ఆయన మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పోటీ చేస్తూనే ఉన్నాడు. ఓడిపోతూనే ఉన్నాడు. కానీ ప్రజల వద్దకు వెళ్లడం ఆపలేదు. వారితో మమేకమయ్యే పనికి దూరం కాలేదు. కలసి ఉన్నాడు. కలిసి తిరిగాడు. కలిసి తిన్నాడు. ఉద్యమకాలం నుంచి ఇదే పంథాను అనుసరిస్తూ వచ్చాడు. కానీ ఎన్నికల్లో మాత్రం విజయం వరించడం లేదు.
ఆఖరికి మొన్న ఎన్నికల్లో ప్రజలు అంతా కలిసి ఈయనపై ఎంతో సానుభూతి కురిపించి అంతా ఒక్కటై గెలిపించుకున్నారు. పాపం… ఎన్నిసార్లు ఓడిపోతావురా.. చిన్నా..! ఇగో నిన్ను గెలిపిచ్చినం సూడు… సంతోషమేనా..? అని అతని కళ్లలో ఆనందం చూశారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం తను గెలవగానే మారిపోయాడు. పాత రోజులు మరిచిపోయాడు. ప్రజల విశ్వాసం పట్టలేదు.
తనకు ఆదివారం సెలవు కావాలన్నాడు. ఎవరూ తనను ఆ రోజు డిస్టర్బ్ చేయొద్దని హుకూం జారీ చేశాడు. ఎవ్వరూ ఇంటికి రావొద్దన్నాడు. కనీసం తనకు ఫోన్ కూడా చెయ్యొద్దని చెప్పేశాడు. ఒకవేళ అర్జెంటు పనిమీద ఫోన్ చేసినా స్పందించడు గాక స్పందించడు. వందల సార్లు చేసినా.. డోంట్ కేర్. అదీ పరిస్థితి. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరని, తెలుసుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నారా? ఆయన పేరు నల్లమడుగు సురేందర్. జాజాల సురేందర్ అని కూడా పిలుస్తారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే. కాంగ్రెస్ నుంచి గెలిచాడు. షరా మామూలుగా టీఆరెస్‌లో చేరాడు. టీఆరెస్‌లో చేరినంక అట్లయిండో.. అంతకు ముందే మనషే అలాంటోడో తెలియదు కానీ.. మారిండు. సండే హాలిడే ప్రకటించేసుకుండు. ఎవ్వరినీ కలవడం లేదు.
ఈ షరతు ఇప్పట్నుంచి కాదు.. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర్నుంచీ.. ఆదివారం వస్తే అంతే కదా బాసు..! ఏ ఎమ్మెల్యే దొరకుతాడు చెప్పు.. జనాలకు.. అని అంటారా? నిజమే. వాళ్లు దొరకరు కానీ.. ఈయన మాత్రం బాజాప్తా చెప్పేశాడంట ఆదివారం హాలిడే అని అదీ ఇక్కడ స్పెషాలిటీ. ఎంతైనా ధైర్యవంతుడే బాసు.. ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. అన్ని రోజులూ వారికి సేవ చేయాలా? ఒక సండే వద్దు. ఒక జాలీడే వద్దా..? ఏం వాళ్లకూ పెండ్లాపిల్లలు లేరా? కుటుంబం లేదా? సరదా ఉండదా..?? ఎప్పుడూ ప్రజాసేవ.. ప్రజాసేవ.. అంతేనా..? ఇదేనా జీవితం… ప్రజలు కూడా ఎమ్మెల్యేలా బాధలు అర్థం చేసుకుని.. ఆదివారం మాత్రం వదిలేయండి ప్లీజ్…