యాసంగి సీజ‌న్‌లో వ‌రిని పూర్తిగా త‌గ్గించి ప్ర‌త్యామ్నాయ పంట‌ల వైపు రైతుల‌ను తీసుకువెళ్లేందుకు ప్ర‌భుత్వం తీవ్రంగా క‌స‌రత్తు చేస్తున్న‌ది. గ‌తంలో నియంత్రిత సాగు పేరుతో వ‌రి విస్తీర్ణాన్ని త‌గ్గించాల‌ని ప్ర‌య‌త్నం చేసి కేసీఆర్ విఫ‌ల‌మ‌య్యాడు. ధాన్యం కొనుగోలు కూడా చేయ‌బోమ‌ని చెప్పినా రైతులు ప‌ట్టించుకోలేదు. కాగ‌ల కార్యం గంధ‌ర్వులు తీర్చిన‌ట్లు కేంద్రం బియ్యాన్ని తీసుకోమంటూ చెప్పివేయ‌డంతో కేసీఆర్ ఇప్పుడు కేంద్రం బూచీ చూపి యాసంగి సీజ‌న్‌లో పూర్తిగా వ‌రిని కంట్రోల్ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు.

ప్ర‌త్యామ్నాయ పంట‌లైన మొక్క‌జొన్న‌, వేరుశ‌న‌గ‌, ప‌త్తి, పొద్దుతిరుగుడు పంట‌లు సాగు చేసేలా రైతుల‌ను స‌మాయ‌త్తం చేయాల‌ని వ్య‌వ‌సాయాధికారుల‌కు ఇప్ప‌టికే దిశానిర్దేశం చేశాడు. అయితే రైతులు వ‌రి సాగునే ఎక్కువ‌గా న‌మ్మ‌కున్నారు. నీటి వ‌స‌తి బాగుండ‌డంతో పాటు, త‌క్కువ పెట్టుబ‌డితో మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించే పంట‌గా వ‌రిని ఇష్టంగా సాగు చేస్తున్నారు. కానీ ప్ర‌భుత్వానికి ఏటేటా పెరుగుతున్న వ‌రి సాగు భారంగా పెరుగుతున్న‌ది.

ఎఫ్‌సీఐ నిబంధ‌న‌ల‌ను ఆస‌రా చేసుకుని యాసంగి సీజ‌న్ మొత్తానికి మొత్తం వ‌రిని కంట్రోల్ చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్నాడు. అయితే గ‌తంలో మొక్క‌జొన్న పంట‌ను కొన‌బోమ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం ఆ త‌రువాత ఆందోళ‌న చేస్తే దిగివ‌చ్చి మ‌క్క‌లు కొనుగోలు చేసింది. ధాన్యం సేక‌ర‌ణ కూడా ప్ర‌భుత్వం చేయ‌ద‌ని ఒక సంద‌ర్భంలో కేసీఆర్ ప్ర‌క‌టించాడు. కానీ దీనిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో వెన‌క్కి త‌గ్గాడు. ఇప్పుడు రైతుల‌కు ఇదే అదునుగా భావిస్తున్నారు. గ‌ట్టిగా ఒత్తిడి తేస్తే కేసీఆర్ వింటాడ‌ని, వ‌రి సాగుకే పోవాల‌ని రైతులు అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది.

మ‌రో వైపు స‌న్న ర‌కాలు వేద్ద‌మ‌న్న కానీ ఖ‌ర్చుతో కూడుకున్న‌ది కావ‌డంతో పాటు చీడ‌తెగులు వల్ల దిగుబ‌డి త‌గ్గే ప్ర‌మాదం ఉంద‌ని రైతు అటువైపు పోవ‌డం లేదు. నీటి ల‌భ్య‌త సమృద్ధిగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే స‌న్న‌ర‌కాలు సాగు చేస్తున్నారు. మిగిలిన అన్ని చోట్ల దొడ్డు ర‌క‌మే పండిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో వ‌రిని త‌గ్గించి, ఆరుత‌డి పంట‌ల వైపు తీసుకువెళ్ల‌డం అంత ఈజీ అయిన ప‌నేం కాదు. వ్య‌వ‌సాయాధికారులు అవ‌గాహ‌న ప‌రిచినా వారి మాట రైతులు వింటార‌నే న‌మ్మ‌కం లేదు. నియంత్రిత సాగు నినాదం తీసుకున్న సంద‌ర్భంలోనే గ‌ట్టిగా దాని అమ‌లు కోసం కృషి చేస్తే ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల్లో కొంత మార్పు వ‌చ్చి వ‌రి విస్తీర్ణం త‌గ్గే అవ‌కాశం ఉండేద‌ని వ్య‌వ‌సాయాధికారులు భావిస్తున్నారు.