అతన్ని ఆ పని చేయనీయడం లేదు. అందుకే సాకులు వెతుక్కుంటున్నాడు. సమర్థించుకునే క్రమంలో విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. “నాకున్న మంచి పేరు నాశనం కావాలని దాని కుట్ర.” అని కసిగా తిట్టుకున్నాడు రాజారెడ్డి. వర్షం మరింత పెరిగింది. ఉరుములు, మెరుపులతో ఆ వాతావరణం భయంకరంగా ఉంది. ఒక్కసారిగా “ఢాం” అని పెద్ద శబ్దం… ఈదురుగాలులకు ట్రాన్స్ ఫార్మర్ పేలింది. చిమ్మ చీకటి అలుముకున్నది. పిచ్చి పట్టినట్టుగా వర్షం మరింత జోరందుకుంటున్నది. ఆ గాలులకు వాకిట్లో ఉన్న వేప చెట్టు పూనకం వచ్చినట్లు ఊగుతున్నది.
చెట్టు ఊగినప్పుడు చెట్టుకొమ్మలకు అంటి పెట్టుకొని ఉన్న వాన నీళ్లు జారి కింద పడుతున్నాయి. అవి వచ్చి రాజారెడ్డి తల, శరీరంపై పడుతున్నాయి. పెద్ద పెద్ద నీటి బిందువులు కావడంతో ‘టప టపా ‘ అని శబ్దం చేస్తున్నాయి. సూదులతో పొడచినట్లుగా అనిపిస్తున్నది ఆ నీటి బొట్లు శరీరం పై పడటం తో. రాజారెడ్డి అయినా కదలడం లేదు. కొంచెం కూడా జరగడం లేదు.
చిమ్మచీకట్లో దెయ్యం పట్టినవాడిలా అలాగే వర్షంలో తడుస్తూ నిలబడ్డాడు.
మెల్లమెల్లగా అతనిలో ఆవేశం చల్లారింది. భార్య మీద కోపం తగ్గింది. మనసు ఇపుడు ప్రశాతంగా అనిపించింది. శరీరంలో వచ్చిన ఆలోచనల మార్పుల వల్ల ఒక్కసారిగా చలి పెట్టినట్లైంది. అప్పటి వరకు రగులుతున్న వేడి కొంచెం చల్లారింది. ఇంట్లోకి వెళ్తామని అనుకుని రెండడుగులు వెనక్కివేశాడు. ఇంతలో పే… |
అంత వర్షంలో అతి వేగంగా వచ్చిన ఓ బైక్ కీచు మంటూ జారి కింద పడ్డది అతని ఇంటి ముందు. వర్షం నీటిలో రోడ్డు సరిగ్గా కనబడకపోవడంతో గుంతల్లో వేగంగా నడపడం వల్ల అది పడిపోయింది. బైక్ నడుపుతున్నవాడు జారి కొంత దూరంలో పడ్డాడు. బైక్ కిందపడినా ఇంజన్ ఆఫ్ కాలేదు. ఆక్సిలేటర్ వైర్ పట్టేయడంతో ‘రయ్.. రయ్’ మని ఆంబోతు రంకెలేస్తున్నట్లుగా సౌండ్ చేస్తున్నదది. వెంటనే తేరుకున్న బైకతను లేచి బైక్ ను లేపాడు.
దాన్ని లేపడంతో రేస్ సౌండ్ ఆగిపోయింది. ఆ బైక్ లైట్ వెలుతురులో వాన కుండపోత దారలుగా పడుతున్నట్లు కనిపిస్తున్నది రాజారెడ్డికి. ఇదంతా అతను గుమ్మం దగ్గర నుంచే గమనిస్తున్నాడు.
“అయ్యో” అనుకున్నాడు. “ఎవరు?” అన్నాడు కొంచెం గట్టిగా. వాన ముసురు హోరులో ఆ మాట కలిసిపోయింది. అది అతనికి వినిపించనట్లుంది.
బైక్ ను నిలబెట్టి అట్లనే దానిపై కూర్చుని ముందుకురికించాడు అతడు. ‘రయ్యి రయ్యి’ మంటూ అది ముక్కుతూ మూలుగుతూ పోతున్నట్లుగా ఆ జోరువానలో ముందుకు వెళ్తున్నది.
“ఎవరా?” అని ఇంట్లోకి వెళ్లేవాడు తిరిగి గేటు వద్దకు వచ్చాడు.
గేటుకు తాళం వేసి ఉంది. గేటు పై నుంచి తలపెట్టి అది ఎటువైపు వెళ్తుందో చూస్తున్నాడు. అది తమ ఇంటి ముందు ఉన్న సందు చివర వరకు వెళ్లి … చివర ఉన్న ఇంటి వద్ద ఆగింది.
అది విఠల్ ఇల్లు.
*****
రాత్రంతా కుండపోతగా కురిసిన వాన తెల్లారుజామున సేదతీరింది. చిమ్మచీకట్ల తెరలు చించుకొని వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయి. వాతావరణం చల్లగా ఆహ్లాదరకంగా ఉంది. రాత్రి కురిసిన కుండపోత వాన తాలూకు మట్టివాసన కమ్మగా వస్తున్నది. అక్కడక్కడా రోడ్ల పై నిలిచిన నీళ్లు చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. ఈదురుగాలులకు ఊగి ఊగి అలసిపోయిన చెట్లు ఇపుడు నిశ్చలంగా నిలబడి తల వాల్చేసి నేలచూపులు చూస్తున్నాయి. అక్కడక్కడా విరిగి పడిన కొమ్మలు రాత్రి వర్ష బీభత్సాన్ని చూపుతున్నాయి. రాత్రి జోరు వాన ఎంతటి భయాత్పోత్పాన్ని సృష్టించిందో … తెల్లారుజామున అంతటి ప్రశాంత వాతావరణాన్ని కళ్లముందుంచింది. కాలం తనపని తాను చేసుకుంటూ పోతున్నది. మెల్లగా ఆ రోజు దినచర్య ప్రారంభించేందుకు జనం మేల్కొంటున్నారు. అలికిడి మొదలవుతున్నది.
ఎప్పుడో తెల్లారుజామున నిద్రపట్టింది రాజారెడ్డికి. రాత్రి వర్షంలో తడిసిన ప్రభావం కనిపిస్తున్నది. తల అంతా నొప్పిగా ఉన్నట్లనిపించింది. కొంచెం చలిగా కూడా ఉండటంతో నిండా దుప్పటి కప్పుకుని గట్టిగా కళ్లు మూసుకొని పడుకున్నాడు. ఏవేవో ఆలోచనలు మదిలో సుడులు తిరుగుతుండగా.. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు అతనికి తెలియకుండానే. కిటికీ సందులోంచి సన్నటి వెలుగు రేఖలు అతని ముఖం పై పడుతున్నాయి. తనను మేల్కోపేందుకే అన్నట్టుగా. మెల్లగా కళ్లు చిట్లించి చూశాడు. సమయం 5 గంటలు దాటింది. పక్క గదిలోకి ఓ సారి చూశాడు. ఇంకా వనజ లెవ్వలేదు. అందరూ ముసుగు కప్పి పడుకున్నారు. ఈ పాటికే వనజ లేవాలి. ఎందుకు లేవలేదో ఊహించుకున్నాడు రాజారెడ్డి. మళ్లీ దుప్పటి ముసుగు కప్పుకున్నాడు. తలనొప్పి ఎక్కువైనట్లు అనిపించింది. గొంతులో గరగరమంటున్న ఫీలింగ్. దుప్పటైతే కప్పుకున్నాడు కానీ లోపల కళ్లప్పగించి శూన్యంలోకి చూస్తున్నాడు. మళ్లీ ఆలోచనల ప్రకంపనలు మొదలయ్యాయి. ‘ఈ రోజు ఆఫీసుకు వెళ్లాలి.” అనుకున్నాడు. ‘బాస్ పరమేశ్ ను కలిసి మాట్లాడాలి’ అనుకున్నాడు. వెంటనే తన బైక్ లో పెట్రోల్ అయిపోయిన విషయం గుర్తొచ్చింది. ఎలా వనజను అడగాలి. తనతో మాట్లాడటం లేదు.. ఎలా అడగాలి. ‘మరి.. ఎలా. నడుచుకుంటూ వెళ్లాలా? ఐదు కిలో మీటర్లు .. నడవాలా?” ఆలోచిస్తున్నాడు.
ఫోన్ రింగ్ కావడంతో ఆలోచనల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. ఇంత పొద్దున్నే ఎవరబ్బా ఫోన్ చేస్తున్నారు అనుకున్నాడు. లేవబుద్ధి కావడం లేదు. ఆ ఫోన్ తన బెడ్ పక్కనే టేబుల్ పై ఉంది. దాన్ని తీసుకునేందుకు చేతి బయటకు చాచాడు. ఆ లోపు ఫోన్ కట్ అయ్యింది. మళ్లీ ఆ చేతిని దుప్పట్లోకి గుంజుకున్నాడు. బలవంతంగా కళ్లు మూసుకొని పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘కాల్ ఎవరు చేశారు?”
అంతలోనే మళ్లీ మోగింది ఫోన్. దుప్పటి తొలగించి బెడ్ పై లేచి కూర్చున్నాడు. ఫోన్ అందుకున్నాడు. పగిలిన స్క్రీన్ పై విజయ్ పేరు కనిపిస్తున్నది. ‘ఇంత పొద్దున్నే చేశాడేందో?” అనుకొని లిఫ్ట్ చేశాడు. “హలో రెడ్డి ఎలా ఉంది ఆరోగ్యం? నాకు నిన్ననే తెలిసింది నీ గురించి. రాత్రి వద్దామనుకున్నాను. వర్షం పడటంతో రాలేదు. ” అన్నాడు. వింటున్నాడు రాజారెడ్డి. –
“అవును మీ ఇల్లు ఎక్కడ?.” అడ్రస్ చెప్పాడు.
“నేను ఓ గంటలో వస్తాను” అని ఫోన్ పెట్టేశాడు. ‘ప్రశాంతంగా కాసేపు పడుకుందామంటే వీడు ఇప్పుడే రావాలా?” అనుకున్నాడు. కళ్లపై తేలియాడుతున్న కొద్దిపాటి
నిద్ర ఎగిరిపోయింది. లేచి కూర్చున్న మాటగానే కదల్లేకపోతున్నాడు రాజారెడ్డి. ఒళ్లు సహకరించడం లేదు. నొప్పులుగా ఉన్నాయి. కాళ్లు పట్టేసినట్లు అలాగే కూర్చున్నాడు.
రాత్రి వనజపై కోపంతో వర్షంలో తడిసిన ఎఫెక్ట్ ఇపుడు తనకు కనబడుతున్నది. అలా నిలబడి భార్యపై కసి తీర్చుకుంటున్నానని అనుకున్నాడు. ఇపుడు ఆ కసి తన శరీరం పైనే పడిందని తెలుస్తోందతనికి. వనజ గర్తుకు రాగానే అటువైపు చూశాడు. ఊహూ ఇంకా లేవలేదు. కనీసం కదలికలు కూడా లేవు.
జ్వరం వచ్చినట్లుగా అనిపించింది రాజారెడ్డికి. కుడిచేతిని మెడభాగంలో పెట్టిచూసుకున్నాడు. కొంచెం వెచ్చగా ఉన్నట్లు తోచింది. ‘వామ్మో .. కరోనా లక్షణాలైతే కావుకదా. తలనొప్పి, జ్వరం… ఇవి దాని లక్షణాలే’ అనుకున్నాడు. ఇంకేమేమి లక్షణాలుంటాయో ఆలోచిస్తున్నాడు. వాసన తెలియదు కదా అనుకొని వెళ్లి కిటికీలో ఉన్న జండుబామ్ మూత తీసి వాసన చూశాడు. అది ఘాటుగా ముక్కుపుటాలకు తాకింది. వెంటనే ముఖాన్ని అంతే విసురుగా వెనక్కి తీసుకున్నాడు ఆఘాటుకు. ‘హమ్మయ్యా వాసన తెలుస్తున్నది. అనుకున్నాడు మనసులో. పట్టరాని సంతోషం కలిగింది రాజారెడ్డికి. కరోనా కాదని తనకు తాను నిరూపించుకునే సరికి.
బయటకు నడిచాడు. బయట చల్లటి వాతావరణానికి కొంచెం హుషారొచ్చింది. ఇదే చోట రాత్రి నరకయాతన పడ్డాడు. ఇపుడు సేద తీరుతున్నాడు. కొన్ని గంటల్లోనే ఎంత తేడా. కాలం ఎంత మహత్తరమైనది. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ‘అపుడే ఈ జీవితం ఎందుకు రా’ అని అనిపించేలా చేస్తుంది. ‘ఈ జీవితం ఎంత హాయి’ అని మరునిమిషం తన్మయం చెందేలా పరిస్థితులు మారుస్తుంది. ఎప్పుడు ఏమవతుందో తెలియదు కదా. ఓపికగా మనం అన్నీ చూడాల్సిందే. భరించాల్సిందే. అనుభవించాల్సిందే. తన్మయం చెందాల్సిందే. కరిగిపోవాల్సిందే. కన్నీళ్లు కార్చాల్సిందే. ఆనంద భాష్పాల పులకింత పొందాల్సిందే. అన్ని రుచులూ చూడాల్సిందే. అన్ని కాలాలు గడపాల్సిందే. అన్ని కష్టాలు ఓర్చాల్సిందే. సుఖాలలో ఓలలాడాల్సిందే.
జీవితం గమనం సాగాల్సిందే. బతుకు పోరు కొనసాగించాల్సిందే. హాయిగా వూగుతూ తన్మయం పొందుతున్న వేప చెట్టును చూస్తూ ఆలోచిస్తున్నాడు రాజారెడ్డి.
నిన్న రాత్రి ఈదురుగాలులకు పిశాచిలా కనిపించిన ఆ చెట్టు ఇప్పుడు ఎంత నిర్మలంగా ఉంది. కళ్ళు మూసుకుని ఆశీర్వదిస్తున్న దేవీ మాతలా నిండు విగ్రహం తో గంభీరంగా కనిపిస్తుందది.
(ఇంకా ఉంది)
