“వాడెవడి గురించో నువ్వు రెచ్చిపోయి పిచ్చిపట్టినట్టుగా ఆ చేష్టలేందిరా నాయన?” అన్నది. దానికి భయంగా ఉంది రాజారెడ్డి ప్రవర్తన చూసి.
“ఎవడెటు పోతే నీకెందుకు? ఏమైపోతే నీకెందుకు?” అన్నది. ఈ ఏదో అందామని నోరు తెరవబోయాడు. తల పై కట్టిన బొప్పి జువ్వుమన్నది. నోరు మూసుకున్నాడు.
“వాళ్లు.. వాళ్లు మంచిగానే ఉన్నారు. తాగుతున్నారు. తింటున్నారు. మధ్యలో నీకొచ్చిన నొప్పేంటట”అన్నది అంతరంగం అసలు విషయానికొస్తూ. “చూస్తూ ఊరుకోమంటావా
“ఊరుకోకపోతే ఏం చేస్తావురా హౌలే. పోయి మొగునితో చెప్తావా?” అన్నది డౌట్ వచ్చి. మాట్లాడలేదు రాజారెడ్డి.
“ఎవడి కర్మకు వాడుపోతాడురా? నీకెందుకు అన్నింటికీ కాలం పరిష్కారం చూపుతుంది రా నాయనా… ఇగ నువ్వు ఆ విషయం మరిచిపో.” అన్నది.
రాజారెడ్డి వినిపించుకోలేదు. అది గమనించిన అంతరాత్మ… “ముందు నీ ఇళ్లు ఆగంకాకుండా చక్కబెట్టుకో రెడ్డి… నా మాటవిను..” బతిమాలుతున్నట్లుగా అడిగింది. “ఉన్న ఉద్యోగం పోయి రోడ్డున పడ్డావు. ఏదైనా పని చూసుకోక… పనికి రాని విషయాలపై ఎందుకు అంత శ్రద్ధ పెడుతున్నావు…?” బుజ్జగిస్తున్నట్లుగా మాట్లాడిందది.
ఉన్నట్టుండి…
వర్షం పటపటా కురవసాగింది ఒక్కసారిగా. క్షణాల్లోనే రాజారెడ్డి తడిచి ముద్దయ్యాడు. అప్పటి వరకు లేవడానికి సహకరించని శరీరంలో కొత్త బలం వచ్చినట్లుగా వడివడిగా లేచే ప్రయత్నం చేస్తున్నాడు. లేచి కుంటుతూనే లోనికి వెళ్లాడు. అలాగే బెడ్ పై పడిపోయాడు. తడిచిన బట్టలతోనే.
*****
బారెడు పొద్దెక్కినా లేవలేదు రాజారెడ్డి.
ఉదయం లేచిన భార్య తెరిచి ఉంచిన డోర్ చూసి అనుమానంతో భర్తను గమనించింది. గాయాలతో అపస్మారకస్థితిలో పడిపోయిన భర్తను చూసి భయపడింది. వెంటనే వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ నాగేందర్ కు ఫోన్ చేసింది.
అతడు వచ్చి లేపిన తర్వాత గానీ లేవలేదు రాజారెడ్డి. మగతగా కళ్లు విప్పి చూసే సరికి చుట్టూ భార్య, ముగ్గురు పిల్లలు ఆందోళనగా చూస్తూ కనిపించారు.
నొప్పుల తాలుకూ బాధ మెల్లగా తెలవడం ప్రారంభమయ్యింది మళ్లీ . డాక్టర్ను చూశాడు. పరిస్థితిని అర్థం చేసుకున్నాడు.
రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా రీలులా జరిగిందంతా కళ్లముందు కదలాడాయి. వర్షం పడిన సంగతి గుర్తొచ్చి సంతోషించాడు. రోడ్డుపై రక్తం ఆనవాళ్లు తుడిచి పెట్టుకుపోయినందుకు.
“ఏమైంది రెడీ? ఏమిటివన్నీ గాయాలు.” అడిగాడు డాక్టర్. ఏదో మాటవరుసకు అన్నాడే గానీ ఆయన రాగానే అర్థం చేసుకున్నాడు. తప్పతాగి పడుతూ లేస్తూ ఇంటికి వచ్చాడని.
ఏం మాట్లాడలేదు రాజారెడ్డి. ఇలాంటి కేసులు ఎన్నో చూశాను అన్నట్లుగా చకచకా చికిత్స చేస్తున్నాడు డాక్టర్ నాగేందర్. పిర్రకు ఓ ఇంజక్షన్ గుచ్చాడు.
రాత్రి తగిలిన దెబ్బలతో పోల్చితే అది పెద్దగా నొప్పి అనిపించలేదు. క్షణ కాలం కళ్లు మూసుకొని తెరిచాడంతే.
దూదితో బలంగా అక్కడ రుద్దాడు. తాను తెచ్చుకున్న డబ్బాలోంచే మందులు ఇచ్చాడు. మెడికల్ షాపుకు పోయే అవసరం లేకుండా.
“మూడు రోజులు వాడండమ్మా సరిపోతుంది. తర్వాత కూడా జ్వరం ఉంటే మళ్లీ ఒక ఇంజక్షన్ ఇస్తా” అన్నాడు. భార్య సరే అన్నట్లు తలూపింది.
ప్రిస్క్రిప్షన్ వెనుక లెక్కలు వేశాడు. “మొత్తం అయిదొందలైందమ్మా. నా చార్జి తీసుకోలేదు” అన్నాడు. రాజారెడ్డి రిపోర్టర్ కావడంతో ఉచితంగానే చూస్తాడు నాగేందర్. మందులకు మాత్రం డబ్బులు తీసుకుంటాడు. “నా ఉద్యోగం ఊడిందని తెలియదమో?”అనుకున్నాడు మనసులో రాజారెడ్డి. “తెలిస్తే మరో రెండొందలు వసూలు చేసేవాడేమో” అనుకొని ముఖం పక్కకు తిప్పుకుని కళ్లు మూసుకున్నాడు. “సార్ డబ్బలు మళ్లా ఇస్తా. జీతం రాంగనే” అన్నది వనజ. ఆయన ముందే ఊహించినట్లున్నాడు పరిస్థితి. “సరేనమ్మా మరి వస్తా” అని లేచి తన బ్యాగందుకున్నాడు. బైక్ వెళ్లిపోయిన సౌండ్ క్రమక్రమంగా తగ్గిపోయింది. “అనన్యా… లేచి ముఖం కడుక్కొని టిఫిన్ తినమను…
టాబ్లెట్లు వేసుకోవాలె” అన్నది వనజ. పెద్దకూతురుతో మాట్లాడినట్లుగా.
అక్కడ పెద్ద కూతురు లేదు. ఆ మాటలు వినాల్సినవారి చెవిలో పడితే చాలు ఆమెకు. భర్తపై కోపం వస్తే అంతే. నేరుగా మాట్లాడదు.
పిల్లలతో ఎవరితోనే ఒక్కరితో చెప్పినట్లుగా పొడిపొడిగా చెప్పేసి తన నిరసన తెలియజేస్తుంది.
ఆ నిరసనకు రాజారెడ్డి మానసికంగా గిలగిలా కొట్టుకునేవాడు. ఇప్పుడు మళ్లీ అలాగే ఫీలవుతున్నాడు. “చీ దీనెమ్మ… ఇన్ని దెబ్బలు తగిలి మంచం మీద పడ్డా.. కనీసం సానుభూతి కూడా లేకపాయె” అనుకున్నాడు. “ఇదీ ఒక బతుకేనా?” “చచ్చిపోతే బాగుండు” అనుకున్నాడు. “రాజారెడ్డి ఉన్నాడా అమ్మా?” ఎవరో వచ్చి తన గురించి అడుగుతున్నట్లు తెలుసుకున్నాడు రాజారెడ్డి.
ఎవరా అని లేచి చూడాలనుకున్నాడు. మెడలు నొప్పిగా ఉన్నాయి. లేవనీయలేదు. కుడి చేతిని ఆసరా చేసుకొని లేచి కూర్చున్నాడు. లోనికి వస్తూ కనిపించాడు ఓ పెద్ద మనిషి. “ఎవరబ్బా “అని గుచ్చి గుచ్చి చూస్తున్నాడు రాజారెడ్డి,
అతడు నారాయణరెడ్డి. తను చేసిన పత్రికలోనే పనిచేస్తున్న జర్నలిస్టు. దాదాపు 30 ఏళ్లుగా ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు.
“రెడ్డి ఎలా ఉంది ఆరోగ్యం ?” అడిగాడు నారాయణరెడ్డి.
బాగానే ఉన్నా అన్నట్లు తల ఊపాడు. నవ్వు తెచ్చిపెట్టుకుందామన్నా అది రావడం లేదు. అతని ఆరోగ్యం క్షీణిస్తున్నదని గ్రహించాడు నారాయణరెడ్డి.
“అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది నీలో” అన్నాడు నారాయణరెడ్డి, మరీ బక్కచిక్కిపోయావ్ అని అంటే ఫీలవుతాడని అనలేదు. ఏమీ మాట్లాడలేదు రాజారెడ్డి. “ఉద్యోగం పోయిందని బెంగ పెట్టకున్నావా?” అని అడిగాడు.
అప్పుడే చాయ్ కప్పులతో లోపలికి వస్తున్న వనజ విన్నది ఆ మాటలు. కొంచెం సేపు నిశ్చేష్టురాలై అలాగే నిలబడి చూస్తున్నది రాజారెడ్డిని. ఉద్యోగం ఊడిన విషయం తనకు తెలియనివ్వలేదు ఇప్పటి వరకు. నారాయణ రెడ్డి పుణ్యమా అని తెలిసిపోయింది ఇప్పుడు వనజకు.
ఏదో తప్పు చేసిన వాడిలా ముఖం అటువైపు తిప్పుకున్నాడు. వనజ ముఖం చూడాలంటేనే భయపడ్డాడు. చాయ్ కప్పులు అక్కడే ఉన్న స్టూల్ పై పెట్టింది. అవి పెట్టినప్పుడు ‘టప్’ మని సౌండ్ వచ్చింది. తన కోపాన్ని ,
అసహనాన్ని ఆ విధంగా ప్రదర్శించిందని గ్రహించాడు రాజారెడ్డి.
“ఇలా మొహమాట పడి చాయ్ లు తాగితాగి మరింత ఆరోగ్యం ఖరాబవుతున్నది రెడ్డి” అన్నాడు. అతనికి షుగర్ వచ్చి చాలా యేండ్లే అవుతున్నది. అలా అంటూనే కప్పు చేతిలోకి తీసుకొని సిప్ చేస్తున్నాడు. రాజారెడ్డి తీసుకొని తాగుతున్నాడు. గొంతులో వేడిగా చాయ్ నీళ్లు పడేసరికి కొంచెం హుషారొచ్చింది.

(ఇంకా ఉంది)

You missed