“మహారాష్ట్ర టూర్ కు వెళ్తే ఆ రోజు రావడం కుదరదు రాజన్నా! ” అన్నాడు.
అలాగా అన్నట్లుగా తలాడించాడు. ఏదో విషయంపై స్పష్టత వచ్చినవాడిలా ” సరే మళ్లీ కలుద్దాం వెళ్తాను ” అని రయ్యిన బైక్ ముందుకు దూకించాడు.
విఠల్ కు ఏమి అర్థం కాలేదు. ఉన్నపళంగా రాజారెడ్డి అలా వెళ్లిపోవడంతో కొద్ది సేపు కారు అద్దంలోంచి అతని బైక్ ను చూస్తుండిపోయాడు. బైకు చౌరస్తా దాటే వరకు చూసి ఆ తర్వాత తను కూడా కారును స్టార్ట్ చేసి ఇంటి వైపు పోనిచ్చాడు.
రాజారెడ్డి బైక్ నడుపుతున్న మాటేగానీ మదిలో ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. “విట్టల్ లేనప్పుడు సలీం వాళ్ళింట్లో నుంచి ఆ టైమ్ లో వస్తున్నాడు….. ఛీ.. ఛీ.. నా ఆలోచనలు కరక్టేనా…” “వాళ్లిద్దరూ అప్పుడప్పుడు డాబా పై మందు తాగుతారని తెలుసు.
కానీ విట్టల్ ఆ రోజు రాత్రి లేడంటున్నాడు..” విట్టల్ భార్య లక్ష్మీ కి అతనికి…… ఛీ ఛీ తన అనుమానానికి తనకే అసహ్యం కలిగింది. లక్ష్మి అలాంటిది కాదు అని తన మనస్సు గట్టిగా నమ్ముతున్నది.. “అసలు ఆ బైక్ పై దొంగచాటుగా జారుకుంది సలీమేనా?” మళ్లీ కొత్త అనుమానం మొదలైంది. “మరి అతను సలీం కాకపోతే మరెవ్వరు..?” అలోచిస్తున్న రాజారెడ్డి ముందుకు సడన్ గా ఓ కుక్క ఉరికొచ్చింది.
తేరుకొని బ్రేక్ వేసేలోపే అది స్పీడ్ గా వచ్చి ముందు టైర్ ను గుద్దింది. ఆ తాకిడికి బైక్ అదుపు తప్పి రోడ్డు పై పడి రెండడుగుల దూరం జారుతూ వెళ్ళింది.
రాజారెడ్డి ఎగిరిపడ్డాడు.
రాజారెడ్డి ఎగిరిపడటంతో పై జేబులో ఉన్న సెల్ ఫోన్ కూడా అతనికి కొంత దూరంలో పడ్డది. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి రాజారెడ్డిని లేపారు. బైక్ ను పక్కకు తీశారు. టీషర్టు వేసుకోవడంతో మోచేతిపై గీరుకుపోయిన గాయాల తాలుకూ రక్తం కనిపిస్తున్నది. లేచి రాజిరెడ్డి దుమ్ము దులుపుకున్నాడు. తనను కింద పడేలా చేసిన కుక్క ఆమడదూరం నిలబడి ఈ తతంగమంతా చూస్తున్నది తనకేమీ తెలియదన్నట్లు నాలుక బయట పెట్టి వగరుస్తూ.
ఎవరో సెల్ ఫోన్ తీసి ఇచ్చారు. దాని పైన స్క్రీన్ గార్డు పగిలింది. ఆ పగిలిన స్క్రీన్ అద్దంపై రాజారెడ్డి ముఖం ప్రతిబింబిస్తుంది. అది తనను వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది. వెంటనే కాల్ ఒకటి వచ్చింది. ఎవరిదా అని చూశాడు. శ్రీధర్ ఫోన్ చేస్తున్నాడు.
తనకు జరిగింది ఫోన్ లో వివరించాడు. రెండు నిమిషాల్లో శ్రీధర్ అక్కడికి వచ్చాడు. దగ్గరలోని ఆరెంపీ డాక్టర్ దగ్గరకు తీసుకుపోయి చికత్స చేయించాడు. ఇంజక్షన్ ఇచ్చి పంపాడు డాక్టర్. “ఇంత పొద్దున ఎక్కడికి వెళ్లావ్?” అడిగాడు శ్రీధర్. ” నీ దగ్గరికనే బయలుదేరాను. ఇగో మధ్యలో ఇట్ల” అని జరిగింది వివరించాడు. “సరే టిఫిన్ చేశావా?” అన్నాడు. లేదన్నాడు రాజారెడ్డి.
దగ్గర్లోని టిఫిన్ సెంటర్కు వెళ్లారు. అక్కడ టిఫిన్ పార్సిల్ మాత్రమే ఇస్తున్నారు. తినడానికి అవకాశం లేకుండా సుతిలీ దారాలు కట్టారు. శ్రీధర్ ఎప్పుడు అక్కడ టిఫిన్ చేస్తుండటంతో వాళ్లు గుర్తుపట్టి ఇద్దరికి చెరో ప్లేట్ ఇడ్లీలు ఇచ్చారు.
“ బాగుంటుంది తిను. ఇక్కడ చట్నీ ఫేమస్” అన్నాడు శ్రీధర్.
అవురావురమంటూ లాంగించాడు రాజారెడ్డి. డాక్టర్ ఇచ్చిన పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నాడు.
“ఊ చెప్పు ఏం సంగతి?” అన్నాడు శ్రీధర్ “ఇక్కడ కాదు ఎటైనా పోదాం.. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుదాం” అన్నాడు. ” అయితే నడు సిటీ శివారు కొత్తగూడం వరకు వెళ్లాం.. నీ బైక్ ఇక్కడే పెట్టు” అన్నాడు.
ఎక్కడ తనబైక్ పై వెళ్లామంటాడోనని భయపడ్డాడు రాజారెడ్డి. తనబైక్ లో పెట్రోలో ఎప్పుడు అయిపోతుందో తెలియదు. వంద రూపాయల పెట్రోల్ కొట్టించి నాలుగు రోజులైతుంది.
ఊపిరిపీల్చుకొని శ్రీధర్ బైక్ పై ఎక్కాడు రాజారెడ్డి.
ట్రాఫిక్ ను ఈదుకుంటూ బైక్ ఆగుతూ … వేగం పెంచుతూ ముందుకు పోతున్నది. దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, ఔటర్ రింగు రోడ్డు దాటి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు వచ్చారు.
కరోనా వల్ల రామోజీ ఫిల్మ్ సిటీ కళతప్పి కనిపిస్తున్నది.
అబ్దుల్లాపూర్ మెట్, కొత్తగూడెం చేరుకున్నారు. భూదాన్ పోచంపల్లి వైపు పోనిచ్చాడు శ్రీధర్. కొద్దిగా లోపలికి వెళ్లగానే రోడ్డుకు ఎడమవైపు వైన్ షాప్ కనిపించింది. శ్రీధర్ దాని ముందు ఆపాడు.
“ఇంత పొద్దున్నే ఎందుకు?” అన్నాడు రాజారెడ్డి. ” మనకు వేరే పనేం ఉంది బ్రదర్ ” అన్నాడు శ్రీధర్. ” బీర్లు తీసుకుందామా?” అన్నాడు.
“ వద్దులే ఓ హాఫ్ తీసుకొని చెరింత తాగుదాం” అన్నాడు మళ్లీ తనే. శ్రీధర్ దగ్గర కూడా పైసలు ఎక్కువగా లేనట్లున్నవి.
ఐబీ హాఫ్ తో పాటు గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, పల్లీల పొట్లాలు తీసుకొని వచ్చాడు. వాటిని బండి కవర్లో పెట్టాడు .
ఊరు దాటి ఇంకా లోపలికి వెళ్లసాగారు. నిర్మానుష్యంగా ఉన్న ఓ ప్రాంతంలో ఆపాడు. ఇద్దరు దిగి పక్కనే చెట్టు కింద కూర్చున్నారు. ఇద్దరికీ గ్లాసులో మందు పోశాడు. నీళ్లు సమంగా కలిపాడు. చీర్స్ కొట్టి గొంతులో దింపారు.
( ఇంకా ఉంది)
