“ఏమంటున్నారు ఆఫీసులో?” అన్నాడు రాజారెడ్డి.
“ఏముంది? అదే టార్గెట్లు ఏమయ్యాయి? ఎంత చేశావు? దసరాకు ఎన్ని యాడ్స్ చేస్తావు? రేపు మీటింగు ఉంది పైసలు తీసుకొని రండి.. గివే ముచ్చట్లు” అన్నాడు.
వింటున్నాడు రాజారెడ్డి. “వీడు రూపాయి ఇచ్చేది ఉండదు. జీతగాళ్లలెక్క బానిస లెక్క నోటికొచ్చింది మాట్లాడుడు, చేస్తవా చస్తావా అని బెదిరిచ్చుడు. థూ ఇదేం జీవితం రెడ్డి” అన్నాడు. చాయ్ కప్పు కింద పెట్టాడు.
“ఇంట్లో వాళ్లకే మనం భయపడం….. వీడికి మాత్రం భయపడిచస్తున్నామనుకో. వాడి ఫోన్ వస్తే వణుకు పుడుతున్నది” అన్నాడు.
“ఇందులో పనిచేసేకన్నా ఓ పాన్ కోకా పెట్టుకోని బతికింది నయమనిపిస్తుంది” అన్నాడు నారాయణరెడ్డి. “నీతో కాదులే” అని అనుకున్నాడు రాజారెడ్డి మనసులో. ‘ఎన్నిసార్లన్నావు ఈ మాట’ అని అనుకున్నాడు.
“ఈ కరోనా వేళ బయటకు వెళ్లామంటే భయం. ఎక్కడ అది అంటుకుంటుందో అని. అది అంటుకుంటే ఇగ నాపని ఔటే. నీతో మాట్లాడి బాగా రోజులైందని వచ్చిన” అన్నాడు.
“ఈ టైంల.. మీరెటుపోతే మాకేంది? అనే రీతిలో ఆ పరమేశ్ గాడి మెసేజ్ లు చూస్తే ఒళ్లు మండిపోతున్నది రెడ్డీ. దెంగెయ్ రా నువ్వు నీ ఉద్యోగం అని బూతులు తిట్టి రాం రాం చెప్పాలనిపిస్తుంది” అన్నాడు. చల్లటి చమటలు పడుతున్నాయి అతనికి. చేతితో తుడుచుకుంటున్నాడు.
“ఇగ ఈ పత్రికల పని అయిపోయింది….. ఇన్నేండ్లు చూసిన. ఇప్పుడు మరీ దారుణమయ్యింది పరిస్థితి” అన్నాడు.
రాజారెడ్డి మౌనంగానే ఉన్నాడు. ఏం మాట్లాడటం లేదు. దిక్కులు చూస్తున్నాడు. అతడు ఎప్పుడు వెళ్లిపోతాడా అని అన్నట్లుంది అతని వాలకం.
ఆటో రవి కేకేస్తున్నాడు. వనజ ఆదరాబాదరా వెళ్లిపోతున్నది. పోతూ పోతూ.. “అనన్య .. గ్యాసు అయిపోయింది… తీసుకురమ్మను” అని అరుచుకుంటూనే వెళ్లిపోతున్నది. “కరెంటు బిల్లు రెండు నెలలది పెండింగ్ లో ఉన్నది..” అన్నది ఆటోలో కూర్చున్న తర్వాత ఇంటి వైపు చూస్తూ.
“ఆరోగ్యం బాగాలేదని తెలుసు, ఉద్యోగం ఊడిందనీ తెలుసు… అయినా దీని కఠిన హృదయం కరగదే. ఇసుమంత జాలి కూడా కలగలేదా? మనుషులు ఇలా కూడా ఉంటారా?? కాదు కాదు … పెండ్లాలే ఇలా వుంటారు. అవును. పెండ్లాలకు హృదయాలుండవు. వాళ్ళ దృష్టి లో మొగుళ్లంటే సంపాదించే మిషన్లు. అంతే. థూ…”
కసిగా తిట్టుకున్నాడు రాజారెడ్డి. నారాయణరెడ్డి తీక్షణంగా రాజారెడ్డిని చూస్తున్నాడు. అతని హావభావాలు గమనించాడు.
“నీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది రెడ్డీ. ఏదో ఒకటి చెయ్యి… తప్పదు” అని లేచాడు. సానుభూతి చూపడం తప్ప తను చేసేదేమీ లేదనుకున్నాడు. “ఇంటింటా మట్టిపొయ్యే బంగారు పొయ్యి ఎవరికుండదు.
కానీయ్ ….”అని బయటకు నడిచాడు.
అతను వెళ్తున్నవైపే చూస్తుండిపోయాడు కొద్ది సేపటి వరకు రాజారెడ్డి.
అనన్య వచ్చింది. స్టూల్ పై ఉన్న గ్లాసులు తీసేసింది. పులి హోరా తెచ్చి పెట్టింది ప్లేట్లో. రాత్రి అన్నం మిగిలితే పులి హోరా చేస్తుంది వనజ.
పులి హోరా తినకముందే , గ్యాస్ బుక్కు, కరెంటు బిల్లు రిసిప్టు అక్కడే పెట్టి వెళ్లిపోయింది. ఫ్యాన్ గాలికి ఆ బిల్లు రెపరెపలాడుతున్నది. అది తనను వెక్కిరిస్తున్నట్లుగా తోస్తున్నది రాజారెడ్డికి.
పులి సూరా ప్లేట్ తీసుకొని అందులోని చెంచాతో ఒక బుక్క నోట్లో పెట్టుకున్నాడు. జివ్వుమన్నది నాలుక. కళ్లు మూసుకున్నాడు. పుల్లగా ఉంది అది. చింత పులుసు ఎక్కువయినట్లుంది.
నాలుగు స్పూన్లు తిని పక్కన పెట్టేశాడు. –
ఫోన్ అందుకున్నాడు. ఎవరూ ఫోన్లు చేయడం లేదు. ఒకప్పుడు ఎంతో బిజీగా ఉండే తన ఫోన్ మౌనవ్రతం తీసుకున్నట్లుగా మూగబోయి ఉంది. మెసేజ్ లూ లేవు.
నెట్ ఆన్ చేశాడు .
ఫేసుక్కు చూస్తున్నాడు.
” కపుల్ చాలెంజ్…..” దంపతులు ఫోటోలు పెట్టుకొని మురిసిపోతున్నారు. వాళ్లను చూస్తే నవ్వొస్తున్నది రాజారెడ్డికి.
“ఎంత నటన.? ఇంట్లో కొట్టుకుంటారు. తిట్టుకుంటారు. ప్రపంచానికి మాత్రం నవ్వుతూ ఓ ఫోటో. మాలాంటి జంట ఇంకెక్కడా ఉండదు అన్నట్లుగా. చూడండి చిలుకా గోరింకల్లా మేమెలా ఉన్నామో అన్నట్లుగా,
జాతికేదో సందేశం ఇస్తున్నాము అని కూడా అనుకుంటారు కాబోలు” అనుకున్నాడు.
“ఆ పోస్టులు పెట్టేది ఎక్కువగా మగ వెధవలు. మొగుళ్లే.” అనుకున్నాడు. “సిగ్గు లేదురా మీకు? పెళ్లి చేసుకోవడంతోనే మీరు సగం సచ్చిపోయారు. ఆ తర్వాత సంసారం,
పిల్లలు అని చంకనాకిపోయారు. అయినా మీకు సిగ్గు రాలేదు. ఏదో ఘనకార్యం చేసినట్లు ఆ ఫోటోలేందీ? పైగా చాలెంజ్ అంట. అంటే మీరూ మీ పెళ్లంతోని ఇలా ఫోటో పెట్టే ధైర్యం ఉందా? అని అడుగుతున్నారా?”
“ఏందో ఈ గాడిదకొడుకుల పిచ్చి.” ఎంత తిట్టుకున్నా కసి తీరడం లేదు. చాలా ఫోటోలు గమనిస్తున్నాడు. మొగుళ్లే పళ్లికిలించి కనిపిస్తున్నారు. పెండ్లాలు తెచ్చి పెట్టుకున్న నవ్వులే. ఆ ప్లాస్టిక్ నవ్వులను చూస్తేనే తెలుస్తుంది వాడిని చేసుకొని ఎంత నరకం అనుభవిస్తున్నామో అని చెప్పకనే చెప్తున్నారని.”
“వాళ్లే నయంరా మీకన్నా. ఉన్నది ఉన్నట్లు చెప్తున్నారు కనీసం. ఈ మగవెధవలే పచ్చి మోసగాళ్లు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచే నటన అలవాటు చేసుకుంటారు. పెండ్లాల ప్రాపకం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఏం నటనరా మీది? ఆడంగి వెధవల్లారా!”
“ఎందుకురా మీ బతుకులు…? ఏ యేట్లోనే దూకి ఆత్మహత్య చేసుకోండిరా.” చివరగా అనుకున్నాడు. గట్టిగా అరవాలనుంది రాజారెడ్డికి.
తన జీవితం గుర్తుకొచ్చింది. పెళ్లి చేసుకోవడం వల్లే తానిలా అయిపోయానని బాధపడ్డాడు. లేకపోతే “ ‘రాజా’ లాగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని కదా” అని అనుకున్నాడు.
“పిల్లల కోడిలా ఇపుడిలా దారుణమైన రోజులు రాకపోయేదికదా” అని మదనపడ్డాడు. మరో పోస్టు. పరువు హత్య. “ప్రేమ దోమ అని తీసిన సిన్మాలను ఎగబడి చూస్తారు పిల్లా జెల్ల అంత. ఇపుడు ప్రేమ పెళ్లి చేసుకుంటే మాత్రం హత్యలు చేస్తారు. క్లారిటీ లేదు జనాలకు చీ చీ” అనుకున్నాడు.
“ఆ ప్రేమ సిన్మాలో విలన్లు తల్లిదండ్రులే. అందులో అదే నీతి కదా. పాపం పిల్లలూ అదే నేర్చుకుంటున్నారు. జీవితమంటే ప్రేమించినోడిని దక్కించుకోవడమే అని నూరిపోస్తున్నారు. ఉద్యోగం వద్దు సజాగం వద్దు. ఏం కడుక్కతాగుతారో తర్వాత” అనుకున్నాడు.
అసహనం పెరిగిపోతున్నది అతనిలో.
ఆ అమ్మాయి మీడియా ముందు మాట్లాడుతున్నది. “చిన్నప్పట్నుంచి నీ మూతి ముక్కూ కడిగి అడిగినవన్నీ కానిచ్చాడు కదే నీ అయ్య ఇపుడు విలన్ అయ్యిండా?”
తిట్టుకుంటున్నాడు రాజారెడ్డి. “అవునూ మరి నా బిడ్డ పరిస్థితి? ఇది కూడా ఎవడితోనో లేచిపోదు కదా?” ఆ ఆలోచన రాగానే ఒళ్లు జలధరించింది. “అలా చేయదు నా బిడ్డ.”అని అనుకున్నాడు. “బుద్ధిగా చదువుకుంటున్నది” అని మనసు నిమ్మలం చేసుకున్నాడు. చదవు అనగానే ఫీజుల విషయం గుర్తొచ్చింది. “గ్యాసు, కరెంటు బిల్లు, ఫీజులు, నాకు మందులు… – ఇవన్నీ ఎలా తీసుకు రావాలి? జేబులో చిల్లిగవ్వ లేదు.”
మైండ్ హీటెక్కుతున్నది. “విఠల్ ను ఓ ఐదువేలు అప్పుగా అడిగితే?” “ఛీ ఛీ వాడా? థూ వాని దగ్గర అడిగే బదులు బిచ్చం అడుక్కున్నది మేలు” అని అనుకున్నాడు. “ఇంకెవరున్నారు?”
తన దగ్గర ఉన్నప్పుడు ఎవరికి పడితే వారికి సాయం చేసేవాడు. వారు అడగకున్నా సరే. వాళ్లు తనను మెచ్చుకుంటుంటే చూసి మురిసిపోయేవాడు. అందులో ఓ కిక్కుండేది. ఆ కిక్కు అనుభవించిన వారికే తెలుస్తుంది అని అనుకునేవాడు రాజారెడ్డి.
ఇపుడు తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎవరినీ అడగలేకపోతున్నాడు.
“వాళ్లేం అనుకుంటారో? నా పరిస్థితి ఇంతలా దిగజారిందని తక్కువ చేసి చూస్తారేమో? వాళ్ల ముందు చులకనైపోతానేమో??”
ఆ ఆలోచనలు మదిలో రాగానే ఎవరినీ అడగొద్దనుకున్నాడు. “మరెలా???” మళ్లీ విఠల్ దగ్గరకే వచ్చి ఆగాయి ఆలోచనలు. “తప్పదా?” “అడిగితే ఎలా స్పందిస్తాడో?? ఇస్తాడా?” “భార్యని అడిగి చెప్తానంటాడా?” “చీ భార్యనడిగి ఇస్తే మాత్రం తీసుకోవద్దు” అని అనుకున్నాడు.
“అయినా నేను వెళ్లి వాడి పెండ్లాన్ని డైరెక్ట్ గా అడగటం లేదు కదా! నేను విఠల్ ను అడుగుతాను.” అని సర్ది చెప్పుకున్నాడు.
“ఇపుడు వెళ్లాలా? ఉంటాడా??” మెల్లగా లేచాడు. గేటు దగ్గరికి వెళ్లి చూశాడు. విఠల్ ఇంటి బయట స్కూటీ ఆగి ఉంది. విఠల్ ఇంట్లోనే ఉన్నాడు. ఫ్రెష్ అయి వెళ్తామని ఇంట్లోకి వచ్చాడు. ఫోన్ రింగవుతున్నది. “ఎవరా ? ” అని చూశాడు. శ్రీధర్. “హలో” అన్నాడు. అవతల ఆందోళనగా గొంతు ధ్వనించింది. శ్రీధర్ ఒక్క ముక్కలో సమాచారమిచ్చి ఫోన్ పెట్టేశాడు. “ఎప్పుడు?” అని రాజారెడ్డి అడిగేలోపే ఫోన్ డిస్ కనెక్టయ్యింది. తను నమ్మలేకపోతున్నాడు. అది నిజం కాకపోతే బాగుండు అనిపిస్తున్నది అతనికి. “నరసింహం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడా?” “మన జీవితాలు విషాదాంతాలే రెడ్డి” నరసింహం తనతో అన్న చివరి మాటలు చెవుల్లో మార్మోగుతున్నాయి. “నరసింహం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడా?” కలలో కూడా ఇలా జరుగుతుందని రాజారెడ్డి అనుకోలేదు. “ఎంత ధైర్యవంతుడు… అందరికీ ధైర్యం చెప్పేవాడు. చివరకు ఇలా దైన్యంగా జీవితాన్ని ముగించేశాడా?” ఆలోచనల సుడులు రేగుతున్నాయి రాజారెడ్డిలో. “నెలకు ముప్పైవేల ఖర్చుంది అన్నా… ఉద్యోగం ఉన్నా లేకున్నా ప్రతినెల కచ్చితంగా పైసలు కావాల్సిందే..” నరసింహం భార్య తనతో అన్న మాటలు కూడా గుర్తొచ్చాయి.
అప్పటికే అనారోగ్యంతో ఉన్న నరసింహానికి ఇంట్లో విధించిన నెలవారీ టార్గెట్ గుండెల మీద కుంపటిలా మారిందని ఆనాడే రాజారెడ్డి గ్రహించాడు.
కానీ అప్పటికే పీకల్లోతు కష్టాల్లో, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నరసింహం కూరుకుపోయాడు. అతన్ని పైకి లాగడం సాధ్యం కాదని ఆనాడే తెలిసిపోయింది.
కానీ అది జీవితాన్ని చిధిమేస్తుందని అనుకోలేదు. “నరసింహానిది ఆత్మహత్య కాదు… హత్య.” “ఎవరు చేశారు?
“అతని భార్యే. అవును అతని భార్యే అతన్ని చంపేసింది. పిండి కొలది రొట్టె అన్నారు. ఈ రిపోర్టర్ గిరీ వెలగబెట్టి ఎంత సంపాదిస్తాడని అంత పెద్ద ఖర్చుల భారం మోపింది తనపై.”
మదిలో ఆలోచనలు చికాకు పెడుతున్నాయి. “లెక్కాపత్రం లేకుండా ఇష్టానుసారం ఖర్చుచేసి అప్పులు పెంచేసుకొని, వాటిని తీర్చేందుకు మరిన్ని అప్పులకు ఎగబడి… ఎట్ల చేస్తావో చెయ్యి… సంపాదించు.. అంటే ఎక్కడ్నుంచి తెస్తాడు.” “ఇగో అందుకే ఇలా చచ్చాడు…. ” తనంతట తానే నిర్ధారణకు వచ్చాడు. నరసింహం భార్యను కసితీరా మనసులో తిట్టుకున్నాడు.
“దొంగముండా … మొగుణ్ణి పొట్టన పెట్టుకున్నది. పుట్టగతుల్లేకుండా పోతుంది…..” శాపనార్థాలు కూడా పెట్టాడు. “భార్యలందరూ చివరకు భర్తల ప్రాణాలు తీసేవారే”
తనకు తానుగా ఓ తీర్మాణానికి వచ్చాడు. కసిగా వాళ్లందరినీ తిట్టుకున్నాడు. భార్యలను నెత్తిన పెట్టుకున్న భర్తలనూ ఓ రౌండ్ తిట్టుపోశాడు. అప్పుడు మనసు చల్లబడింది. నారాయణరెడ్డి నుంచి ఫోన్ వస్తున్నది.
“హలో ” అన్నాడు అన్యమనస్కంగానే. “రెడ్డి… నీకు తెలిసిందా…. మన నరసింహం…..” అతను పూర్తి చేయకముందే… “తెలిసింది” అన్నాడు ముబావంగా. అక్కడ నుంచి కొన్ని క్షణాలు ఏమీ మాటలు రాలేదు. “వస్తావా?” అన్నాడు నారాయణరెడ్డి. “రాలేను… నా మనసు బాగలేదు…” అని పెట్టేశాడు.
*****
విఠల్ ఇంటి ముందు వరకు వెళ్లాడు కానీ లోపలికి వెళ్లేందుకు వెనుకాముందాడుతున్నాడు రాజారెడ్డి.
నరసింహం ఆత్మహత్య తాలుకూ బాధ నుంచి బయటపడలేకపోతున్నాడు. అతన్ని నరసింహం జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. చాలా సేపు ఇంట్లో ఓ మూలకు ఒంటరిగా కూర్చున్నాడు. ఏకాంతంగా గడిపాడు. వెక్కివెక్కి ఏడ్చాడు. జీవితం అంటేనే భయంగా తోచసాగింది రాజారెడ్డికి. ఈ కరోనా కాలంలో ఎవరి జీవితాలు ఎటు మలుపు తిరుగుతున్నాయో? ఏ విషాదానికి చేరుకుంటున్నాయో తెలవడం లేదు.
జీవితాలపై నమ్మకం లేదు. భవిష్యత్తుపై భరోసా లేదు. సంతోషం జాడ లేదు.. సంతృప్తి ఊసు లేదు… అంతా నిరాశ అగమ్యగోచరం… వైరాగ్యం ….. నిర్వేదం….
ఏవేవో పిచ్చి పచ్చి తలంపులు చేస్తున్నాడు. బుర్ర గిర్రున తిరుగుతున్నట్లనిపించింది. లేచి ముఖం కడుక్కొని విఠల్ ఇంటికి బయలుదేరాడు.
గేటు వద్దకు వెళ్లి విఠల్ అని పిలవాలనుకున్నాడు. పిలవలేకపోయాడు. డోర్ పెట్టి ఉంది. వినిపిస్తుందో లేదోననుకున్నాడు. గేటు తీసుకొని డోర్ వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు.
పిట్టెల చప్పుడు వచ్చినట్లుగా బెల్ మోగింది
లోపల.
రెండు నిమిషాలు గడిచినా డోర్ తెరవలేదు. “పడుకున్నారా?” అనుమానమొచ్చింది. మరో రెండు నిమిషాలు వెయిట్ చేశాడు.
ఉహూ. రాలేదు. మళ్లీ కాలింగ్ బెల్ కొట్టాడు. ఓ ఐదు నిమిషాల తర్వతా డోర్ తెరిచింది లక్ష్మీ. జుట్టంతా చెదిరిపోయి ఉంది.
ముఖం ఆందోళనగా ఉంది. చెమటలు పట్టి ఉన్నాయి. డోర్ తీయడంతోనే “ఏంటీ?” “ఎందుకొచ్చావు??” “ఏం కావాలి???”
ఈ ప్రశ్నలన్నీ మూటగట్టుకొని ఒకేసారి ఆమె ముఖం మీద కనిపిస్తున్నాయి. కళ్లతో, ముడిపడిన భృకుటితో ఆమె అన్నీ ఒకేసారి తనను అడిగేసినట్లు అనిపించింది రాజారెడ్డికి.
లక్ష్మిని కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నాడు రాజారెడ్డి. “విఠల్ తో మాట్లాడాలి..” “చెప్పండి ఏం కావాలి?” గుమ్మానికి అడ్డంగా నిలబడ్డది. మర్యాద కోసమైనా లోపలికి రా అని కూడా అనడం లేదు. “ఛీ ఎంత బతుకయిపోయిందిరా నీది” అనుకున్నాడు రాజారెడ్డి. “కొంచెం మాట్లాడాలి “అన్నాడు. మొహమాటపడుతూనే. “చెప్పండి” అన్నది మళ్లీ. ఆమె ముఖంలో అసహనం, ఆందోళన, బెరుకు, భయం అన్నీ కనిపిస్తున్నాయి. “చెప్పేదాక ఇది లోనికి పోనిచ్చేలా లేదు. దొంగముండా.. ఆ ముఖం చూడు….” అని మనసులో తిట్టుకొని… “కొంచెం డబ్బులు….” పూర్తిగా చెప్పకముందే… “ఎంత కావాలి?” అన్నది టక్కున. ఆమె అలా అడిగే సరికి ఆశ్చర్య పోయాడు. “ఐదు వేలు” “ఉండండి.” అని లోనికి వెళ్లి రెండు నిమిషాల్లోనే డబ్బులతో వచ్చింది. చేతిలో పెట్టింది అన్నీ ఐదొందల నోట్లు.
పచ్చనోట్లు చేతికి తాకగానే శరీరంలో కరెంటు పాస్ అయింది రాజారెడ్డికి. హుషారొచ్చింది. ముఖంలో సంతోషం తాలుకూ ఛాయలు కనిపించాయి.
“థ్యాంక్స్” అన్నాడు. ఇంకా అతను కదలకపోయే సరికి. “సరే అన్నయ్య ఉంటా మరి “అన్నది. ‘ఇక వెళ్తావా’ అని అన్నట్లుగా ఉన్నాయామె చూపులు. విఠల్ తో మాట్లాడకుండా ఎలా వెళ్లాలి. ఈమె లోనికి రానిచ్చేలా లేదు. ఆలోచిస్తున్నాడు రాజారెడ్డి. “విఠల్ తో మాట్లాడి వెళ్తామని” నసిగాడు. “బాత్రూంలో ఉన్నాడు.”
ఏం మాట్లాడాలో తెలియలేదు. “సరే మళ్లీ కలుస్తా” అని వెనుదిరిగాడు. ఇలా తిరిగాడో లేదో డోర్ ‘దబ్బు’ మని వేసేసుకున్నది ఆమె ఆ డబ్బులు భద్రంగా ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. జేబు బరువెక్కింది. మనసు స్థిమితపడ్డది. ఇంట్లోకి నడిచాడు హుషారుగా. వెళ్లి బెడ్ పై కూర్చుని జేబులోని డబ్బులు తీశాడు.
“అబ్బ ఎన్ని రోజులైంది ఇన్ని పైసలు చూసి.” ఏటీఎం మిషన్ నుంచి ఇప్పుడే తీసినట్లు తళతళ మెరుస్తున్నాయవి. నిటారుగా నిలబడి పెళ పెళ లాడుతున్నాయి.
నోట్ల వాసన మత్తుగా తగిలింది ముక్కు పుటాలకు. వాసన పీల్చుకున్నాడు కళ్లు మూసుకుని. గమ్మత్తుగా వుందావాసన.
చేతివేళ్లకు నాలికతో పదన చేసుకొని నోట్లను లెక్కించసాగాడు. మూడు.. నాలుగు…. ఐదు వేలు.. లెక్కించడం పూర్తయినా…… ఒక నోటు ఇంకా చేతిలో మిగిలి ఉంది. ” ఐదొందలు ఎక్కువొచ్చాయే” “ఐదొందలు ఇద్దామా? వద్దా??”
(ఇంకా ఉంది)
