తలకొట్టేసినంత పనైంది రాజారెడ్డికి. ముఖం ఎర్రగా కందగడ్డలా మారింది. విసురుగా అక్కడ్నుంచి వచ్చేశాడు. చెట్టుకింద తన కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. ‘ఏమైంది?” అన్నట్లు ముఖం పెట్టాడు.
“సారు చాలా బిజీగా ఉన్నాడట. క్యాంపు ఆఫీసుల కలుస్తడంట” అన్నాడు రాజారెడ్డి వ్యంగ్యంగా.
“నేను చెప్పలే. వీళ్లను నమ్ముకుంటే అంతే” అన్నాడు విజయ్. బైక్ స్టార్ట్ చేశాడు. ఇద్దరూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంపు ఆఫీసుకు వెళ్లారు.
అరగంట పడిగాపులు కాసినతర్వాత మెల్లగా వచ్చాడు ఎమ్మెల్యే. లోపల ముఖ్య కార్యకర్తలతో మీటింగు పెట్టుకున్న తర్వాత పిలిచాడు రాజారెడ్డిని. “చెప్పు రెడ్డి ఏంటి సంగతి?” అంతా చెప్పాడు రాజారెడ్డి. “అవును… నాకూ తెలిసింది” అన్నాడు ఆశ్చర్యంగా చూశాడు రాజిరెడ్డి. అతని ఆశ్చర్యాన్ని గమనించి….. మీ
బాస్ పరమేష్ చెప్పాడు” అన్నాడు. “ఓహెూ అందుకేనా నన్ను గంట సేపు కుక్కలా గేటు దగ్గర నిలబెట్టావు” కనీసం సానుభూతిని కూడా చూపని ఆ ఎమ్మెల్యే ముఖం అంద వికారంగా తోస్తున్నది రాజారెడ్డికి. ఖద్దరు బట్టలు వేసుకున్న గంగిరెద్దులా కనిపిస్తున్నాడతను. ‘సరే…. నా టైం బాగా లేదు’ అనుకున్నాడు. “వసుదేవుడు లాంటోడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడట.” అని మళ్ళీ అనుకుని తమాయించుకున్నాడు. ముఖం కొంచెం దయనీయంగా పెట్టి….. “పైన మాట్లాడి నన్ను తిరిగి అందులోనే కొనసాగించండి.” అన్నాడు. కొంచెం సేపు ఆలోచించాడు బాగారెడ్డి. “నేను మాట్లాడలేనబ్బా… ఒకసారి ఫోన్ చేస్తేనే నన్ను పట్టించుకోలేదు.” అన్నాడు. అవమానకరంగా ముఖం పెట్టుకున్నాడు రాజారెడ్డి. ” అన్నా నీ
కోసం ఎంతో చేశాను. నా గురించి కొంచెం కష్టపడు అన్నా.. పనైపోతుంది” అన్నాడు. “నువ్వు నా కోసమే కష్టపడ్డావా? వేరే నాయకుల వార్తలు కూడా మంచిగానే కవర్ చేశావు కదా రెడ్డి.. వాళ్లనెళ్లి అడగొచ్చు కదా” అన్నాడు.
అర్థం కాలేదు రాజారెడ్డికి. అలాగే చూస్తున్నాడు.
“నాకంటే వాళ్ల వార్తలే బాగా వచ్చాయి మన పత్రికలో, కావాలంటే నా దగ్గర ఫైల్ ఉంది. చూపించమంటావా?” అన్నాడు. కళ్లు తిరుగుతున్నాయి రాజారెడ్డికి.
“అంటే …. వీడి శరీరం లో నరనరానా నాపై విషం నింపుకున్నాడన్నమాట.” చల్లటి చమటలు పట్టాయి రాజారెడ్డికి.
“ఏందన్నా అట్లంటవు? వాళ్లు మనవాళ్లే కదా. మీ పార్టీ వాళ్లే కదా.” అన్నాడు అయోమయంగా.
“ అయితే … ఎవరికి ఎక్కువ ప్రయార్టీ ఇచ్చావన్నదే కదా ముఖ్యం. నువ్వైతే నాకు వాళ్లంత ప్రయార్టీ ఇవ్వలేదు” అన్నాడు. నిక్కచ్చిగా.
“పొద్దున్నే వచ్చి.. మీరెటు వెళ్తే అటు వచ్చాను కదన్నా…” అన్నాడు…
రెండు,మూడు మెట్లు దిగినంత పనిచేశాడు. ఇక తప్పేలా లేదనుకున్నాడు. “నాతో తిరిగింది.. నా కార్లో ఎక్కడానికి ఉబలాటపడింది నీ
కోసమే. నీ పరపతి పెంచుకోవడానికే. నా కోసమా?” అన్నాడు.
“అయినా నీకు పండుగకో పబ్బానికో అందరిలా కొంత డబ్బు పంపించానే .. ఇంకేం చేయాలి?” “అంటే నేను అందరిలాంటివాడినేనా అన్నా.. నీకోసం ప్రత్యేకంగా ఏమీ కష్టపడలేదా?” అతని ముఖం చిన్నబోయి ఉంది. కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు అన్నట్లు పాలిపోయి ఉంది.
“అందరిలాంటి వాడివే. అందులో డౌటేముంది? నువ్వు పోతే ఇంకొకడు… వాడూ నా కోసం పనిచేయాల్సిందే. | చేయకపోతే బతికి బట్ట కడ్తాడా?” అన్నాడు వ్యంగ్యంగా బాగారెడ్డి.
“సరే రెడీ …మనం మళ్లీ మాట్లాడుదాం” అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. ‘హలో’ అంటూ పక్కనే ఉన్న వారి రూంలోకి వెళ్లిపోయాడు.
ఫోన్ రాలేదని రాజారెడ్డికి తెలుసు. ఎవరూ ఫోన్ చేయకున్నా తనను తప్పించుకునేందుకు అలా బయటపడ్డాడని | అనుకొని అక్కడ్నుంచి విసవిసా బయటకు నడిచాడు.
*****
“వాడు మళ్లీ చచ్చినా గెలవడు విజయ్… వానికి ఇంతనన్న విశ్వాసం ఉందా? అసలు వాడు మనిషేనా?” కోపాన్ని ఆపుకోవడం రాజారెడ్డి తరం కావడం లేదు. “నేనెంత చేశాను వాడికి? ఛీ ఛీ వెన్నుముక లేని నాయకుడు వాడు” అన్నాడు మళ్లీ..
“రెడ్డి … వదిలేయ్.. కూరిమిగల దినములలో నేరములెన్నడూ కలగనేరవు. మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ… అన్నట్టు అప్పుడు ఆ ఎమ్మెల్యే నీకు నచ్చాడు. నీతో మంచిగా ఉండి పనిచేపించుకున్నాడు. ఎవరి అవసరాలు వారివి. ఇపుడు నీ అవసరం లేదు. అంతే … ఇక వదిలెయ్” అన్నాడు.
ఇద్దరూ ఓ చెట్టు కింద బైక్ ఆపుకొని ఉన్నారు. ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణంతా చెప్పాడు విజయ్ కు రాజారెడ్డి. ఇలా జరుగుతుందని ముందే ఊహించాడు విజయ్. “వేరే చిన్న పత్రికలో వెంట్లోనైనా ట్రై చేయాలా?” అన్నాడు. రాజారెడ్డి.
“దాంట్లోనైతే చాకిరేవులో బట్టలుతికినట్లు నిన్ను ఉతుకుతారు. ఒక్కదెబ్బకు ‘చిరిగిన చెడ్డీ’ అయిపోతావు నీవు” న్నాడు విజయ్. అలా ఘాటుగా అనేసరికి రాజారెడ్డి మనసు చివ్వుకుమన్నది.
“మరి ఏందీ నా పరిస్థితి?” “ఏముంది వేరే ఏదైనా చేసుకో” అన్నాడు. “ఏం చేసుకోవాలి? నీకు ఇదే ఎదురైతే ఏం చేస్తావు?” అన్నాడు రాజారెడ్డి విజయ్ ను. కొద్ది సేపు ఆలోచించాడు విజయ్. “ఏదైనా ప్రైవేటు జాబ్ చూసుకుంటాను.” అన్నాడు. ” అయినా దీనిపై దారం కట్టుకొని కూర్చుంటే ఇది ఆర్చేది కాదు.. తీర్చేది కాదు రెడ్డి…
జాబ్ పోయి మంచిదైందనుకో” అన్నాడు.
కొంత ప్రోత్సహించే విధంగా మాట్లాడాడు.
“సరే నన్ను ఇంటి దగ్గర దించెయ్… ఆకలవుతున్నది” అన్నాడు రాజారెడ్డి. ‘సరే పద’ అన్నాడు.
బైక్ ఇంటి వైపు పోసాగింది. “చౌరస్తా వద్ద ఆపు నేను వెళ్తా” అన్నాడు రాజారెడ్డి. చౌరస్తా నుంచి ఒక కిలోమీటరు దూరంలో రాజారెడ్డి ఇల్లు ఉంది. అక్కడే ఆపాడు విజయ్.
తమకెదురుగా రాజు బైక్ వెళ్తూ వీరిని చూసి ఆపాడు. రాజు… ఓ చిన్న పత్రికలో పనిచేస్తున్నాడు. “ఎటు పోతున్నావ్ రాజు?” అన్నాడు విజయ్. “పార్ట్ టైం పనిచేసుకుంటున్న నీకు తెల్వదా?” అన్నాడు రాజు. “ఏం పని? “ఆశగా అడిగాడు రాజారెడ్డి. “బట్టలు ఇస్త్రీ చేసి ఇంటింటికీ డెలివరీ ఇవ్వడం” అన్నాడు. “అవునా… ఎలా చేస్తావు?” అన్నాడు విజయ్.
“అవసరం ఉన్న వాళ్లు మనకు ఫోన్ చేస్తారు. మనం వాళ్ల ఇంటికి వెళ్లి బట్టలు తీసుకురావాలి. తర్వతా ఇస్త్రీ చేసి తిరిగి ఇవ్వాలి” అన్నాడు.
“మరి నీకు ఇస్త్రీ చేయడం వచ్చా? నీ వృత్తి అది కాదు కదా.” అన్నాడు రాజారెడ్డి.
” వృత్తి కాకుంటే ఏంది బ్రదర్…? పని వచ్చిన ఇద్దరికీ జీతం ఇచ్చి ఓ షాపు పెట్టిన. అందులోనే చేస్తారు. ఫ్రీగా ఉన్నప్పుడు నేను కూడా చేస్తున్నా తప్పేముంది. ?” అన్నాడు.
“మరి ఇపుడెలా ఉంది వ్యాపారం ?” అన్నాడు విజయ్..
“వ్యాపారం’ మాట వినగానే రాజారెడ్డి మనసులో నవ్వుకున్నాడు. “ఇదో వ్యాపారం” అనుకున్నాడు మనసులో వ్యంగ్యంగా.
“కరోనాకు ముందు బాగానే ఉండే విజయ్. ఇపుడు కొద్దిగా తగ్గింది. పర్వాలేదు. ఖర్చులకు సరిపోతున్నాయి.”అన్నాడు.
రాజుకు ఏదో ఫోన్ రావడంతో ‘సరే నేను వెళ్తున్నా” అని వెళ్లిపోయాడు అకడ్నుంచి. విజయ్, రాజారెడ్డి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తర్వాత విజయ్ అన్నాడు.
“మన ఫ్రెండ్ దిలీప్ రెడ్డి కూడా కూరగాయలు ఇదే మాదిరిగా ఇంటింటికి వెళ్లి ఇస్తున్నాడట.. బాగానే వర్కవుట్ అవుతుందట” అన్నాడు.
“నువ్వూ ఏదో ఒకటి చేయ్చొచ్చు కదా” అన్నాడు విజయ్ సలహా ఇచ్చినట్లుగా. “ ఛీ ఛీ అలా చిల్లర పనుల చేయడం నా వల్ల కాదు బాబు” అన్నాడు రాజారెడ్డి. అసహ్యంగా. విజయ్ తనకు అలాంటి సలహా ఇచ్చినందుకు నొచ్చుకున్నాడు. “సరే నేను వెళ్తా మరి. మళ్లీ కలుద్దాం” అని వెళ్లిపోయాడు విజయ్. అక్కడ్నుంచి ఇంటి వైపు ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు రాజారెడ్డి. అప్పటి వరకు అతన్ని ఫాలో అవుతున్న ఓ వ్యక్తి దూరంగా బైక్ ఆపి వీరినే గమనిస్తున్నాడు. రాజారెడ్డి ఒక్కడే కాలినడకన ఇంటికి వెళ్లడం చూసి అతనూ బైక్ మలుపుకొని వెళ్లిపోయాడు. అతడు తమను అనుసరిస్తున్నాడని వాళ్లిద్దరూ గమనించలేదు.
*****
చౌరస్తా నుంచి నడుచుకుంటున్న వెళ్తున్న రాజారెడ్డి దగ్గరకు సడన్ గా వచ్చి ఆగిందో కారు. “ఎవరిదా? ”అని పక్కకు జరిగి డ్రైవింగ్ సీటువైపు చూశాడు. విఠల్ నవ్వుతూ కనిపించాడు. “రెడ్డీ సాబ్ ఎక్కడికి పోయి వస్తున్నావు?” అని అడిగాడు.
” ఆఫీసుకు వెళ్లి వస్తున్నాను.” అబద్దం చెప్పాడు. “రా కార్లో కూర్చో ఇంటికే వెళ్తున్నా” అన్నాడు. “పర్వాలేదు. ఇక్కడేగా” అన్నాడు రాజారెడ్డి. “కూసో బాస్” మొహమాటపెట్టాడు అతను. విఠల్ పక్క సీటులో కూర్చున్నాడు రాజారెడ్డి. “రోజు కారు తీసుకొని ఇంటికి వస్తావా? “అన్నాడు. “లేదు అప్పుడప్పుడు మాత్రమే. వేరే పనిలేకపోతే నా స్కూటీ అక్కడే పెట్టి కారు తీసుకువస్తాను ” అన్నాడు. “ఏంటీ నీకు స్కూటీ ఉందా?” అన్నాడు ఆశ్చర్యంగా రాజారెడ్డి. “అవును” అన్నట్లుగా కళ్లతోనే సమాధానమిచ్చాడు విఠల్. “మరైతే బైక్ పై ఎవరు?” రాజారెడ్డి మనసులో మళ్లీ అనుమానాలు రేగాయి.
“అంటే నువ్వు స్కూటీ పై కాకుండా ఎవరిదైనా బైక్ తీసుకుని వస్తావా?” అన్నాడు. తన కొచ్చిన అనుమానం నివృత్తి చేసుకునేందుకు.
“ఏం ఎందుకలా అడిగావ్? “ ” ఏం లేదు.. మీ ఫ్రెండ్ బైక్ తీసుకొస్తావా అప్పుడప్పుడూ అనీ….” అన్నాడు రాజారెడ్డి. తన అనుమానం బలపడుతున్నది.
“నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి బైక్ నడపడం లేదు.. అది అమ్మేసి స్కూటీ కొన్నాను. దాన్నే నడుపుతాను. అయినా నేను స్కూటీ కూడా లాంగ్ లో వెళ్లలేను. అందుకే వీలైతే ఇంటికే కారు తెచ్చుకుంటున్న మా వోనర్ ది” అన్నాడు.
అతను చెప్పేది పూర్తిగా వినడం లేదు రాజారెడ్డి. “మరి బైక్ పై వచ్చిన వ్యక్తి ఎవరు?” ??? “రెండు మూడు సార్లు విఠల్ ఇంటికి ఆ వ్యక్తి బైక్ పై వచ్చి వెళ్లాడు. ఎవరతను?” “సలీం…….?” “అవును సలీమే.” మొదటిసారి చూసినప్పుడు మాస్క్ పెట్టుకున్నా తను గుర్తించాడు.
కానీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ‘మొన్న వర్షంలో కూడా బైక్ పై వచ్చింది అతడే అన్నమాట.” ‘అది ఏ రోజు… ఆదివారం..” “విఠల్ ఆదివారం నువ్వు ఉన్నావా ఇంట్లో?” అన్నాడు. “లేదు ఆది,సోమ రెండు వారాలు తిరుపతి టూర్ వెళ్లాను బిజినెస్ పనిమీద” అన్నాడు. ఒక్కొక్కటిగా అనుమానం తెరలు తొలిగిపోతున్నట్లు అనిపించసాగింది రాజారెడ్డికి. అంతలోనే ఇల్లు వచ్చేసింది. కారు ఆపాడు విఠల్. ఆలోచనల్లోంచి ఒక్కసారిగా తేరుకున్నాడు రాజారెడ్డి. “రెడ్డీ సాబ్ ఓ గంట తర్వాత ఇంటికి వస్తావా? నీతో చిన్నపని ఉన్నది.” అన్నాడు. “ఎందుకు? ఏంపని??” అడగాలనుకున్నాడు. “సరే” అన్నట్టు తల ఊపాడు. “ఇన్ని ప్రశ్నలు అడిగినందుకు విట్టల్ కు ఏమైనా అనుమానం వచ్చిందా?”
డౌటొచ్చింది.
ఇంట్లోకి వెళ్లాడు. భార్య వనజ వచ్చింది. వంట చేస్తున్నట్లుంది. కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. గబగబా కాళ్లు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు అన్నం ఎప్పుడు వడ్డిస్తారా అని
ఇక ఉండబట్టలేక అడిగేశాడు. కాదు కేకేశాడు. ” వంట కాలేదా? ఇక్కడొకడు వచ్చి గంట సేపైంది. అన్నం కోసం అలమటిస్తున్నాడు” అన్నాడు.
ప్లేట్లో అన్నం తెచ్చి పెట్టింది వనజ. ఆకు కూర వండింది. వేడి వేడి అన్నం పొగలు కక్కుతున్నది. ఆవురావురమని రెండు బుక్కలు నోట్లో పెట్టుకున్నాడు.
కానీ ఆ కూర రుచించడం లేదు. గడ్డి తిన్నట్లుగానే అనిపించింది. ఒక్కసారి ప్లేట్ లోకి చూశాడు. అది ఆకు కూరలా లేదు. పచ్చగడ్డేమోనని అనుమానం వచ్చింది రాజారెడ్డికి. అప్పటికే ఆకలితో ఉన్నందుకేమో కోపం కూడా కలిగింది. “ఇదేం కూర? పచ్చగడ్డి తిన్నట్లుంది ” అన్నాడు.
“నిన్నే వేరే కూర లేదా? ”మళ్లీ కేకేశాడు. ఇక ఉండబట్టలేకపోయింది వనజ. “మరి మీరు రోజు తినేది పచ్చగడ్డే కదా” అన్నది
“ఏనాడైనా నేను వండింది బాగుంది అని అన్నావా? ఇపుడు బాగలేదని ఎందుకు నోరు లేస్తుంది. కూరకు, పచ్చగడ్డికి నీకు తేడా తెలిస్తే కదా” దెప్పిపొడిచింది.
చిర్రెత్తుకొచ్చింది అతనికి. గిన్నె తీసి గిరాటేశాడు దూరంగా. గోడకు తాకి కిందపడ్డది అది. అన్నం చెల్లాచెదరుగా పడింది. ఆకు కూర నేలపై చిమ్మినట్లుగా మొత్తం పరుచుకుంది.
(ఇంకా ఉంది)
