దసరా వచ్చిందంటే భక్తి ప్రపత్తులతో దుర్గామాత పూజల్లో లీనమవుతారు భక్తులు. మాలధారణ వేసి 9 రోజులు నిష్టగా పూజలు చేస్తూ దుర్గామాత మందిరం సన్నిధిలోనే సేద తీరుతారు. భక్తిలో మునిగితేలుతారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్మీర్‌కర్ గోపాల్ మాత్రం పనే దైవం అంటున్నాడు. దుర్గామాత మాలధారణ చేసినా.. కులవృత్తి చేస్తే తప్పేంది అంటున్నాడు. తన కులవృత్తి మటన్ అమ్మడం. దానిమీదే కుటుంబం జీవనాధారం.
మరి మాతంటే భక్తి. ప్రతీ ఏడాది మాలధారణ చేస్తాడు. ఇది నాలుగో సారి. పని లేకపోతే పొట్ట గడవదు. మాత మాల వేసుకోనిదే మనస్సు ఆగదు. భక్తి నిండిన మనస్సులతో మాలధారణ చేస్తాడు. పనే దైవంగా తలచి .. తన పనిలో తాను లీనమవుతాడు. ఇలా నాలుగేండ్లుగా చేస్తున్నాడు. పని పనే సామి.. పనికి దేవునికి ఏం సంబంధం. ఈ పని అయిపోగానే.. స్నానం చేసి భిక్ష చేస్తాను. మళ్లీ స్నానం చేసి పూజలో పాల్గొని దుర్గామాత గుడిలోనే పడుకుంటాను.. అని చెప్తున్నాడీ భక్తుడు.
కొందరు పూర్తిగా మాలధారణ చేయకుండా కండువా వేసుకుని మటన్ కొడతారని, తాను మాత్రం నిండు మాలతో తన పని తాను చేసుకుంటానని చెప్తున్నాడు. అందరూ అతని పనిని మెచ్చుకుంటున్నారు. భక్తిని కొనియాడుతున్నారు. పనే దైవమనే నినాదాన్ని ఏకీభవిస్తున్నారు.
