ఇందూరు రాజకీయాల్లో పరిస్థితులు విభిన్నంగా మారుతున్నాయి. మొన్నటి వరకు టీఆరెఎస్‌కు కంచుకోటలా ఉన్న నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు ప్రధాన ప్రతిపక్షం కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు చాలా మంది నేతలను ఇతర పార్టీలలో నుంచి టీఆరెఎస్‌లో చేర్పించారు. పదవులు ఇస్తామనే హామీలను కూడా ఇచ్చారు. ఆ తర్వాత వీరిని పట్టించుకున్న వారు లేరు. మొన్నటి వరకు ఓపిక పట్టిన అసంతృప్త వలస నేతలు.. ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

మొన్నటి వరకు బీజేపీ బలపడుతూ వచ్చింది. రేవంత్ రెడ్డికి పీసీసీ ఛీప్ ఇవ్వడంతో కాంగ్రెస్‌లో కొత్త జవజీవాలొచ్చాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు ఎక్కువవుతున్నాయి. దీంతో ఎలాంటి పదవులు లేకుండా.. పట్టింపు లేకుండా నాయకుల పై అసంతృప్తి, వైరాగ్యంతో ఉండిపోయిన నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం ఇలాంటి నేతలకు గాలం వేస్తున్నాడు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగారు. పార్టీ నాయకత్వాన్ని కాపాడుకునే పనికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిన్న మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డితో భేటీ అయ్యారు. ‘అన్న ఓపిక పట్టండి.. మున్ముందు మనకు మంచి అవకాశాలొస్తాయి.. ఇప్పుడే ఏ నిర్ణయాలు తీసుకోకండి..’ అని నచ్చజెప్పినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లోకి చాలా మందే వచ్చారు.
ఇప్పుడు వాళ్లంతా పక్క చూపులు చూస్తున్నారు. వారికి ఆల్టర్‌నేట్‌గా కాంగ్రెస్ కనిపిస్తోంది. ఇలాంటి వారిని జారి పోనివ్వకుండా కవిత తనదైన శైలిలో ఒక్కొక్కరికి నచ్చచెబుతూ వస్తున్నారు. ఆమె చెప్పినా వారు మాత్రం అసంతృప్తి వీడడం లేదు. అలకపానుపు దిగడం లేదు.

You missed