గబగబా పక్క గదిలోకి వెళ్లి డోర్ వేసేసుకున్నది భార్య. రాజారెడ్డి మానసిక స్థితిని అంచనా వేసుకున్నది. తనను చితకబాదుతాడనే అనుమానం వచ్చిందామెకు.
భార్య డోర్ పెట్టుకునే సరికి బయటకు నడిచాడు. చేతులు కడుక్కొని గేటు వద్ద నిలబడ్డాడు. కడుపు కాలిపోతుంది. ఓ వైపు భార్యమీద కోపం .. మరో వైపు ఆకలి.
ఇంతలో..
విఠల్ కేకేశాడు. అటు చూశాడు. తనను రమ్మంటున్నాడు. చీకట్లు ముసురుకున్నాయి. తనను ఇంతకు ముందు ఇంటికి రమ్మన్న విషయం గుర్తొచ్చి అక్కడికి కదిలాడు.
లోపల రూమ్ లోకి తీసుకెళ్లాడు. “రండీ రెడ్డి గారు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మనిద్దరం సిట్టింగ్ వేద్దామని” అన్నాడు.
రూమ్ లో చాప పరిచి ఉంది. ఓ ఫుల్ బాటిల్, గ్లాసులు, తినడానికి స్టఫ్ ఉందక్కడ.
అర్థమయ్యింది రాజారెడ్డికి. మోహమాటపడుతూనే ఓ మూలకు కూర్చున్నాడు. వంటింట్లో నుంచి జగ్గులో నీళ్లు తెచ్చాడు. గాజు గ్లాసుల్లో చేరో పెగ్ కలిపాడు. అక్కడున్న చిప్స్ ను తీసుకొని కరకర నములుతున్నాడు రాజారెడ్డి. ఆకలికి తాళలేక.
“చీర్స్” అన్నాడు విఠల్.
గ్లాస్ లేపి గటగటా తాగేశాడు రాజారెడ్డి. సగం ఖాళీ చేసేశాడు. ఆకలి కడుపుతో ఉన్నందుకేమో గొంతును కోసుకుంటూ అది కడుపులోకి చేరి పేగులను కాల్చుతున్నది. ఆ వెంటనే నిషా జివ్వున నెత్తికెక్కుతున్న ఫీలింగ్ కలుగుతున్నది.
మిగిలిన సగం గ్లాస్ ఖాళీ చేశాడు. మెల్లగా కడుపులో కుదురుకుంటున్నదది. లక్ష్మీ గదిలోకి వచ్చింది పకోడి ప్లేట్ తో. “బాగున్నారా అన్నయ్యా” అన్నది వెళ్తూ. ఆ మాట వినిపించుకున్నా పట్టించుకోలేదు రాజారెడ్డి కావాలనే.
ఆమె ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇంతలోనే బయట బైక్ సౌండ్ వచ్చింది. ఎవరా అని విఠల్ ముఖం చూశాడు రాజారెడ్డి. అది అర్థం చేసుకున్నవాడిలా… “అదే నా ఫ్రెండ్ సలీం..” అన్నాడు.
కళ్లు ఎర్రగా మారాయి రాజారెడ్డికి. ఏమి అనలేదు. మరో పెగ్ తనే పోసేసుకున్నాడు. నీళ్లు కలుపుకున్నాడు. గటగటా సగానికెక్కువ తాగి కింద పెట్టాడు. లోనికి వచ్చాడు సలీం.
“హలో సార్” నవ్వు ముఖంతో పలుకరించాడు.
సన్నని గడ్డం. అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు. ఆరడగులకు తక్కవుండదేమో పొడవు. రివటలా ఉన్నాడు. నవ్వినప్పుడు పలువరుస అందంగా కనిపించింది.
కానీ ఆ పళ్లకు గుట్కా గార పట్టి ఉంది. పాన్ మసాల కంపుతో ఆ నవ్వుకున్న ఇంపు పోయింది.
కళ్ళు పెద్దగా ఉన్నాయి. వేటాడే డేగ కళ్ళను పోలివున్నాయవి. అతన్ని చూడగానే నవ్వుతూ పలకరించాలనిపించలేదు రాజారెడ్డికి. ముభావంగా చూస్తుండిపోయాడు. చేతి కలపలేదు. చెయ్యెత్తి కనీసం విష్ చెయ్యలేదు. మరోపక్కగా సలీం కూర్చున్నాడు. లోపలి నుంచి ఓ గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చింది లక్ష్మీ.
అందులో లిక్కర్ పోశాడు. నీళ్లు చాలా తక్కవగా కలుపుకున్నాడు సలీం. “వీడు ‘కచ్చా’కొట్టేలా ఉన్నాడు. మొండి వెధవ” అని తిట్టుకున్నాడు.
ఒక్క గుక్కలో గ్లాసు ఖాళీ చేశాడు. కల్లు ఎర్రబడ్డాయతనివి. చూడటానికి భయంకరంగా ఉన్నాడు సలీం.
వీడి వాలకం తాగకముందే భయంకరంగా ఉంది. తాగితే రాక్షసుడిని తలపిస్తాడని ఊహించుకుంటున్నాడు రాజారెడ్డి.
అతన్ని చూసేందుకు జంకాడు రాజారెడ్డి. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ది కాలేదు.
మరో గ్లాసు పోశాడు విఠల్. ‘రెడ్డీ సాబ్ చాలా బిజీ. ఈ రోజు అడగగానే టైం ఇచ్చాడు. మన అదృష్టం” అన్నాడు విఠల్.సలీం వైపు చూస్తూ.
“అవును” అన్నట్లు చూశాడు సలీం.
తనకేమీ గర్వంగా అనిపించలేదు. “వీళ్లతో ఇలా బుక్కయ్యానేందిరా బాబు” అనుకున్నాడు. గరం గరం పకోడి లాగించేసరికి ఆకలి చల్లారింది రాజారెడ్డికి. తాగిన మందు నెత్తికెక్కుతోంది. మెల్లగా ఇక్కడ నుంచి జారుకున్నది నయం అనుకున్నాడు.
వాళ్లిద్దరూ ఎదో మాట్లాడుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు. రాజారెడ్డికి ఒళ్ళు భగభగా కాలిపోతున్నది. “నీ యవ్వ అరేయ్…” అనుకున్నాడు. లేచి కుడికాలుతో గట్టిగా తన్నాలని ఉంది అతనికి ఇద్దరినీ. కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇంకా అక్కడుంటే తనేం చేస్తాడో తనకే తెలియదని అర్థమవుతున్నది. ఒళ్ళు కొద్దిగా తూలుతున్నట్లు.. కళ్ళ ముందు నక్షత్రాలు గిర్రున తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. గ్లాస్ లో మిగిలిన మందు గొంతులో పొసేశాడు.
“నేను వెళ్తాను విఠల్.” అని లేచాడు. కొద్దిగా తూలాడు. “అప్పుడేనా?” అన్నాడు. “మీరు కానీయండి. మళ్లీ ఎప్పుడైనా” అని వడివడిగా బయటకు నడిచాడు.
“రెడ్డీ సాబ్ ఔట్ అయినట్లున్నాడు. అప్పుడే” సలీం ముసిముసిగా నవ్వుతూ అన్నాడు. ఆ మాటలు ఈటెల్లా తాకాయి రాజారెడ్డికి.
అతనివంక కొరకొరా చూశాడు. “నీ లాగా నేను పచ్చితాగుబోతుననుకున్నావురా.. నీతి
జాతి లేని కుక్క” కసిగా తిట్టాననుకున్నాడు. తిట్టు బయటకు రాలేదు. రాజారెడ్డి తీవ్రమైన చూపులకు బిక్కచచ్చిపోయాడు సలీం. లక్ష్మీ ఇదేమీ పట్టనట్టు టీవీ చూస్తున్నది.
అందులో ‘బిగ్ బాస్’ గాడిదగొంతు వినిపిస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకొని ముఖం తిప్పుకున్నాడు. గేటు దాక వచ్చి సాగనంపాడు విఠల్. తిరిగి లోపలికి వెళ్లిపోయాడు.
గేటు దగ్గర ఉన్న మెట్లు దిగాడు. పక్కనే సలీం బైక్ స్టాండ్ చేసి ఉంది. దాని హెడ్ లైట్ ఎడమపక్కన రాక్కపోయి ఉంది. బైక్ ఓ సైడ్ గా కిందపడటంతో అలా జరిగిందని గుర్తుపట్టాడు.
బైక్ పక్కగా రెండడుగులు వెనక్కి వేశాడు. ఒక్క ఉదుటన విసురుగా ముందుకు ఉరికొచ్చి ఒక్క తన్ను తన్నాడు బలంగా బైక్ ను.
అది “తప్” మని కింద అడ్డంగా పడిపోయింది. దాని హెడ్ లైట్ ముందున్న రింగు ఊడి పోయి కిందపడింది. గిరగిరా తిరిగి అక్కడే పడిపోయింది.
బైక్ కింద పడగానే వచ్చిన శబ్దం ఇంట్లో వాళ్లకు వినిపించిందా? అని భయపడ్డాడు రాజారెడ్డి. చుట్టూ చూశాడు ఎవరూ లేరు. విఠల్ ఇంటి గేటు వైపు చూశాడు. అక్కడకు ఎవరూ వస్తున్నట్లు కనిపించలేదు. మళ్లీ ధైర్యం వచ్చింది. పడిపోయిన బండి వెనుకవైపుకు వెళ్లాడు. వెనుక లైట్ ను కాలితో బలంగా మరో తన్ను తన్నాడు. అది ‘ఫట్” మని పగిలింది. ఆ తన్ను స్పీడుకు ఆ ఎర్రటి లైటులోకి తన కాలి ముందు బాగం కూడా లోపలికి వెళ్లిపోయింది. అది గుంజినా రావడం లేదు. లుంగీ పైకి ఎగకట్టాడు. తూలుతూనే దాన్ని లాగుతున్నాడు బలంగా. ఒక్కసారిగా అది బయటకు రావడంతో అదుపు తప్పి అలాగే వెనుకకు విరుచుకుపడ్డాడు. కొన్ని క్షణాల్లోనే తల సీసీరోడ్డుకు తగిలి పగిలిపోయి ఉండేది. కానీ చివరి నిమిషంలో అచేతనంగానే కుడిచేతిని రోడ్డుకు ఆనించి కిందపడ్డాడు. కొంత గ్యాప్లో ఆగిపోయింది తల నేలకు తగలకుండా. “అమ్మా” అని మూలిగాడు. బలవంతంగా లేచి నిలబడ్డాడు. కుడి కాలి బొటనవేలి గోరు డిక్కీలాగా లేచి వుంది. దాన్నుంచి రక్తం ఎర్రగా గడ్డలా దారగా వస్తున్నది. నొప్పి భరించలేనంతగా ఉ న్నది. కుడి చేయి మణికట్టు కింద రాసుకుపోయి ఎర్రగా జీరలు పడ్డాయి. ఆ జీరల్లో రక్తం కూరుకుపోయి మెల్లగా ఉ బికి వస్తున్నది. అది చురచురమంటున్నది. బొటనవేలి నొప్పి భరించలేనంతగా ఉంది. లుంగీ అంచు భాగం ఆ వేలిపై పడటంతో అది కూడా రక్తసిక్తమయ్యింది. చేతితో లుంగీ అంచుని తీసుకొని బలంగా వేలిని ఒత్తి పెట్టాడు. ‘అబ్బా’అన్నాడు నొప్పిని భరించలేక. మరో చేత్తో చేతికి తగిలిన గాయాన్ని తుడుచుకున్నాడు. అంతలోనే అక్కడికి రెండు కుక్కలు చేరుకున్నాయి. రాజారెడ్డిని చూసి గుర్తుపట్టి తో కూపుతున్నాయి. వాటిని చూడగానే రాజారెడ్డికి భయం వేసింది. అవి ఎక్కడ మొరుగుతాయోనని గాబరా పడ్డాడు. “జూ.. జూ” అన్నాడు చేతి వేళ్ళను ఆడిస్తూ.
” నేను మీకు తెలిసినవాడినే.. మొరగకండే” అని అభ్యర్థిస్తున్నట్లుంది అది. అవి మొరగడం లేదు కానీ తోకూపుతూ రక్తం కారిన చోట వాసన చూసే ప్రయత్నం చేస్తున్నాయి. వాటి వాలకాన్ని చూసి అక్కడ్నుంచి వెళ్లేలా లేవని భావించాడు రాజారెడ్డి. “హడీ .. హడీ” అని చేతితో వెళ్లగొట్టినట్లు చేశాడు. అవి ‘కుయ్ కుయ్’ మని చెరోదారి పారిపోయాయి.
అక్కడ్నుంచి మెల్లగా బయలుదేరాడు ఇంటికి. నడవడం కష్టంగా ఉంది. కుడి కాలు నేలపై పెట్టగానే జువ్వుమని నొప్పి మెదడుకు చేరుతున్నది. మెల్లగా కాలి చివరి కొన నేలకు ఆనించి వేళ్లను పైకి గాలిలోనే ఉంచుతూ కుంటుతూ కుంటుతూ ఇళ్లు చేరుకున్నాడు. తాను వెళ్లగొట్టిన కుక్కలు మళ్లీ వెనకగా వస్తున్నట్లు గమనించాడు రాజారెడ్డి. అవి
బొటనవేలి నుంచి కారి కింద పడిన రక్తాన్ని వాసన చూస్తూ ముందుకు వస్తున్నాయి. మధ్య మధ్యలో తలెత్తి రాజారెడ్డిని చూస్తున్నాయి భయంగా. వాటిని చూసినా అదిలించలేకపోయాడు. నొప్పిని భరిస్తూ కాళ్లీడ్చుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. గేటు వేయలేదు. “ఎక్కడికి వెళ్లాడో కూడా తెలుసుకోకుండా ఎలా పడుకున్నారో చూడు.. ఒక్క ఫోన్ చెయ్యొచ్చు కదా.” భార్యమీద మళ్లీ కోపం వచ్చింది రాజారెడ్డికి.
ఫోన్ ఇంట్లోనే పెట్టిన విషయం గుర్తొచ్చింది.
భార్యను అనవసరంగా తిట్టాను అని అనుకోలేదు. “ఫోన్ ఇంట్లో పెడితే .. లుంగీ మీద వెళ్లాడు. ఎవరింటికి పోయాడు? అని ఆరా తీయాలిగా…. అలా చేయలేదు. నేనంటే బొత్తిగా గౌరవం, భయం లేకుండా పోయింది.” మళ్లీ
ఓ కారణం వెతుక్కున్నాడు భార్యను తిట్టడానికి. గేటు తీసుకొని లోపలికి వెళ్లాడు. డోర్ దగ్గరగా వేసి ఉంది. ‘ఇంకా గొళ్లెం పెట్టలేదు నయం’ అనుకున్నాడు. ‘ఈ రాత్రికి ఆరుబయటే కుక్క బతుకయ్యేది’ అని కూడా అనుకున్నాడు.
డోర్ దగ్గరగా వెళ్లగానే లుంగీ కాళ్ల మధ్యలో ఇరుక్కొని అదుపు తప్పి ఆమాంతం ముందుకు తూలాడు. తలుపుకు చేతి అడ్డం పెట్టాడు నిలదొక్కుకునేందుకు. అది వెనక్కి వెళ్లపోవడంతో కంట్రోల్ తప్పి గడపపై
బొక్క బోర్లా పడ్డాడు. తల కొద్దిగా గడపకు తాకడంతో అది క్షణాల్లోనే బొప్పి కట్టింది. కళ్లు మగతలు కమ్ముకుంటున్నాయి. లేవడానికి శరీరం సహకరించడం లేదు. అలాగే ఒరిగాడు గడపపై. చల్లటి గాలుల వీస్తున్నాయి. ఆ గాలులు వచ్చి గాయాలకు తాకేసరికి అవి భగ్గు భగ్గు మంటున్నాయి. వస్తున్న మగతను కొరఢాతో కొట్టినట్లుగా గాయాల తాలుకు నొప్పి రాజారెడ్డిని మెళకువగా ఉంచుతున్నాయి. కళ్లు మూసుకొని అక్కడే పడుకోవాలనిపిస్తుంది అతనికి. కడుపులో కుదురుకున్న ఆల్కాహాల్ ఓ వైపు మత్తును కలిగిస్తుంటే, మరోవైపు గాయాలు సలుపుతుంటే ఏమి చేయాలో తెలియక కళ్లప్పగించి ఆకాశానికేసి చూస్తున్నాడు.
“నీది నీకే సక్కగా లేదు.. నీకెందుకు రా ఇవన్నీ తంటాలు?” అంతరాత్మ ప్రబోధం మొదలైంది. ఏం మాట్లడలేదు రాజారెడ్డి. అవకాశం వచ్చినప్పుడల్లా అది తనతో ఆడుకుంటున్నదని అర్ధమయ్యింది.
దానికి సమాధానం ఇచ్చే ఓపిక కూడా లేదు అతనికి.
(ఇంకా ఉంది)
